నష్ట పరిహారం అంచనా కోసం యాప్

0 9,864

విజయవాడ ముచ్చట్లు:

 

పంట నష్ట పరిహారానికి అర్హత పొందిన రైతుల పంటలను  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయబోమని ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. అందుకు పక్కాగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. నష్ట పరిహారం నమోదుకు ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌లను క్షేత్ర స్థాయిలో వినియోగిస్తోంది. ఇప్పటికే ఇ-క్రాప్‌ బుకింగ్‌ను ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల కొనుగోళ్లు, బీమాకు తప్పనిసరి చేయడంతో రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ప్రభుత్వ అరకొర సహాయానికీ దూరమవుతుండగా, తాజాగా విపత్తు పరిహారాన్ని పంటల కొనుగోళ్లతో లింక్‌ పెట్టడంతో రైతాంగం మరింత ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి వర్షాలు, వరదలకు పలు జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వ సహాయం కోసం బాధిత రైతాంగం ఆశగా ఎదురు చూస్తోంది. సర్కారు ఆదేశాల మేరకు నష్టం అంచనాలకు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) సిబ్బంది సమాయత్తమయ్యారు.ఎన్యూమరేషన్‌ బృందాలు గ్రామాల్లో పంట నష్టాలపై చేస్తున్న ప్రచారంలో కొత్త నిబంధన ముందుకొచ్చింది. 33 శాతం, అంతకంటే ఎక్కువ పంట నష్టం సంభవిస్తే ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తుందన్న కండీషన్‌ ఉన్నదే. వర్షాల కారణంగా దిగుబడిలో నష్టాన్ని లెక్కిస్తారు. ఆ ఏరియాలో ఇంత దిగుబడి వస్తుందని ముందస్తుగా వేసిన అంచనాల ప్రాతిపదికన నష్టాన్ని లెక్కిస్తారు. కాగా 33 శాతానికిపైన పంట నష్టం సంభవించిందంటూ ఇన్‌పుట్‌ సబ్సిడీ జాబితాలో రైతు పేరు ఎక్కితే, అంచనా వేసిన మొత్తం దిగుబడిలో 33 శాతాన్ని రికార్డుల్లో తగ్గిస్తారు. సదరు రైతు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు పంటను అమ్ముకోదలిస్తే 67 శాతం పంటనే కొనుగోలు చేస్తారు. 33 శాతాన్ని కొనుగోలు చేయరు. అందుకు సిద్ధపడితేనే ఇన్‌పుట్‌ సబ్సిడీకి పేర్లు నమోదు చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.

 

 

- Advertisement -

ఉదాహరణకు ఫలాన ఏరియాలో ఎకరానికి వరి ధాన్యం 30 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లయితే, అక్కడ ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం 33 శాతం పంట నష్టం జరిగిందని ధృవీకరిస్తే, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలైన ఆర్‌బికెలలో 10 బస్తాలను (33 శాతం) కొనుగోలు చేయరు. కేవలం 20 బస్తాలనే కొంటారు.ఈ అంశంపై చాలా చోట్ల వివిధ స్థాయిల్లోని వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల్లో, మండల పరిషత్‌ సమావేశాల్లో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతుల నుండి ప్రజాప్రతినిధుల నుండి ఈ నిబంధనపై చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వర్షాలకు ఐదారు జిల్లాల్లో వరి పంటకు భారీగా నష్టం జరిగిందని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. నీటిలో వరి కంకులు తేలుతున్నాయి. నేలమట్టం అయ్యాయి. కోసిన పంట తడిచిపోయింది. రంగు మారింది. మొలకలొస్తున్నాయి. ఇలాంటి విపత్కర సమయాల్లో ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలను సడలించి రంగు మారిన, డ్యామేజి అయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ఆ పని చేయకుండా, కేవలం దిగుబడి అంచనాలను ప్రమాణికంగా తీసుకొని, నష్టాలను ధృవీకరించి, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామన్న పేరుతో రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదనడంపై వరద ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.

విజయవాడ కమిషనర్‌ గా కాంతిరాణాటాటా

Tags: App for compensation assessment

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page