శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

0 8,255

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో  ఏకాంతంగా పుష్పయాగం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా అమ్మవారి మూలవర్లకు పుష్పాభిషేకం చేశారు.

- Advertisement -

వేడుకగా స్నపన తిరుమంజనం :

ఉదయం అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.

పాంచరాత్ర ఆగమసలహాదారు, కంకణభట్టార్ శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో పుష్ప‌యాగం జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఉద్యాన శాఖకు దాతలు సమర్పించిన 3.5 టన్నుల పుష్పాలను  అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో ఒకటిన్నర టన్ను తమిళనాడు, ఒక టన్ను కర్ణాటక, ఒక టన్ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి దాతలు అందించారు.

పుష్పాల ఊరేగింపు :

మధ్యాహ్నం ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు ఊరేగింపుగా
శ్రీ పద్మావతి
అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు.

అనంతరం సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీ కృష్ణముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మండపాన్ని నలుపు, తెలుపు ద్రాక్షతో సుందరంగా అలంకరించారు. వైదికుల చతుర్వేద పారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు.

బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  కస్తూరిబాయి, డెప్యూటీ ఈఓ జనరల్ డా. రమణప్రసాద్, ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్  శ్రీనివాస్, అర్చకులు  బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు  శేషగిరి,  మధుసూదన్, ఎవిఎస్వో  సాయిగిరిధర్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రాజేష్ క‌న్నా పాల్గొన్నారు.

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Flower offering of Sri Padmavati Amma in a glorious manner

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page