సింగిల్ రోడ్లు.. ఇక డబుల్ రోడ్లు

0 9,774

హైదరాబాద్ ముచ్చట్లు:

 

రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి రహదారులను విస్తరించడంతో పాటు, సింగిల్‌లేన్ రోడ్లను డబుల్ లేన్‌లుగా అభివృద్ధి చేయడం, రహదారులపై వంతెనలను నిర్మాణం లాంటి పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం పెరుగుతున్న రవాణా వ్యవస్థకు అనుగుణంగా మరిన్ని రాష్ట్ర రోడ్లతో పాటు జాతీయ రహదారులను పలు ప్రాంతాలకు విస్తరించాలన్న యోచనలో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే జాతీయ రహదారులకు సంబంధించి కేంద్రం వద్ద 8 వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.రాష్ట్రంలో ఆర్ అండ్ బి పరిధిలో 24, 495 కిలోమీటర్ల రహదారులుండగా అందులో 2,552 కిలోమీటర్ల రాష్ట్ర హైవేలు, 11,967 కిలోమీటర్ల జిల్లా రహదారులు, 10,335 కిలోమీటర్ల ఇతర రహదారులు ఉన్నాయి. అయితే ఈ మొత్తం రహదారుల్లో 16,864 కిలోమీటర్ల రహదారులు, అంటే 70 శాతం రోడ్లు సింగిల్ లేన్ రోడ్లుగానే ఉన్నాయి. ఇవి పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చలేకపోయాయి. అందులో భాగంగా వాటి విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించి వాటిని అభివృద్ధి చేయడానికి ముందుకెళుతోంది.ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా మార్చడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే క్రమంలో ఆర్‌ఓబీలతోపాటు పెద్దఎత్తున వంతెనల నిర్మాణాలను సైతం చేపట్టింది. రూ.7,029 కోట్ల వ్యయంతో ఈ నాలుగేళ్లలో ఆర్ అండ్ బి పరిధిలో రహదారులు, వంతెనల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.

 

 

 

- Advertisement -

16,864 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా మార్చడానికి అధికంగా నిధులను కేటాయించింది. అందులో ఇప్పటికే 11,731 కిలోమీటర్ల రహదారులను డబుల్ లేన్ రోడ్లుగా మార్చారు. వీటితో పాటు రాష్ట్రంలో 511 వంతెనల నిర్మాణం చేపట్టగా, 335 వంతెనల నిర్మాణాలను ఆర్ అండ్ బి శాఖ పూర్తి చేసింది.ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే నాటికి రాష్ట్రంలో కేవలం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉండేవి. 2014 జూన్ 2 నాటికి జాతీయ రహదారుల విషయంలో జాతీయ సగటు 2.80 కిలోమీటర్లుండగా రాష్ట్రం సగటు కేవలం 2.20 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. అయితే నాలుగేళ్ల వ్యవధిలోనే కొత్తగా రూ.11,983 కోట్ల వ్యయంతో 3,150 కిలోమీటర్ల జాతీయ రహదారులను రాష్ట్రం కేంద్రం నుంచి మంజూరు చేయించుకుంది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్ వర్క్ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే, రాష్ట్రం సగటు 5.02 కిలోమీటర్లు. జాతీయ రహదారుల విషయంలో ఏర్పడే నాటికి దక్షిణాదిలో అట్టడుగున ఉన్న రాష్ట్రం, నేడు అగ్రభాగంలో నిలవడమే కాకుండా, దేశ సగటును మించింది. ఇవేకాకుండా రాష్ట్రంలో రూ. 13 వేల కోట్ల వ్యయం కాగల మరో 8 జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అవి పెండింగ్‌లో ఉన్నాయి.రహదారులపై నిర్మించే వంతెనల వద్ద చెక్ డ్యాములను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

 

 

 

అందులో భాగంగా ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రోడ్లపై రూ.1,974 కోట్లతో 389 బ్రిడ్జిలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు చెక్ డ్యాముల అంచనా ఖర్చు రూ.2,200 కోట్లు కానున్నట్టు అధికారులు తెలిపారు. రోడ్డుకు అడ్డంగా ఉండే చిన్నవాగులు, వంకలపై ఈ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. చెక్ డ్యాముల నిర్మాణం వల్ల నీటి నిల్వలు పెరిగి ఉపరితల నీటిమట్టం పెరుగుతుందన్న ఆలోచతో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుందని అధికారులు పేర్కొంటున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వరకు విస్తరించిన అటవీ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా గోదావరి, ప్రాణహిత నదుల వెంట మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వం అనుమతితో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. దీనికోసం. రూ.546.96 కోట్ల వ్యయంతో భద్రాచలం సమీపంలోని సారపాక నుంచి ఆసిఫాబాద్ జిల్లా కౌటాల వరకు దాదాపు 350 కి.మీ. మేర కొత్త రహదారి నిర్మిస్తోంది. గోదావరి, ప్రాణహిత వెంట నిర్మిస్తున్న ఈ రహదారి వల్ల భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల ప్రజలకు ఉపయోగం కలుగుతుంది.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Single roads .. longer double roads

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page