పోలవరం నిధులు..

0 7,583

-ముందు కు మూడు.. వెనుకకు ఆరు

ఏలూరు ముచ్చట్లు:

- Advertisement -

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలు అయోమయానికి దారితీస్తున్నాయి. అటు నిధుల విడుదలలో జాప్యం, ఇటు పనులపై కేంద్రం అమలు చేస్తున్న ఆంక్షలు, మరోవైపు పనులపై గతంలో కేంద్ర అటవీశాఖ విధించిన నిషేధంపై అయోమయం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా కేంద్రం నిలుపు చేస్తుండడం గోరుచుట్టుపై రోకలిపోటుగా మారుతోంది.ప్రాజెక్టుకు సంబంధించిన పలు పనులపై రంగాలవారీగా అనేక ఆంక్షలను కేంద్ర జలశక్తి శాఖ విధించింది. ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను నిలిపివేస్తోంది. పైగా బిల్లుల చెల్లింపుల్లో ఆంక్షలకు సడలింపు ఇవ్వలేమని రాష్ట్రానికి అధికారికంగానే తేల్చిచెప్పేసింది. పనుల్లో ఒక శాతం తేడా కనిపించినా ఆంక్షల ఉల్లంఘన అంటూ నిధుల విడుదలపై కొరడా ఝళిపించడంతో రావాల్సిన నిధుల్లో భారీగా కోతలు పడుతున్నాయి. తాజా ఇరిగేషన్‌, ఆర్ధికశాఖలు తయారుచేసిన గణాంకాలను పరిశీలిస్తే రూ.1,086 కోట్ల వరకు కోతలు పడినట్లు తేలింది. ఆంక్షల ఉల్లంఘన అంటూ రూ.806 కోట్ల బిల్లులను తిరస్కరించింది.

ఇందులో అత్యధికంగా భూసేకరణకు సంబంధించే రూ.285 కోట్ల వరకు బిల్లులున్నాయి. కాలువలకు సంబంధించి మరో రూ.285 కోట్లు, పాలన రంగానికి సంబంధించి రూ.235 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా డిపిఆర్‌లో లేకుండా చేసిన వ్యయం అంటూ మరో రూ.281 కోట్ల వరకు బిల్లులను జలశక్తి శాఖ తిరస్కరించింది. ఇందులో హెడ్‌ వర్క్స్‌కు చెందినవే 280 కోట్ల వరకు ఉన్నాయి. వీటిపై అనేక దఫాలుగా రాష్ట్ర అధికారులు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ స్పందన మాత్రం కనిపించడం లేదు. ఇదిలా ఉండగా, పనులపై గతంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విధించిన నిషేధంపై అయోమయం తొలగడం లేదు. ఒడిషా, చత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల అభ్యంతరాల మేరకు 2011లోనే కేంద్ర అటవీశాఖ పనుల కొనసాగింపుపై నిషేధం విధించింది. అయితే 2014లో ఈ ప్రాజెక్టను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం కేంద్రం నిషేధాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిలుపుదలలో పెడుతూ వచ్చింది. చివరిగా 2019 జూలైలో పనుల కొనసాగింపుపై నిషేధాన్ని రెండేళ్లపాటు నిలుపుదలలో పెట్టింది. దీని గడువు ఈ ఏడాది జూలైతో ముగిసిపోయింది. అయితే నిషేధం కొనసాగిస్తున్నామనో, ఎత్తివేస్తున్నామనో కేంద్ర అటవీశాఖ, జలశక్తి శాఖల నుంచి తదుపరి నిర్ణయం లేకపోవడంతొ ఈ అయోమయం పెరిగిపోతోంది. దీంతో ప్రస్తుతం నిషేధం అమలులో ఉన్నట్లుగానే భావించాల్సి వస్తుందని రాష్ట్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరణ అంచనాల ఫైలు ఇప్పటికీ జలశక్తి శాఖలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2017-18 అంచనాల మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,657 కోట్లకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తరువాత దానిని రూ.47,726 కోట్లకు మార్చింది. ఈ ప్రతిపాదనలు తుది ఆమోదం కోసం ఇంకా జలశక్తి శాఖ వద్దనే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా భూసేకరణ, సహాయ పునరావాసాలకు సంబంధించిన అంచనా వ్యయం రూ.28,172 కోట్లు ఉండడం, దానిపై కేంద్రం పదేపదే కొర్రీలు వేస్తుండడంతో ఆ ఫైలుకు మోక్షం లభించడం లేదని అధికారులు చెబుతున్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Polavaram funds ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page