యజ్ఞాల పరమార్థం .

0 7,699

విజయవాడ ముచ్చట్లు:

ముక్తి జ్ఞానంతో లభిస్తుంది, యజ్ఞాలవల్ల కాదని చెప్పిన వేద వాఙ్మయమే, యజ్ఞాలను అత్యంత విశేషమైనవిగా కీర్తించింది. వీటిని ఆచరించి ధన్యత పొందమని పదేపదే చెబుతుంది.వేద ప్రబోధాలు ప్రధానంగా వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నవి కావు. సమాజ శ్రేయస్సుకోసమే పుట్టింది వేదం. అది లోకహితాన్నే కాంక్షిస్తుంది. వ్యక్తిని సమాజంలో అంతర్భాగంగానే పరిగణించి, సమాజ శ్రేయస్సులోనే వ్యక్తి హితం దాగి ఉందని చెబుతుంది. పూజ, వ్రతం, ధ్యానం, యోగం… ఇవన్నీ వ్యక్తిగత ఆరాధనలు. సంఘటిత శక్తిగా సమాజం నిర్వహించేది యజ్ఞం. లోకోద్ధరణకు దోహదపడని కార్యం ఎంత పెద్దదైనా, విశేషమైనది కాదు. ముక్కు మూసుకుని ఎవరికి వారు చేసే తపస్సుకన్నా పలువురిని సన్మార్గంలో నడిపే ఒక చిన్న సత్కార్యం మేలు. అందుకే యజ్ఞాన్ని శ్రేష్ఠమైన కర్మగా శతపథ బ్రాహ్మణం చెబుతుంది.

- Advertisement -

యజ్ఞం అంటే దేవతలనుద్దేశించి అగ్నిలో చేసే ద్రవ్య త్యాగం. దేవతలు అగ్ని ముఖులని, అగ్నిలో వారిని ఆరాధించి అన్నం(హవిస్సు), ఆవునెయ్యి, వారికి ప్రీతికరమైన ద్రవ్యాలను సమర్పిస్తే, శీఘ్రంగా ప్రసన్నమవుతారని పెద్దల మాట. దేవతలు అంటే ప్రకృతి శక్తులు. జ్యోతి స్వరూపులై, జీవన్ముక్త స్థితిలో, ఉపకారబుద్ధితో, లోకహితాన్ని కాంక్షిస్తుంటారు. ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అనే త్యాగబుద్ధి వారికి ప్రీతికరమైన ద్రవ్యం.అగ్నికార్యం సంక్షిప్తంగా చేస్తే హోమాలని, దీర్ఘకాలం విశేషంగా చేస్తే యజ్ఞయాగాలని అంటారు. ఇది సమాజంలోని అందరూ పాల్గొనే కార్యక్రమం. యజ్ఞంలో దేవతలకు ఆహుతులు, ఋత్విజులకు దక్షిణ, గోవులకు గ్రాసం, అందరికీ అన్నదానం, ప్రాణులకు భూతబలి, సేవకులకు పారితోషికం, శ్రామికులకు భృతి, వ్యాపారులకు గిరాకీ, యజమానికి శ్రేయస్సు, ప్రభువుకు కీర్తి లభిస్తాయి. ఎండిపడిన కట్టెల వాడకం వల్ల వృక్షసంపద తరగదు. ప్రకృతి సిద్ధంగా లభించే శ్రేష్ఠమైన ద్రవ్యాలు, ఓషధులు, వనస్పతులు, సమిధల వినియోగంతో- వాటి ధూమం వాయు శుద్ధిని, భస్మం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.వేద విజ్ఞాన రహస్యాలు ఛేదించడం ఏమంత సులువు కాదు. హేతుబద్ధ ఆలోచనా విధానం ఉండాలి. తాత్విక చింతన, తార్కిక దృష్టి అనే రెండు విభిన్న కోణాల్లో లోతుగా అధ్యయనం చేయాలి. యజ్ఞాన్ని ఒక వైదిక తంతులా కాకుండా జీవన విధానంగా భావించాలి. మనిషి శ్రద్ధ సద్భావనలతో దీక్షగా చేసే ప్రతి పనీ యజ్ఞమే అవుతుంది. అన్నంతో ప్రాణం నిలుస్తుందని, ఉదరంలోని జఠరాగ్ని అనే హోమకుండంలో సమర్పించే అన్నపానీయాలను ఆజ్యం హవిస్సులుగా భావించాలి. ఛాందోగ్యోపనిషత్తు భోజన విధిని ఒక యజ్ఞంగా చెప్పి, మొదటి అయిదు ముద్దలను పంచప్రాణాహుతులతో స్వీకరించమంటుంది. వివాహంలో కన్యాదానాన్ని సైతం అగ్నిస్టోమ, వాజపేయ, అశ్వమేధ, పౌండరీక యాగాలతో సమానంగా శాస్త్రం చెబుతోంది.శ్రద్ధను భార్యగా స్వీకరించి, హృదయం అనే హోమకుండంలో, తపస్సు అనే అగ్నిని వెలిగించి, కోరికలు అనే ఆజ్యాన్ని సమర్పించమంటుంది తైత్తిరీయోపనిషత్తు. ప్రాణుల క్షుద్బాధను తీర్చే అన్నదానమే మహోత్కృష్టమని, ధేనువుకు ఉన్న స్వాహా, స్వధ, వషట్‌, హన అనే నాలుగు స్తనాలలో, హస్త అన్నదానాన్ని సూచిస్తుందని ఉపనిషత్తులు చెబుతాయి.

యజ్ఞాలతో సంకల్పాలు నెరవేరతాయి, చిత్తశుద్ధి లభిస్తుంది, ఉత్తమ లోకాలు పొందవచ్చు. కాని వీటి పరమార్థం మాత్రం లోకకల్యాణం.              -:పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:The transcendence of the yagnas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page