రెండేళ్లలో 3.79 లక్షల ఉద్యోగాలు

Date:11/02/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంతో మోదీ ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై కేంద్రం స్పదించింది. ప్రతిపక్షాలు చెప్తున్న మాటల్లో వాస్తవం లేదని.. ప్రభుత్వం 2017-19 మధ్యకాలంలో 3.79 లక్షలకుపైగా ఉద్యోగాలను కల్పించినట్లు తెలిపింది. ఇందులో 2017-18 సంవత్సరంలో 2,51,279 ఉద్యోగాలను కల్పించగా.. 2019 మార్చి 1 నాటికి ఈ సంఖ్య 3,79,544కు చేరుకోనుందని స్పష్టం చేసింది. దీంతో దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 36,15,770కి చేరనుందని వెల్లడించింది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాదారుల సంఖ్య పెరగడం, ఇన్‌కంట్యాక్స్ ఫైలింగ్స్ పెరుగుదల, వాహనాల అమ్మకాల్లో వృద్ధి, రవాణా, హోటల్స్, మౌలికసదుపాయాల రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగడం లాంటి గణాంకాలను పరిశీలిస్తే.. దేశంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలుస్తోందని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా రైల్వే, పోలీసు, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలను సృష్టించినట్లు కేంద్రం తెలిపింది. ఈ ఏడాది మార్చి 1 నాటికి రైల్వేలో 98,999 ఉద్యోగాలను భర్తీచేయనున్నామని.. పోలీసు విభాగంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలకు అదనంగా 79,353 మందిని నియమించనున్నట్లు స్పష్టం చేసింది. 2017 మార్చిలో ప్రత్యక్ష పన్నుల విభాగంలో 50,208 మందిగా ఉద్యోగులు ఉండగా.. ఈ సంఖ్య 2019 మార్చి నాటికి 80,143కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని కేంద్రం వెల్లడించింది. అలాగే పరోక్ష పన్నుల విభాగంలో 2017లో 53,394 ఉద్యోగులు ఉంటే.. 2018లో ఆ సంఖ్య 92,842కి చేరిందని కేంద్రం తెలిపింది. 2019 మార్చి నాటికి ఇదే సంఖ్య కొనసాగనుంది.
Tags:3.79 lakh jobs in two years

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *