బెజవాడకు 3 వేలు, విశాఖకు 5 వేలు

0 4

-బాదుడే…బాదుడు

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

- Advertisement -

రైళ్లు, ఆర్టీసీ బస్సుల తరహాలో ప్రైవేట్‌లోనూ ముందస్తు బుకింగ్‌లకు డిమాండ్‌ పెరిగింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చార్జీలను అడ్డగోలుగా పెంచారు.సంక్రాంతి పండగొచ్చిదంటే ఏటా అదే తంతు. ప్రజల జేబులకు చిల్లు పెట్టేందుకు ప్రైవేట్ ట్రావెల్స్‌, కాంట్రాక్ట్‌ క్యారేజీలుగా నమోదైన వందలాది బస్సులు, టూరిస్ట్‌ క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులు దోపిడీకి రెడీ అయిపోతాయి. తాజాగా పండక్కి కూడా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారికి రవాణా ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. డిమాండ్‌కు తగినన్ని రైళ్లు అందుబాటులో లేకపోవడంతో నగర వాసులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ చార్జీలను అమాంతంగా పెంచేసి ‘పండగ’ చేసుకుంటున్నాయి.
నెల 8 నుంచి 16 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి వేడుకలకు ఉండే ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే అన్ని ప్రధాన రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. కొద్దిరోజుల క్రితం దక్షిణమధ్య రైల్వే ప్రకటించిన మరో 16 ప్రత్యేక రైళ్లల్లోనూ కేవలం రెండు రోజుల్లో బెర్తులు భర్తీ అయ్యాయి. వెయిటింగ్ లిస్టులో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు గత్యంతరం లేక ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి తెరదీశాయి.హైదరాబాద్‌ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.350 వరకు చార్జీ ఉంటే సంక్రాంతి సందర్భంగా రూ.600 నుంచి రూ.700కు పెంచారు. ఓ ప్రముఖ ట్రావెల్‌ ఏజెన్సీ జనవరి 7న హైదరాబాద్‌-విజయవాడకు ఏసీ స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.1,200 వసూలు చేస్తోంది.

 

 

 

జనవరి 12న అదే టికెట్‌ ధర రూ.3 వేలుగా నిర్ణయించింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖ సహా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికుల్ని ప్రైవేటు ట్రావెల్స్‌ నిలువు దోపిడీ చేస్తున్నాయి. అన్ని ట్రావెల్ ఏజెన్సీలు ఒక్కతాటిపైకి వచ్చి టిక్కెట్ రేట్లు భారీగా పెంచేశాయి.హైదరాబాద్‌ నుంచి విజయవాడకు స్లీపర్‌లో గరిష్ఠంగా 600గా ఉన్న ధర, ఇప్పుడు వెయ్యి నుంచి మూడు వేల వరకూ పెరిగింది. జనవరి 11, 12 తేదీల్లో ఇది తారస్థాయికి చేరింది. ప్రస్తుతం విశాఖకు గరిష్టంగా రూ.3 వేల వరకు ఉండగా, 11, 12 తేదీల్లో రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ ధరలు విమాన ప్రయాణానికి సమానంగా ఉండటం గమనార్హం. ఈ ధరలతో నలుగురు సభ్యులుండే కుటుంబం విశాఖకు వెళ్లాలనుకుంటే ప్రయాణ ఛార్జీలకే రూ.10వేల వరకు ఖర్చు చేయాలి. మళ్లీ తిరుగు ప్రయాణానికి మరో రూ.10వేలు. కరోనా నేపథ్యంలో కుటుంబంతో కలిసి రిజర్వేషన్‌ లేకుండా ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఇష్టపడడం లేదు. కనీసం వారం ముందు ప్రయాణం పెట్టుకున్నా టిక్కెట్‌ ధర రూ.వేలల్లో ఉండడం, నాన్‌ ఏసీ, ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ రేంజ్‌ని బట్టి ధర 200 శాతం వరకు పెంచేయడంతో సామాన్యులు బలైపోతున్నారు. ఈ పరిస్థితుల్లో అంతంత రేట్లు పెట్టుకుని పండక్కి ఊరెళ్లడం అవసరమా? అని కూడా కొందరు ఆలోచిస్తున్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి

Tags: 3 thousand for Bejawada and 5 thousand for Visakhapatnam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page