అక్టోబ‌రు 30, 31వ తేదీల్లో తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ” గో మ‌హా స‌మ్మేళ‌నం “

0 10,006

– గోశాల నిర్వ‌హ‌ణ-గో ర‌క్ష‌ణ‌-గో ఆధారిత వ్య‌వ‌సాయంపై రైతుల‌కు అవ‌గాహ‌న

– ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి వెయ్యి మంది రైతుల‌కు శిక్ష‌ణ‌

- Advertisement -

– టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి

 

తిరుప‌తి ముచ్చట్లు:

 

తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళా క్షేత్రంలో అక్టోబ‌రు 30, 31వ తేదీల్లో టిటిడి ఆధ్వ‌ర్యంలో యుగ తుల‌సి ఫౌండేష‌న్ మ‌రియు రాజ‌స్థాన్‌లోని ప‌త్ మేడకు చెందిన శ్రీ గోధాం మ‌హాతీర్ధ్ వారి సౌజ‌న్యంతో ” గోశాల నిర్వ‌హ‌ణ-గో ర‌క్ష‌ణ‌-గో ఆధారిత ” వ్య‌వ‌సాయంపై ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన వెయ్యి మంది రైతుల‌కు అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం ” గో మ‌హా స‌మ్మేళ‌నం ” పై మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్బంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ నేటి స‌మాజం ర‌సాయ‌న ఎరువులతో పండించిన పంట‌లు తింటూ ఆనారోగ్యంతో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని, గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పంటల ద్వారా ఉన్న రోగాలను కూడా దూరం చేసుకోవచ్చ‌న్నారు. గోవును పాల కోస‌మే కాక వాటి నుండి ల‌భించే పంచగ‌వ్యాలతో త‌క్కువ ఖ‌ర్చుతో వ్య‌వ‌సాయం చేయ‌వ‌చ్చ‌ని చెప్పారు. గో సంరక్షణకు కృషి చేస్తున్న‌ వారి సలహాలు, సూచనలు తీసుకుంటామ‌న్నారు. యువ రైతుల‌ను ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేసేందుకు ప్రోత్స‌హించ‌డం ద్వారా గ్రామాల‌కు పూర్వ వైభ‌వాన్ని తీసుకురావ‌డంతో పాటు, స‌మాజానికి మంచి పోష‌క విలువ‌లు ఉన్న అహారం అందించ‌వ‌చ్చ‌ని చెప్పారు.ఇప్ప‌టికే టిటిడి గో ఆధారిత వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో శ్రీ‌వారికి నైవేధ్యం స‌మ‌ర్పిస్తోంద‌న్నారు. అదేవిధంగా న‌వ‌నీత సేవ‌, అగ‌ర‌బ‌త్తులు భ‌క్తుల‌కు అందుబాటులోనికి తీసుకువ‌చ్చామ‌న్నారు. త్వ‌ర‌లో ప‌చ‌గ‌వ్యాల‌తో త‌యారు చేసిన దాదాపు 30 ర‌కాల ఉత్ప‌త్తులను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల రైతులు ఈ కార్యక్రమానికి తరలి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

 

 

 

అనంత‌రం ప్రకృతి వ్యవసాయ వేత్త శ్రీ విజయరామ్ మాట్లాడుతూ కోవిడ్ తర్వాత ప్రకృతి వ్యవసాయంపై యువ రైతులు ఆసక్తి చూపుతున్నార‌న్నారు. టిటిడి చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాల ద్వారా రైతులకు మేలు జరగబోతోంద‌ని చెప్పారు. ఇందులో ఎండిన భూమిలో నీటిని దాచుకునే విధానాన్ని, దేశీ ఆవులు, దేశీ విత్తనాల ప్రాముఖ్యత వివరిస్తామ‌న్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎకరాకు రూ.25 వేలు సంపాదించుకునేలా శిక్షణనిస్తామ‌ని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను మార్కెటింగ్ చేసుకునేందుకు రైతులను ఈ కార్యక్రమం ద్వారా టిటిడికి అనుసంధానం చేస్తామ‌న్నారు. గో మహా సమ్మేళనంలో పాల్గొనే రైతుల‌తో గో ఉత్ప‌త్తుల‌తో ప్ర‌ద‌ర్శ‌న, ప్రకృతి సిద్ధ భోజనం వడ్డిస్తామ‌ని చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసే రైతులు కోవిడ్ – 19 నిబంధ‌న‌లు పాటిస్తూ పాల్గొనాల‌న్నారు. గో మహా సమ్మేళనంలో పాల్గొనదలచిన భక్తులు 6309111427, 93904 54573 నెంబర్లకు సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాల‌ని ఆయ‌న వివ‌రించారు.

 

” గో మ‌హా స‌మ్మేళ‌నం ” కార్య‌క్ర‌మాల వివ‌రాలు :

మ‌హ‌తి క‌ళా క్షేత్రంలో అక్టోబ‌రు 30న ఉద‌యం 7.45 గంట‌ల‌కు హోమ‌ము, ఉద‌యం 8.45 గంట‌ల‌కు జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న‌, గో పూజ‌, వృష‌భ‌ పూజ‌, ఉద‌యం 11 గంట‌ల‌కు స‌మావేశం ప్రారంభ‌మ‌వుతుంది. ఉద‌యం 11.30 గంట‌ల నుండి ఇతిహాస కాలం నుండి వ‌ర్త‌మాన కాలం వ‌ర‌కు గోవు యొక్క ఉనికి, దేశీ గో జాతులు-ప్రాముఖ్య‌తపై ఉప‌న్యాసం నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 2.30 రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు గోశాల‌లు- అద‌ర్శ గో శాల‌ల నిర్వ‌హ‌ణ‌, గో పోష‌ణ‌-ప‌శుగ్రాసాలు-జాతి అభివృద్ధి, దేశీ గోక్షీర ప్రాశ‌స్త్య‌ము గురించి శిక్ష‌ణ ఇస్తారు.అక్టోబ‌రు 31న ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు గో ఆధారాత వ్య‌వ‌సాయ‌ము, గో విలువ ఆధారిత ఉత్ప‌త్తులు, వేద‌ముల‌లో గోవు త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌సంగిస్తారు. మ‌ధ్యాహ్నం 2.30 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, గో పూజ‌, దేశంలోని ప్ర‌ముఖ మ‌ఠాదిప‌తులు, పీఠాదిప‌తులు అనుగ్ర‌హ భాష‌ణం ఇవ్వ‌నున్నారు.ఈ స‌మావేశంలో జెఈవో  వీర‌బ్ర‌హ్మం, యుగ తుల‌సి ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ మ‌రియు టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు శివ‌కుమార్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: “Go Maha Sammelanam” on October 30 and 31 at the Mahathi Kalakshetra in Tirupati.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page