ధరణి చుట్టూ అనేక సమస్యలు..

0 5,548

-సాగు భూములు ‘నాలా’గా నమోదు

హైదరాబాద్     ముచ్చట్లు:

- Advertisement -

అన్ని భూసమస్యలకు పరిష్కారం చూపుతుందన్న ధరణి పోర్టల్ రైతుల పాలిట గుదిబండగా మారింది. దీంతో సమస్యలు తీరకపోగా కొత్తవి వచ్చిపడ్డాయి. పోర్టల్ లో గ్రీవెన్స్ మాడ్యుల్ తీసుకొచ్చాక వివిధ రకాల సమస్యలపై సుమారు 5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ధరణి రికార్డుల్లో ఉన్న అక్షర దోషాలు సవరించడం తప్ప పెద్ద సమస్యలేవీ సర్కార్ తీర్చలేదు.18 రకాల సమస్యలున్నాయని ఇటీవల ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ.. వాటికి ఇప్పటి వరకు పరిష్కారం చూపలేదు. రైతులు తహసీల్దార్ల చుట్టూ తిరుగుతున్నారు. ధరణిలో ఆప్షన్లు లేకపోవడంతో తహసీల్దార్లు ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు.ధరణిలో సమస్యల పరిష్కారానికి సర్కార్ సెప్టెంబర్ 19న కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ధరణి సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపాల్సి ఉంది. అయితే కమిటీ ఏర్పాటై 20 రోజులు దాటినా ఒక్కసారి కూడా భేటీ కాలేదు. కమిటీ చైర్మన్, మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్ బైపోల్ ప్రచారంలో బిజీగా ఉండడంతో.. ఇప్పట్లో సమావేశమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.పోయినేడాది నవంబర్ 2న ప్రారంభమైన ధరణి పోర్టల్ లో భూములకు సంబంధించిన 30 రకాల సమస్యలకు పరిష్కారం లేకుండా పోయింది. దీంతో రైతులు తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చిన భూములకు సంబంధించిన రైతుల గోస వర్ణనాతీతంగా మారింది. లక్షలాది ఎకరాల ప్రైవేట్ పట్టా భూములు, మాజీ సైనికుల భూములు ప్రొహిబిటెడ్ జాబితాలోకి వెళ్లాయి. ప్రాజెక్టులకు కొంత భూమి ఇచ్చి, కొంత సాగు చేసుకుంటే మొత్తం భూమిని నిషేధిత జాబితాలోనే పెట్టారు. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ నుంచి తొలగించుకునేందుకు ధరణిలో ఇచ్చిన ఆప్షన్ ద్వారా ఇప్పటి వరకు 1,02,895 మంది అప్లై చేసుకోగా.. ఇందులో సుమారు 80 వేల అప్లికేషన్లు రిజెక్ట్ అయినట్లు తెలిసింది. మరికొన్ని అప్లికేషన్లు ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. అలాగే భూమి ఉన్నా.. పాస్ బుక్ రాకపోవడం, పాస్ బుక్ వచ్చినా విస్తీర్ణం తక్కువగా నమోదు కావడం, సరిహద్దు సమస్యలు ఇలా వివిధ రకాల సమస్యలపై గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్ అనే అప్లికేషన్ ద్వారా మరో 1,85,036 అప్లికేషన్లు వచ్చాయి.

ఈ మాడ్యుల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే ఆప్షన్లు ధరణి లో లేకపోవడంతో కలెక్టర్లు వీటిలో కొన్నింటిని పెండింగ్ లో పెట్టగా, మరికొన్నింటిని రిజెక్ట్ చేశారు. సమస్య పరిష్కారం అవుతుందని దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్లు ఎలాంటి ఎంక్వైరీ లేకుండా రిజెక్ట్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. డ్యాష్ బోర్డుపై పెండింగ్ అప్లికేషన్ల సంఖ్యను 2 రోజుల్లో జీరోకు తేవాలని కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. దీంతో వారు పోటీపడి ఈనెల 1, 2 తేదీల్లో అప్లికేషన్లను గంపగుత్తగా రిజెక్ట్ చేశారు. ఎంక్వైరీ లేకుండా, కనీసం దరఖాస్తును చదవకుండానే కలెక్టర్లు రిజెక్ట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎందుకు రిజెక్ట్ చేశారో కారణం చెప్పే యంత్రాంగం కూడా లేదు. అప్లికేషన్ నంబర్ కొట్టి చూస్తే సమస్య పరిష్కారమైనట్లు మెస్సేజ్ కనిపించినా.. ధరణిలో ఆ మార్పులు కనిపించడం లేదు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలోని సీతారామచంద్రస్వామి గుడికి యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం మక్త అనంతారంలో సర్వే నంబర్ 153లో 18 గుంటల భూమి ఉంది. కానీ ఏదులాబాద్ లోని సర్వే నంబర్ 153లోని 14.32 ఎకరాల భూమి గుడిది అంటూ 2007లో నిషేధిత జాబితాలో పెట్టడంతో సదరు పట్టాదారులు హైకోర్టుకు వెళ్లారు. రైతులకు అనుగుణంగా  2017లో కోర్టు తీర్పునిచ్చినా తీర్పును అమలు చేయడం లేదు. ఈ తీర్పు కాపీని జతచేస్తూ పట్టాదారులు తోట విజయలక్ష్మి, సయ్యద్ రఫీక్, పి.మాధవి, అండాలు, ప్రీతి, ఆర్.కళ్యాణి ధరణిలో అప్లై చేసుకుంటే కలెక్టర్ రిజెక్ట్ చేశారు.తహసీల్దార్లు, కలెక్టర్లు 18 రకాల సమస్యలను గుర్తించి, వాటిని రెక్టిఫై చేసేందుకు ధరణి పోర్టల్ లో ఇవ్వాల్సిన ఆప్షన్లను సబ్ కమిటీకి సూచించారు. ఇవేగాక మరో 10 రకాల సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. వీటన్నింటిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి పరిష్కారం చూపాల్సి ఉంది. కానీ కమిటీ ఒక్కసారి కూడా భేటీ కాకపోవడంతో ఆప్షన్లు అందుబాటులోకి రావట్లేదు.ఊర్లు, పట్టణాలను ఆనుకొని ఉన్న లక్షల ఎకరాల సాగు భూములు ఇండ్ల స్థలాలుగా నమోదయ్యాయి. ఒక సర్వే నంబర్ లోని ఎకరం, రెండెకరాల్లో ఇడ్లుంటే ఆ సర్వే నంబర్ లోని మిగతా భూమంతా నాలాగా నమోదు చేశారు. ఇప్పుడు వాటిని నాలా నుంచి సాగు భూమిగా మార్చడం తలనొప్పిగా మారింది. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదానికి రైతులు వేలల్లో ఫీజుల్లో చెల్లించాల్సి వస్తోంది. మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి తీసేయాలని అప్లికేషన్ పెడితే కలెక్టర్లు రిజెక్ట్ చేస్తున్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Many problems around Dharani ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page