25 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి ముచ్చట్లు:

టీటీడీ ఆధ్వర్యంలో ఆగస్టు 25 నుండి 27వ తేదీ వరకు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టీటీడీ మూడో సత్ర ప్రాంగణంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది.ఈ మూడు రోజుల పాటు ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు చేప‌డ‌తారు. ఉదయం 8.30 గంటల నుండి 12.30 గంటల వరకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భజన మండళ్ళతో సంకీర్తనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు ధార్మిక సందేశాలు, మహనీయులు మాన‌వాళికి అందించిన ఉప‌దేశాలు తెలియ‌జేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.ఆగస్టు 25న సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అధికార ప్రముఖులు సందేశం ఇవ్వనున్నారు. ఆగస్టు 27వ‌ తేదీ ఉదయం 4 గంటలకు అలిపిరి పాదాల మండపం వ‌ద్ద‌ మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.గ‌తంలో ఎందరో మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని కాలిన‌డ‌క అధిరోహించి స్వామి వారి అనుగ్రహం పొందారు . అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో దాస సాహిత్య ప్రాజెక్టు మెట్లోత్సవ కార్యక్రమం చేపట్టింది.

 

Tags: 25th to 27th Srivari Quarterly Melotsavam

Leave A Reply

Your email address will not be published.