అలిపిరి వద్ద గల టీటీడీ శిల్ప కళాశాలలో 3 రోజుల వర్క్ షాప్
తిరుమల ముచ్చట్లు:
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన శిల్పకళను విశ్వవ్యాప్తం చేయడానికి టిటిడి కృషి చేస్తుందని జెఈవో సదా భార్గవి చెప్పారు. ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థలో సంప్రదాయ శిల్పకళ – అనుబంధ అంశాలపై మూడు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌ను బుధవారం జెఈవో ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జెఈవో మాట్లాడుతూ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. టిటిడి ప్రారంభించిన వర్క్‌షాప్ ఇందుకు నాంది మాత్రమేనని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు. గుడి ఔన్నత్యాన్ని కళ్లకు కట్టినట్టు వివరించే గొప్పకళ శిల్పకళ అన్నారు. టిటిడి శిల్పకళాశాల ఎందరో ప్రముఖ స్థపతులను తయారు చేసిందన్నారు. ఈ కళాశాలలో చదివినవారెందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, నైపుణ్యం పెంపొందించుకుని గొప్పస్థపతులుగా తయారుకావాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు.
కళాశాలలో చేరే సమయంలో ప్రతి విద్యార్థి పేరు మీద లక్ష రూపాయలు డిపాజిట్ చేసి కోర్సు పూర్తయ్యాక వారికి వడ్డీతోపాటు అందజేస్తున్న ఏకైక సంస్థ టిటిడి మాత్రమే అన్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతోపాటు మన రాష్ట్రంలోని శిల్ప కళాశాలల నుంచి ప్రముఖ స్థపతులను పిలిపించి విజ్ఞానం పెంపొందించుకోవడం కోసమే టిటిడి చరిత్రలో తొలిసారి వర్క్‌షాప్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరి 26 నుండి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించిన శిల్పకళా ప్రదర్శనకు మంచి ఆదరణ లభించిందన్నారు. శిల్పకళ అభ్యసించే విద్యార్థులకు ఇంగ్లీషు, కంప్యూటర్ విద్య కూడా నేర్పిస్తామని, దీనివల్ల వారికి ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. కళంకారి, వర్లి ఆర్ట్, సౌరాష్ట్ర పెయింటింగ్ ఆర్ట్ కోర్సులను సాయంత్రం కోర్సులుగా ప్రవేశపెడతామన్నారు. శిల్పకళాశాలను యూనివర్సిటీ స్థాయికి తీసుకొచ్చేందుకు యాజమాన్యం ఆలోచిస్తోందని చెప్పారు.

ప్రముఖ స్థపతులు రాధాకృష్ణ, డా. దక్షిణామూర్తి, హైదరాబాద్ ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సిఈవో డా. శివనాగిరెడ్డి ప్రసంగించారు. డిఇవో శ్రీ గోవిందరాజన్, ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.ఆకట్టుకున్న ఎగ్జిబిషన్ కళాశాలలో వర్క్‌షాప్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కౌంటర్లు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జెఈవో సదా భార్గవి కళాకృతుల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. కుమారి పి.సాయిదేవిక నిరుపయోగమైన వస్తువులతో తయారుచేసిన వివిధ కళాకృతుల స్టాల్‌ను సందర్శకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. గృహాలంకరణకు ఉపయోగపడే అనేక కళాకృతులు ఈ స్టాల్‌లో ఉన్నాయి. అలాగే, శిల్పాలు, కళంకారీ పెయింటింగ్స్, చేనేత చీరలు, పంచగవ్య ఉత్పత్తుల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు.
Tags: 3 days workshop at TTD Shilpa College at Alipiri
