25 నుంచి ఇంజనీరింగ్ క్లాసులు

0 9,689

హైదరాబాద్ ముచ్చట్లు:

 

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ క్లాసులు ఈ నెల 25 నుంచి ప్రారంభించే వీలుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అతి త్వరలో విడుదల చేస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. ఇప్పటికే ఎంసెట్‌ రెండు దశల కౌన్సెలింగ్‌ చేపట్టారు. రెండో దశలో సీట్లు పొందిన అభ్యర్థులు గురువారం నాటికి సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో సీట్లు పొందిన వారిలో దాదాపు 3,500 మంది జాతీయ కాలేజీలు, ఇతర ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీలకు వెళ్లిపోయారు.రెండో దశలోనూ సీట్లు మిగిలితే ఈ నెల 21 తర్వాత ప్రత్యేక కౌన్సెలింగ్‌ చేపడతారు. దీంతో మొత్తం సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. 2021 ఎంసెట్‌లో 1,21,480 మంది అర్హత పొందారు. ఇంజనీరింగ్‌లో మొత్తం కన్వీనర్‌ సీట్లు 79,790 సీట్లున్నాయి. రెండు దశల కౌన్సెలింగ్‌ ద్వారా 73,428 సీట్లు కేటాయించారు. ఇంకా 19,797 సీట్లు మిగిలిపోయాయి. విద్యార్థులు చేరకుండా మిగిలిపోయే వాటిని, ఇప్పటికే ఖాళీగా ఉన్న సీట్లకు కలిపి ఈ నెల 21 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ చేపడతారు.ఈ ప్రక్రియ ఈ నెల 22తో ముగుస్తుందని, 25 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. జాతీయ సాంకేతిక విద్యా మండలి కూడా ఈ నెలాఖరులో ఇంజనీరింగ్‌ ఫస్టియర్‌ క్లాసులు మొదలు పెట్టాలని సూచించింది.  దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తున్నాయి.

 

 

 

- Advertisement -

రాష్ట్రంలో మొత్తం 175 ఇంజనీరింగ్‌ కాలేజీలున్నాయి. ఇందులో ప్రైవేటువి 158 వరకూ ఉన్నాయి. ఇంజనీరింగ్‌ క్లాసులు మొదలయ్యే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని కాలేజీల్లోనూ హడావిడి మొదలైంది. టాప్‌ టెన్‌ కాలేజీల్లో ఇప్పటికే యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయ్యాయి. ఇతర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈసారి కంప్యూటర్‌ సైన్స్‌లో కొత్త కోర్సులకు అనుమతి లభించింది. దీంతో సీట్లు పెరిగాయి.కాలేజీల్లో అదనపు సెక్షన్ల ఏర్పాటు అనివార్యమవుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు పెరగడంతోపాటు సివిల్, మెకానికల్‌ సీట్లు తగ్గాయి. ఈ రెండు విభాగాల్లో దాదాపు 2 వేల సీట్లను కొన్ని కాలేజీలు ఉపసంహరించుకున్నాయి. మరోవైపు గతేడాది కన్నా ఈ సంవత్సరం సీఎస్‌ఈ సీట్లను అన్ని కాలేజీలు పెంచుకున్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో ఈ సీట్లు 19,101 ఉన్నాయి. ఇందులో ఇప్పటికీ 767 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఉన్నాయి. మొత్తమ్మీద ఈసారి కంప్యూటర్‌ అనుబంధ కోర్సుల విద్యార్థులే ఎక్కువగా హడావిడి చేసే అవకాశముందని ఉన్నత విద్యా మండలి అధికారులు అంటున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

Tags: Engineering classes from 25

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page