సమీర్ శర్మకు ఆర్దిక సవాళ్లు

0 8,560

విజ‌య‌వాడ‌  ముచ్చట్లు:

వీడ్కోలు సభలో ఏం మాట్లాడతారు..? రిటైరయ్యే అధికారిని పొగడ్తల్లో ముంచెత్తుతారు. వచ్చే అధికారి నైపుణ్యాన్ని ప్రస్తావిస్తారు. కానీ.. ఆ వీడ్కోలు సభలో రాష్ట్రంలోని బర్నింగ్‌ టాపిక్కే చర్చకు వచ్చింది. రామేశ్వరం వెళ్లినా.. తప్పలేదన్నట్టుగా ఆ అంశంపై మాట్లాడేశారు. ఇదే ఇప్పుడు ఏపీ సచివాలయవర్గాల్లో చర్చగా మారింది. ఇంతకీ ఏంటా టాపిక్కు..?కొంతకాలంగా ఏపీ అనే మాట వినపడితే చాలు.. రాజకీయ, అధికార వర్గాల్లో ఆర్థిక కష్టాల గురించే ప్రధానంగా చర్చకు వస్తోంది. విషయం ఏదైనా.. ఇదో రెగ్యులర్‌ టాపిక్‌గా మారిపోయింది. చివరికి అధికారుల వీడ్కోలు సభల్లో రాష్ట్ర ఆర్థిక కష్టాలే ప్రస్తావనకు వస్తున్నాయి. సీఎస్‌గా పదవి విరమణ చేసిన ఆదిత్యనాథ్‌ దాస్‌కు వీడ్కోలు పలికేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు.. సచివాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిత్యనాధ్‌ దాస్‌ చేసిన సేవలను.. ఆయనతో కలిసి పనిచేసినప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు కొందరు. కానీ.. వీడ్కోలు సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా ఆసక్తికరమైన ప్రస్తావన వచ్చింది.ఆదిత్యనాధ్‌ దాస్‌ సేవలను గుర్తు చేసుకుంటూనే.. ఓ ఐఏఎస్‌ అధికారి చేసిన కామెంట్‌ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టేలా ఉందనే చర్చ జరుగుతోంది. వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న ఆ సీనియర్‌ ఐఏఎస్‌.. సచివాలయంలో పరిస్థితులను వివరించారు. చిన్న చిన్న ఇబ్బందులను కూడా సీఎస్‌ పరిగణనలోకి తీసుకుని.. పరిష్కరించేవారని చెప్పారు. ఇటీవల సచివాలయంలోని చాలా మంది మంత్రులు.. ఉన్నతాధికారుల ఛాంబర్లలో ఏసీలు పనిచేయలేదని చెబుతూనే.. అక్కడితో ఆగకుండా దీనికి కారణం ఆర్థికశాఖే అని చిన్నపాటి సెటైర్‌ వేశారు. ఆ ఐఏఎస్‌ ఏదో అలా చెప్పారులే అని అంతా అనుకుంటున్న తరుణంలోనే.. ఆదిత్యనాధ్‌ దాస్‌ మరో బాణం విసిరారు. కొత్త సీఎస్‌ సమీర్‌ శర్మకు ఆర్థిక వనరుల సమీకరణే ప్రధాన సవాల్‌గా కుండబద్దలు కొట్టేశారు. మీకు సాయం చేయడానికి ఆర్థికశాఖ ఉన్నతాధికారి SS రావత్‌ ఉన్నారని కొంత ధైర్యం చెప్పారు. ఈ రెండు అంశాలూ సాధారణ ప్రస్తావనల్లా అనిపిస్తోన్నప్పటికీ ప్రస్తుతం సచివాలయవర్గాల్లో పెద్దగా చర్చగా మారిపోయాయి.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో.. ఇద్దరూ చక్కగా చెప్పేశారని చెవులు కొరుక్కుంటున్నారు. పైగా ఆదిత్యనాధ్‌ దాస్‌ .. సీనియర్‌ అధికారి రావత్‌ పేరును ప్రస్తావించడంపై చర్చ మరింత వేడెక్కుతోంది. వివిధ శాఖలకు చెందిన చాలామంది ఉన్నతాధికారులతోపాటు ఆర్థికశాఖ అధికారులు.. రావత్‌, మరో ఆఫీసర్‌ సత్యనారాయణల మీద గుర్రుగా ఉన్నారు. తాము పంపిన ఎన్నో ప్రతిపాదనలను తొక్కి పెట్టేస్తున్నారని.. చిన్న పనులు కూడా జరగ్గకుండా అడ్డుపడుతున్నారని అసహనంతో ఉన్నారట. ఇప్పుడు వీడ్కోలు సభే సరైన సమయం అనుకున్నారో ఏమో.. ఓ ఐఏఎస్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ సీఎస్‌ ఏకంగా రావత్‌ పేరు ప్రస్తావించారు. దీంతో అసలు కార్యక్రమంపై చర్చ పక్కకుపోయింది. ఏపీ డబ్బుల కష్టాలే సచివాలయాల వర్గాల్లో బర్నింగ్‌ టాపిక్‌గా మారిపోయింది.

- Advertisement -

గనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Financial challenges for Sameer Sharma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page