ఏపీలో 25, తెలంగాణలో 26న రామనవమి

Date:20/03/2018
విజయవాడ ముచ్చట్లు :
శ్రీరామనవమి పర్వదినాన్ని ఎప్పుడు నిర్వహించుకోవాలి? ఆంధ్రప్రదేశ్‌లో 25న నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. తెలంగాణ ప్రభుత్వం భద్రాచలంలో ఈ నెల 26న నవమి వేడుకలు జరపాలని నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించిన క్యాలెండర్‌ ప్రకారం 25న వేడుకలు నిర్వహించనున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ వర్గాలు తెలిపాయి.శ్రీరామ నవమి ఉత్సవాలపై సందిగ్ధత కొనసాగుతోంది. రాములోరి కళ్యాణం ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు నిర్వహించనున్నారు. వాస్తవానికి అష్టమితో కూడిన నవమి పనికిరాదని, ధర్మసింధు ఇదే స్పష్టం చేస్తోందని కొందరు పండితులు చెబుతున్నారు. ఆ ప్రకారమే, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయించిన మేరకు తెలంగాణ ప్రభుత్వం అక్కడ 26న సీతారామకల్యాణం జరిపించనుంది. మరికొందరు పండితులు ఇందుకు భిన్న వాదన వినిపిస్తున్నారు. నవమి తిథి ఈనెల 25న సూర్యోదయం అయ్యాక వస్తుంది. 26వ తేదీ సూర్యోదయానికి ముందే ముగిసి, సూర్యోదయ సమయానికి దశమి వచ్చేస్తుంది. భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలను 26వ తేదీన నిర్వహించనుంది.భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మార్చి 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా….మార్చి 26న శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్టు భద్రాచలం దేవస్థానం వైదిక కమిటీ వెల్లడించింది. శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 2న భద్రాద్రి రాములవారిని పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం, తలంబ్రాలు కలుపు వేడుక నిర్వహించారు. మార్చి 27న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరామస్వామి వారికల్యాణోత్సవం మార్చి 30 న నిర్వహించనున్నారు. భద్రాచలంలో శ్రీరామ నవమి రోజు కల్యాణం నిర్వహిస్తే, ఇక్కడ మాత్రం చైత్ర పౌర్ణమి రోజున స్వామివారికి కల్యాణం జరుగుతుంది. శ్రీరామ నవమి ఉత్సవాలను పురస్కరించుకుని కోదండరామస్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి టీటీడీ క్యాలెండర్ ప్రకారం 25న కడపలో అంకురార్పణ చేయనున్నారు.శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని హిందువులు పండుగగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుతారు. భక్తులు సాయంత్రం అందంగా అలంకరించిన రథంపై శ్రీరాముని ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుల పాత్రధారులు, రథంతో పాటు పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు.హిందువులు తమ ఇళ్ళలో సీతారాముల విగ్రహాలకు వివాహం చేసి సాయంత్రం ఊరేగిస్తారు. దేశంలోని ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీథులలో ఊరేగిస్తారు. మహారాష్ట్రలో చైత్ర నవరాత్రి లేదా ఆంధ్రప్రదేశ్ లో వసంతోత్సవం తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తారు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలలో వస్తుంది. ఆ రోజు ఉదయాన్నే సూర్యుడికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ప్రారంభం అవుతుంది.
అష్టమితో కూడిన నవమిని శ్రీరామనవమిగా పరిగణించడానికి వీల్లేదు. ఆ లెక్క ప్రకారం 25న శ్రీరామనవమి కాదు. కానీ, అదే ధర్మ సింధు ప్రకారం.. అష్టమితో కూడిన నవమి వచ్చినప్పుడు, మర్నాడు సూర్యోదయం తర్వాత కూడా మూడున్నర ఘడియలపాటు నవమి ఉంటే మర్నాటినే శ్రీరామనవమిగా పరిగణించాలి. కానీ, 26న సూర్యోదయానికి ముందే నవమి వెళ్లిపోతోంది. అలాంటి సందర్భాల్లో ముందు రోజునే నవమి వేడుకలు నిర్వహించాలని ధర్మసింధు చెబుతోందని వారు వివరిస్తున్నారు.
Tags: 25 in AP, Ramanavami on 26th in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *