కొత్త వారికే అవకాశం,ఏపీలో బెంగాల్ ఫార్ములా

0 7,571

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి విజయం సాధించాలనుకుంటున్నారు. పార్టీని రెండోసారి అధికారంలోకి తేవాలనుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. అయితే గత రెండున్నరేళ్ల కాలంలో స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. జగన్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వంపైన, జగన్ పైన కంటే స్థానికంగా ఎమ్మెల్యేలపైనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది.ఇటీవల ఇండో ఆసియన్ న్యూస్ సర్వీస్, సీ ఓటరు సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. దేశంలో కెల్లా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఉన్న రాష్ట్రంగా ఏపీ సర్వేలో వెల్లడయింది. 28.5 శాతం మంది ప్రజలు ఎమ్మెల్యేలపై వ్యతిరేకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి ప్రభుత్వంపైన పడనుంది. వచ్చే ఎన్నికల్లోనూ ప్రభావం చూపనుంది. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, ప్రజలకు నేరుగా నిధులను డంప్ చేస్తున్నా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతకు కారణాలపై వైసీపీ అధ్యయనం చేస్తుంది.ఇందుకు ప్రధాన కారణాలు వైసీపీ ఎమ్మెల్యేలు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడమే. అభివృద్ధి పనులకు నిధులను ప్రభుత్వం కేటాయించకపోవడం, ప్రతి పనీ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం చేస్తుండటంతో ఎమ్మెల్యేలు తమకు చేతిలో పనిలేదని భావిస్తున్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తమ సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టారు. పొరుగు రాష్ట్రాలైన హైదరాబాద్, బెంగళూరులోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం తప్పించి వారు ప్రజలకు అందుబాటులో లేకపోవడమే ఈ అసంతృప్తికి కారణాలుగా చూస్తున్నారు.దీంతో జగన్ పశ్చిమ బెంగాల్ ఫార్ములాను వచ్చే ఎన్నికల్లో అమలు చేయాలని నిర్ణయించారు. అక్కడ మమత బెనర్జీ వరసగా మూడో సారి అధికారంలోకి వచ్చారు. పరిస్థిితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మమత ఎక్కువ స్థానాల్లో కొత్త అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారు. అందువల్లనే మమతకు మళ్లీ విజయం సాధ్యమయింది. మమత రూట్లోనే వెళ్లాలని జగన్ కూడా భావిస్తున్నారు. మమతకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ సయితం జగన్ కు ఇదే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకోవడానికి జగన్ పశ్చిమ బెంగాల్ ఫార్ములాను వచ్చే ఎన్నికల్లో అమలు చేయనున్నారు. అధికశాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు దక్కడం కష్టమేనన్నది పార్టీలో విన్పిస్తున్న టాక్.

- Advertisement -

బిచ్కుందలో కుక్కల బెడద

Tags:Opportunity for newcomers, Bengal formula in AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page