రూ.30 లక్షలు విలువ చేసే 25 మోటాసైకిళ్ళు స్వాధీనం- డిఎస్పీ సుధాకర్‌రెడ్డి వెల్లడి
– 7 మంది యువకులు అరెస్ట్
– జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు
-తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి
పుంగనూరుముచ్చట్లు:

జల్సాలకు, వీల్‌రేసింగ్, బెట్టింగ్‌లకు అలవాటు పడి ద్విచక్రవాహనాలను దొంగతనాలు చేసి విక్రయించే 7 మందిని అరెస్ట్ చేసి , వారి వద్ద నుంచి 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డిఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం సీఐ రాఘవరెడ్డితో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్రవాహనాలను, నింధితులను విలేకరుల ముందు హాజరుపరిచారు. డిఎస్పీ మాట్లాడుతూ యువకులు 7 మంది కలసి పుంగనూరు, బంగారుపాళ్యెం, మదనపల్లె, రాయచోటి, తిరుపతి, కదిరి, చిత్తూరుతో పాటు కర్నాటకలో కూడ 25 వాహనాలను దొంగతనం చేసి, జల్సాల కోసం విక్రయించే వారని తెలిపారు. ఉదయం సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా 7మంది యువకులు కలసి ద్విచక్రవాహనాల్లో రావడం జరిగిందన్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారన్నారు. రికార్డులను పరిశీలించగా రికార్డులు లేకపోవడంతో అనుమానంతో విచారణ చేపట్టామన్నారు. వీరంతా జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాలను దొంగలిస్తున్నారని డిఎస్పీ తెలిపారు. విచారణలో పుంగనూరులో 8 ద్విచక్రవాహనాలు విక్రయించారన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు తౌసిఫ్, రఫిక్, తాహీర్, ముదసీర్, నిరంజన్ లపై కేసులు నమోదు చేసి, దొంగతనం చేసిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.30 లక్షలని డిఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని, జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సమూలంగా నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు.
తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి..
పిల్లలు ఏం చేస్తున్నారనే విషయంలో తల్లిదండ్రులు శ్రద్ద వహించాలన్నారు. చదువుతున్న విద్యార్థులు, మైనర్లు దొంగతనాలు చేయడం, జల్సాలకు అలవాటు పడటం చూస్తుంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యం వెల్లడౌతోందన్నారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచడం బాధ్యతగా గుర్తించాలన్నారు. లేకపోతే చిన్నతనం నుంచి నేరాలు చేస్తూ పేరుమోసిన దొంగలుగా మారే అవకాశం ఉందని తెలిపారు.
పోలీసులకు రివార్డులు..
ద్విచక్రవాహనాల దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనభరచిన పోలీసులు యల్లప్ప, రెడ్డెప్ప, గురురాజ, చిన్నరెడ్డెప్ప, మోహన్‌రెడ్డి, ఢిల్లిబాబులకు డిఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ రాఘవరెడ్డి రివార్డులు అందజేశారు. వీరి సేవలను గుర్తిస్తూ రివార్డులకు జిల్లా ఎస్పీకి నివేదికలు పంపుతామన్నారు.
Tags: 25 motorcycles valued at Rs.30 lakh seized – DSP Sudhakar Reddy reveals21
