విజయ దశమి చెడీతాలింఖానా ప్రదర్శనకు  ప్రత్యేక స్థానం

0 7,677

అమలాపురం    ముచ్చట్లు:

దేశంలో మైసూర్, కోల్ కతా వంటి ప్రాంతాల్లో జరిగే దసరా ఉత్సవాలకు ఎంత పేరు ప్రఖ్యాతలున్నాయో…అంతే ప్రత్యేకతను సొంతం చేసుకున్నాయి అమలాపురంలోని దసరా ఉత్సవాలు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కేంద్రం అమలాపురంలో విజయదశమి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే  వాహన ఊరేగింపులో చెడీతాలింఖానా ప్రదర్శనకు  ప్రత్యేక స్థానం ఉంది. ఈ చెడీ తాలింఖానా విద్య ప్రదర్శనలో వయసు బేధం లేకుండా 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు తమ విద్యను ప్రదర్శిస్తుంటారు. దసరారోజున అమలాపురం వీధుల్లో జరిగే చెడీ తాలింఖానా ప్రదర్శనల సందడి అంతా ఇంతా కాదు.వీధుల్లో ప్రాచీన యుద్ధవిన్యాసాలను తలపించేలా యువకులు వృద్ధులు ప్రదర్శించే చెడీతాలింఖానా ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగుతుంది. ముఖ్యంగా కళ్ళకు గంతలు కట్టుకుని ఓ వ్యక్తి కత్తి చేతబట్టి….మనిషి  పొత్తికడుపుపై కొబ్బరికాయలు, కాయగూరలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు గగుర్పాటు కలిగిస్తాయి. అగ్గి బరాటా, తాళ్ళ బంతులు, లేడి కొమ్ములు,  కర్రసాములు, పట్టా కత్తులతో వేగంగా, ఒడుపుగా కదులుతూ యువకులు చేసే విన్యాసాల చూపరులకు ఉత్కంఠత కలిగిస్తాయి. రెండు వందల ఏళ్ళు చరిత్ర ఉన్న తాలింఖానా ప్రదర్శన అమలాపురంలోని ఒక వీధి కొంకాపల్లిలో 1835లో ప్రారంభమైంది.  అనంతరం బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిరెడ్డి రామదాసు 1856లో ఈ విద్యకు అంకురార్పణ చేశారు.  విజయదశమి ఉత్సవాల్లో భాగంగా   1856లో మహిపాలవీధిలో ఈ ప్రదర్శనలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చెడీతాలింఖానా ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి.

- Advertisement -

విజయదశమి రోజున కొంకాపల్లి ఏనుగు అంబారీ, లక్క హంస, రవణం వీధి మహిషాసుర మర్దని, గండువీధి శేషశయన, నల్లా వీధి శ్రీవిజయ దుర్గమ్మ వాహనం ఇలా ఏడు వీధులలో ని వాహనాలు ప్రధాన వీధుల్లో ఊరేగుతూ .ముమ్మిడివరం గేటు సెంటర్ కు చేరుకుంటాయి. బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, శక్తివేషధారణలు,కోయ డ్యాన్సులు, బుట్టబొమ్మలు, మ్యూజికల్,తీన్మార్ బ్యాండ్లు, విద్యుత్ దీపాలంకరణలతో ఊరేగింపు నిర్వహిస్తారు. చెడీ తాలింఖానా విద్య కళను సినీ దర్శకుడు రాజమౌళి మగధీర సినిమాలో ఉపయోగించుకున్నారు. ఈ పర్యాయం విజయదశమి శుక్రవారం రావడంతో ఊరేగింపు, చెడీ విద్య ప్రదర్శన శనివారం రాత్రి నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు వలన పట్టణ వీధులలో వాహన ఊరేగింపులకు అనుమతి ఇవ్వలేదు. కేవలం ఆయా వీధులలో 150 మీటర్ల పరిధిలో మాత్రమే వాహన ప్రదర్శన, చెడీ తాలింఖానా విన్యాసాలకు అనుమతి ఇచ్చారు. ఈ ఉత్సవ కార్యక్రమాలలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 400 మంది బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు తెలిపారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Vijaya Dasami is a special place for Cheditalinkhana exhibition

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page