వెలగపూడి మీదనే కీలక‌ బాధ్యత

0 7,584

విశాఖ‌ప‌ట్ట‌ణం ముచ్చట్లు:

ఆయన ఎన్టీఆర్ భక్తుడు. ఆపై బాలయ్య వీరాభిమాని, ఇక చంద్రబాబుకు అత్యంత విధేయుడు. ఆయనే విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఆయన ఎమ్మెల్యే కాక ముందు నుంచి టీడీపీకి అచ్చమైన కార్యకర్తగా ఉండేవారు. పార్టీ గెలుపు కోసం ఎన్నో రకాలుగా పాటుపడేవారు. ఇక నియోజక‌వర్గాల విభజన తరువాత చాన్స్ రావడంతో విశాఖ తూర్పు నుంచి 2009లో తొలిసారి ఎమ్మెల్యే అయిపోయారు. నాడు లక్కీ ఎమ్మెల్యే అని అంతా అన్నా ఇప్పటికి మూడు విడతలుగా గెలవడం అంటే ఆషామాషీ కాదు, తూర్పులో మార్పు రాదా అని వైసీపీ డీలాపడుతోంది అంటే వెలగపూడి ఎంతలా స్ట్రాంగ్ పునాది వేశారో అర్ధమవుతుంది.టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఇప్పటికి నలుగురు జారుకున్నారు. ఇలా ఎంతమంది వెళ్లిపోతారో ఎవరికీ తెలియదు. అయితే చంద్రబాబు కచ్చితంగా గుండెల మీద చేయి వేసుకుని చెప్పుకునే వారిలో వెలగపూడి మొదటి స్థానంలో ఉంటారు. టీడీపీలో చివరాఖరుకు ఇద్దరు ముగ్గురు మిగిలినా కూడా వారిలో వెలగపూడి కచ్చితంగా ఉంటారని బాబు లెక్క వేసేసుకున్నారు. ఇక మూడు సార్లు గెలిచినా ఆయన రెండు సార్లు విపక్షంలోనే ఉన్నారు. గత అయిదేళ్ళలో పార్టీ పవర్ లో ఉన్నా కూడా వెలగపూడి వట్టి ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు.

- Advertisement -

మరి చంద్రబాబు ఆయనకు ఏ విధమైనా పదవీ ఇవ్వలేదు. మంత్రి ఆశలు ఉన్నా బాబు సొంత సామాజికవర్గం కావడం అతి పెద్ద మైనస్ గా ఉంది.ఇక సీనియర్ ఎమ్మెల్యేగా విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ రాజకీయాల్లో తన సత్తా చాటాలని వెలగపూడి ప్రయత్నం చేస్తున్నా కూడా అది కుదరడంలేదు. గెలిచిన వెలగపూడి కంటే ఓడిన పల్లా శ్రీనివాసరావు చంద్రబాబుకు ఎక్కువ అయ్యారు. కారణం ఆయన బీసీ కావడం, యాదవ సామాజికవర్గం సిటీలో ఎక్కువగా ఉండడం. దాంతో విశాఖ పార్లమెంట్ ప్రెసిడెంట్ పదవిని తన దగ్గర బంధువు, సీనియర్ నేత అయిన పట్టాభికి ఇప్పించుకుందామని వెలగపూడి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాబుకు ఆయన మీద అభిమానం ఉంది. వెలగపూడికి పార్టీ మీద భక్తి ఉంది. అయినా కూడా పదవులు మాత్రం రావడంలేదు. ఇది ఆయనతో పాటు అనుచరులలో కూడా తీరని మనోవేదనగా ఉందిట.పార్టీ పదవికే ఇంత కసరత్తు చేసినా కూడా చంద్రబాబు ఉత్త చేతులు చూపించాక ఇక విశాఖ మేయర్ పీఠం తన బంధువుకు కట్టబెడతారా అన్న డౌట్ అయితే వెలగపూడిలో ఉందిట. 2007లో పట్టాభి కార్పొరేటర్ గా గెలిచి టీడీపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసారు. అప్పట్లో కాంగ్రెస్ కి మేయర్ పీఠం దక్కింది. మళ్ళీ ఎన్నికలు జరగలేదు. వచ్చే ఏడాది కనుక జీవీఎంసీ ఎన్నికలు జరిగితే పార్టీని గెలిపించే కీలక‌ బాధ్యత వెలగపూడి మీదనే ఉంది. ఎందుకంటే సిటీలో మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేల సంగతి డౌట్. పైగా బలం ఎక్కువగా ఉన్నది తూర్పులోనే. ఇంతాచేసి పార్టీని విజయతీరాలకు చేర్చినా తమ కుటుంబానికి మేయర్ పీఠం బాబు కట్టబెడతారా అన్నది వెలగపూడికి అతి పెద్ద సందేహంగా ఉందిట. బీసీల పేరు చెప్పి మళ్ళీ ఎవరికో కిరీటం పెడితే కష్టమంతా వేస్ట్ అవుతుందని ఆవేదన చెందుతున్నారట. మొత్తానికి విశాఖలో టీడీపీకి కళకళలాడిస్తున్నా రాజకీయంగా మాత్రం వెలగపూడి వెలవెలపోతున్నారని అనుచరులు అంటున్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:The key responsibility is on Velagapudi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page