శేషాచలం అడవుల్లోని రెండు ప్రాంతాల్లో 32ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి ముచ్చట్లు:
శేషాచలం అటవీ పరిధిలోని తలకోన సౌత్ ఫారెస్ట్, అలిపిరి ఫారెస్ట్ బీట్ పరిధిలలో 32ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి ఆదేశాల మేరకు రిజర్వు ఇనస్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన రెండు టీమ్ లు శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఆర్ఎస్ఐ లింగాధర్ టీమ్ బాకరాపేట రేంజి, నెరబైలు సెక్షన్ తలకోన సౌత్ ఫారెస్టులో కూంబింగ్ చేపట్టింది. వీరు యర్రావారిపాలెం మునెద్దుల మడుగు చేరుకునే సరికి అక్కడ కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. దీంతో వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, దుంగలు పడేసి చీకట్లో పారిపోయారు. అక్కడ 21ఎర్రచందనం దుంగలు లభించాయి.
అదే విధంగా ఆర్ఎస్ఐ విశ్వనాథ్ టీమ్ తిరుమల చేరుకుని, అక్కడ నుంచి తిరుపతి డౌన్ ఘాట్ రోడ్డు వైపు కూంబింగ్ చేపట్టారు. అలిపిరి ఫారెస్ట్ బీట్ పరిధిలోని తిమ్మినాయుడు పాలెం సెక్షన్ సన్నరాళ్ల మిట్ల ప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వీరు దూరం నుంచి టార్చ్ లైట్ వెలుగులు చూసి దుంగలు పడేసి పారిపోయారు. అక్కడ 11ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి. మొత్తం 32ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చి కేసు నమోదు చేశారు. ఇవి 987కిలోలు ఉండగా, వీటి విలువ సుమారు రూ.50లక్షలు ఉంటుందని ఎస్పీ చక్రవర్తి తెలిపారు. పారిపోయిన వ్యక్తుల కోసం గాలింపులు చేపట్టినట్లు తెలిపారు.

Tags: 32 red sandalwood logs were seized in two areas of Seshachalam forests
