25 crore people in lockdown again in China

చైనాలో మళ్లీ లాక్ డౌన్ లోకి 25 కోట్ల మంది

Date:23/05/2020

బీజింగ్ ముచ్చట్లు:

కరోనాతో సహజీవనం తప్పదు. వైరస్ వస్తుంటుంది.. పోతుంటుంది. దానికి అలవాటు పడాల్సిందే అంటూ మన రాజకీయ నాయకులు చెబుతుంటే నోళ్లు తెరిచేశాం కానీ అది నిజమేనని చైనా మరోసారి నిరూపించింది. కరోనా వైరక్ కేంద్రమైన వూహాన్‌లో 76 రోజుల పాటు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేసిన చైనా ప్రభుత్వం వైరస్ ప్రభావం సద్దుమణగటంతో ప్రస్తుతం ఆ నిబంధనల్ని నగరంలో పూర్తిగా సడలించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా జిలిన్‌ ప్రావిన్స్‌లో కొత్తగా 34 కేసులు బయట పడటంతో అప్రమత్తమైన ప్రభుత్వం‌ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 10.8 కోట్ల మంది జనాభా ఉండే జిలిన్‌ ప్రావిన్స్‌లో ఈ రోజు నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. జిలిన్, లియావోనింగ్, హైలోంగ్జియాంగ్ ప్రాదేశిక ప్రాంతాల్లో మొత్తంమీద  25 కోట్లమంది మళ్లీ లాక్ డౌన్ ప్రభావంలో పడ్డారని సమాచారం. చైనాలో పుట్టిన కరోనా అక్కడ అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ అక్కడ కలకలం సృష్టిస్తోంది. ఇది ప్రపంచానికంతటికీ కరోనాతో జాగ్రత్త అంటూ హెచ్చరికలు పంపుతోంది.తాజా పరిణామంతో ఈశాన్య చైనాలో భాగమైన జిలిన్ ప్రాంతంలో బస్సులు, రైళ్లు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పాఠశాలలు, కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.

 

 

 

గత శని, ఆదివారాల్లో మొత్తం 5 కేసులు నమోదవడంతోపాటు మొత్తం కేసులు సంఖ్య 34కి పెరగటంతో ప్రమాదాన్ని శంకించిన చైనా ప్రభుత్వం దాదాపు 25 కోట్లమందిని మళ్లీ గృహనిర్బంధంలోకి నెట్టేసింది.కరోనా వైరస్ కట్టడికి మళ్లీ కఠిన చర్యలకు చైనాలోని ప్రాదేశిక ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. కరోనా బాధితులు, అనుమానితులు ఉన్నట్లు తేలిన ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని, అది కూడా రెండురోజులకు ఒకసారి రెండు గంటలపాటు మాత్రమే అనుమతిస్తామని చైనా అధికారులు తేల్చిచెప్పారు.వైరస్ కట్టడి అయినట్లే భావిస్తున్న తరుణంలో మళ్లీ పెద్దసంఖ్యలో కేసులు పెరగడం అనూహ్యంగా ఉంది. అయితే రష్యాలో ఉండే చైనా పౌరులు స్వదేశానికి తిరిగిరావడంతో వారిద్వారానే ఈ కొత్త కేసులు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. చైనాలో ఇప్పటివరకు దాదాపు 84 వేలకు పైగా కేసులు నమోదు కాగా, 4,638 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు చైనాలో యాక్టివ్ కేసులు 2 వేలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

 

 

 

మరోసారి వైరస్ దాడి చేస్తుండటంతో అప్రమత్తమైన చైనా కేంద్ర నాయకత్వం ఉన్న ఫళాన పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, ఉప ప్రధాని సన్ చులాన్‌ని జిలిన్ నగరానికి పంపింది. మే 13నే జిలిన్ చేరుకున్న చులాన్ ప్రజలకు ధైర్యం చెబుతూ జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెచ్చరించారు. మరుసటి రోజు 12 టీములుతో కూడిన మెడికోలను పొరుగు రాష్ట్రమైన లియావోనింగ్ నుంచి తరలించారు. అదేసమయంలో వూహాన్‌లో కొత్తగా ఆరు కేసులు నమోదవడంతో మాస్ పరీక్షలకు  సిద్ధమయ్యారు. కరోనాతో సహజీవనం అంటే మళ్లీ మళ్లీ లాక్ డౌన్ అని ప్రపంచం మెల్లమెల్లగా తెలుసుకుంటోంది.

25 నుంచి లడ్డూ ప్రసాదాలు

Tags: 25 crore people in lockdown again in China

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *