మరో 3 రోజులు వానలు
హైదరాబాద్ ముచ్చట్లు;
నైరుతి రుతుపవనాలు రాగల 48 గంటల్లో కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వడగళ్ల వాన కురుస్తుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేపు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వడగళ్ల వాన హెచ్చరికలు జారీ చేశారు.ఇక 9వ తేదీన ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలుచోట్ల వడగళ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అలాగే పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 10వ తేదీన వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, నిర్మల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వడగళ్ల వాన కురుస్తుందని తెలిపారు. నిన్న రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలం, ఖమ్మంలో 43 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పటాన్‌చెర్వులో అత్యల్పంగా 22.6 డిగ్రీలు నమోదైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించి నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags: 3 more days of rain
