27 నుండి 29వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

27 నుండి 29వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుండి 29వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి.ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుండి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, సీతాలక్ష్మణ హనుమాన్‌ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివార్ల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం.

 

 

కాగా, రెండో రోజు మే 28వ తేదీ సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజలసేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.గృహస్తులు(ఇద్దరు) ఒక రోజుకు రూ.516/- చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు :

వసంతోత్సవాల సంద‌ర్భంగా మే 27 నుండి 29వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, మే 28న స్వర్ణపుష్పార్చన, మే 29న అష్టోత్తర శతకలశాభిషేకం ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 

Tags; 27th to 29th Annual Vasantotsavam of Sri Kalyana Venkateswara Swamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *