వైద్యరంగంలో మానవవనరుల కొరతను అధిగమించడం తక్షణావసరం: ఉపరాష్ట్రపతి

0 4,559

సాంకేతికతను సద్వినియెగం చేసుకుంటూ ‘టెలిమెడిసిన్’ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి
డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించి, వైద్య విద్యార్థులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

విజయవాడ ముచ్చట్లు:

- Advertisement -

వైద్యరంగంలో నెలకొన్న మానవవనరుల కొరతను వీలైనంత త్వరగా అధిగమించడంపై దృష్టిసారించడం తక్షణ అవసరమని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వైద్యరంగంలోని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిల్లో మౌలికవసతులను మెరుగుపరుచుకోవడం, వైద్యులు, వైద్య సిబ్బంది సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి గుర్తుచేసిందని ఉపరాష్ట్రపతి అన్నారు.
విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల ఆక్సిజన్ ప్లాంట్ ను ఇతర సదుపాయాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, అనంతరం వైద్య విద్యార్థులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. వైద్యులు, రోగుల నిష్పత్తి విషయంలో భారతదేశంలో చాలా అంతరం ఉందన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. 2024 నాటికి డబ్ల్యూహెచ్‌వో సూచించినట్లుగా ప్రతి వెయ్యిమంది రోగులకు ఒక వైద్యుడు ఉండే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటం అభినందనీయమన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ వైద్య మౌలిక వసతుల మిషన్ ద్వారా గ్రామాల నుంచి పట్టణాల వరకు అత్యవసర వైద్యసేవలకోసం జరుగుతున్న ఏర్పాట్లు వచ్చే 4-5 ఏళ్లలో పూర్తవుతుండటం శుభపరిణామమన్నారు.
వైద్య రంగం వాణిజ్యపరమైన అంశంగా మారుతున్న నేపథ్యంలో రోగులకు చికిత్సనందించే విషయంలో కాస్త మానవీయ దృక్కోణంలో ఆలోచించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. వైద్య వృత్తి పవిత్రమైనదని,  ఈ వృత్తి పవిత్రతతను కాపాడటంలో తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు, ఉన్నతస్థాయి విలువలను కాపాడటంలో వైద్యవిద్యార్థులు భాగస్వాములు కావాలి అని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైద్యులకు తొలి ప్రమోషన్ కు ముందు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించడాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వైద్యులు గ్రామీణప్రాంతాలకు వచ్చేలా.. ఆ ప్రాంతాల్లో కనీస నివాస సదుపాయాల కల్పన కూడా అవసరమన్నారు.
ఐటీ రంగంలో భారతదేశం సాధిస్తున్న సాంకేతిక ప్రగతిని సద్వినియోగం చేసుకోవాల్సిన విషయాన్నీ ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. వివిధ అంశాల్లో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యాలు (పీపీపీ) పెరగాల్సిన అవసరముందని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను మెరుగుపరిచేందుకు ‘టెలిమెడిసిన్’అనుసంధానతను పెంచడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. టెలిమెడిసిన్ ద్వారా వైద్య ఖర్చులు తగ్గడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వారికి కనీస వైద్యసేవలు అందించేందుకు వీలవుతుందన్నారు. ఆరోగ్య బీమా కోసం ప్రధానమంత్రి ప్రారంభించిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’, ఇతర కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయుక్తం అవుతాయన్నారు.
వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్న కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్న ఉపరాష్ట్రపతి, అందరికీ ఆర్థికంగా అందుబాటులోకి వైద్యసంరక్షణను తీసుకురావడంపై దృష్టిసారించాలన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రైవేటు రంగం కూడా తోడ్పాటునందించాలన్నారు.

సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Tags:There is an urgent need to overcome the shortage of human resources in the medical field: Vice President

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page