సార్వత్రిక ఎన్నికల్లో 2300 పార్టీలు పోటీ

Date:18/03/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భరోసా పార్టీ… సబ్ సే బడీ పార్టీ… రాష్ట్రీయ సాఫ్ నీతి పార్టీ.. ఇవేం పార్టీలు.. ఎప్పుడూ వినలేదే అనుకుంటున్నారా? ఇవే కాదు ఇలాంటివి 2300కు పైగా పార్టీలు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పాలుపంచుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన మార్చి 9 నాటికి ఒక రోజు ముందు వరకు దేశంలో 2293 రాజకీయ పార్టీలు నమోదైనట్టు భారత ఎన్నికల కమిషన్ వివరించింది. వీటిలో గుర్తింపు పొందిన ఏడు జాతీయ పార్టీలు, 59 రాష్ట్ర పార్టీలు ఉన్నాయి. ఈ ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఒక్క ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ 149 కొత్త పార్టీలు నమోదయ్యాయి. ఈ ఏడాది పిబ్రవరి వరకు దేశంలో 2,1143 పార్టీలు నమోదై ఉన్నాయి. అందులో 58 పార్టీలు ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, మిజోరామ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నమోదయ్యాయి. ఇటీవల కొత్తగా ఏర్పడిన 149 పార్టీల్లో బహుజన్ ఆజాద్ పార్టీ బీహార్‌లోని సీతామర్హిలో, సామూహిక్ ఏక్తా పార్టీ యూపీలోని కాన్పూర్‌లో, రాష్ట్రీయ సాత్ నీతి పార్టీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో, సబ్ సే బడీ పార్టీ ఢిల్లీలో, భరోసా పార్టీ తెలంగాణలో, న్యూ జనరేషన్ పీపుల్స్ పార్టీ తమిళనాడులోని కోయంబత్తూర్‌లో నమోదయ్యాయి. ఇలా గుర్తింపు లేకుండా నమోదైన పార్టీలు తమ సొంతంగా నిర్ణయించుకున్న ఎన్నికల గుర్తింపుతో పోటీ చేయలేవు.
ఇలా నమోదైన పార్టీలు ఎన్నికల కమిషన్ ప్రకటించిన 84 ఎన్నికల గుర్తుల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన పార్టీగా ఎన్నికల కమిషన్ నుంచి హోదా పొందాలంటే ఆయా పార్టీలు నిర్దేశించిన శాతంలో ఓట్లు గాని, సీట్లు గాని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వారికి ఒక శాశ్వత ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. దేశంలో వేలకొద్దీ పార్టీలు రిజిస్టరైనా చాలామటుకు ఏ విధమైన కార్యకలాపాలు నిర్వహించవు. అంతేకాకుండా ఎన్నికలలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి కొన్ని ఇలాంటి పార్టీలు ప్రయత్నాలు చేస్తాయి. అందుకే వీటిపై నిఘా ఉంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్.. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్స్‌ను ఆదేశించింది. ఈ నమోదైన పార్టీలు ఎన్నికలలో కనుక పోటీచేస్తే మిగిలిన అన్ని పార్టీల్లాగే ఇవి సైతం ఎన్నికల ఖర్చులు, ఇతర వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించని పార్టీలపై ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకునే అధికారం ఉంది. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ వద్ద నమోదై చాలాకాలంగా ఎన్నికల్లో పోటీకి దిగని పార్టీలను ఆర్టికల్ 324 ప్రకారం తొలగించే అధికారాన్ని కల్పించాలన్న ఈసీ డిమాండ్ కేంద్ర న్యాయశాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.
Tags:2300 parties compete in the general election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *