మిర్చి రైతులకు నకిలీల బెడద

0 9,661

గుంటూరు ముచ్చట్లు:

 

నకిలీ విత్తనాల ఘాటు మిర్చి రైతుల నషాళానికి అంటుతోంది. ఇటీవల గుంటూరు జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోగా, ఇప్పుడు కృష్ణా జిల్లా రైతులకు నకిలీ విత్తనాల ఘాటు తగిలింది. నష్టపోయి వారికి పరిహారం ఇప్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతుండడంతో రైతులను కొన్ని మిర్చి విత్తన కంపెనీలు మోసం చేస్తూనే ఉన్నాయి. కలాషా కంపెనీకి చెందిన 414, కుబేరా రకాల మిర్చి విత్తనాలను కృష్ణా జిల్లా నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లోని 300 మంది రైతులు, కౌలు రైతులు 500 ఎకరాల్లో గత ఆగస్టు రెండో వారంలో నాటారు. ముందుగా విత్తనాలు కొని నారు పెంచడానికి ఎకరానికి రూ.25 వేలు, నాలుగుసార్లు దుక్కులు, నారు నాటడానికి, కలుపు తీయడానికి రూ.20 వేలు, ఎరువులకు రూ.20 వేలు, పురుగు మందులకు రూ.25 వేలు ఖర్చు పెట్టారు. సగటున ఎకరాకు రూ.90 వేల చొప్పున 500 ఎకరాల్లో మొత్తం రూ.4.5 కోట్ల మేర పెట్టుబడి పెట్టారు. ఎకరానికి రూ.25 వేలు కౌలు చెల్లించి వంద మందికిపైగా కౌలు రైతులు 200 ఎకరాలు సాగు చేస్తున్నారు. వీరికి కౌలుతో కలుపుకొని ఎకరానికి రూ.1.15 లక్షల వరకూ ఖర్చయింది. మిరప నాటిన 45 రోజుల్లో పూతకు వస్తుంది. మూడు నెలల్లో సగటున ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి రావాలి. మొక్క ఏపుగా పెరిగినా పూత రాలేదు. కాయ కాయలేదు. దీంతో, రైతులు, కౌలు రైతులకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లడంతో వారు లబోదిబోమంటున్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గుంటూరు జిల్లాలో నకిలీ విత్తనాల నష్టపోయి ఇటీవల రెండు వేల ఎకరాల్లో మిర్చి పంటను రైతులు పీకేశారు. మొక్క ఎదుగుదల బాగానే ఉన్నా పూత, పిందె రాలేదు. దీనిపై విత్తనాలను అమ్మిన వ్యాపారులను రైతులు నిలదీసినా వారి నుంచి సరైన సమాధానం లేదు. దీంతో, ఇండస్‌ వ్యాలీ కంపెనీకి చెందిన స్వర్ణ రకం, యుఎస్‌ 402, కావేరీ రకం విత్తనాలు వేసిన రైతులు తమ మొక్కలను పీకేశారు. జిల్లాలో రెండు వేల ఎకరాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. పెదకూరపాడు, అచ్చంపేట, మాచవరం, మేడికొండూరు, క్రోసూరు తదితర మండలాల్లో రైతులు ఎక్కువగా నష్టపోయారు. ఆయా కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించాలని రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీనిపై కంపెనీలు స్పందించడం లేదు. పంటను పీకేసిన రైతులు మరో పంటను వేయడానికి పెట్టుబడి వ్యయం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Counterfeits are not allowed for chilli farmers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page