80 వేల కోట్ల వ్యయంతో 3,236 శాటిలైట్లు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశంలో మరో టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దేశంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సాధారణంగా మారిపోయింది. ఇంటర్నెట్ లేని ఇల్లు అనేది కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సుమారు రూ. 80 వేల కోట్ల వ్యయంతో మొత్తంగా 3,236 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులు అందించేందుకు 2020లోనే ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే ఇండియాలో మాత్రం అమెజాన్ సర్వీసులు అందుబాటులోకి రాలేదు.ఇండియాలో లైసెన్సింగ్, ఇతర ప్రక్రియలు పూర్తయితే త్వరలోనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెజాన్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విస్తరణ కోసం లైసెన్సుల ప్రక్రియ, ఇతర అంశాలను చూసుకోగల సామర్థ్యమున్న వ్యక్తి అవసరమని.. అమెజాన్ బిజినెస్ డెవలప్ మెంట్ వ్యూహాన్ని సదరు వ్యక్తి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుందని అమెజాన్ అభిప్రాయపడింది. కాగా శాటిలైట్ ఇంటర్పెట్తో ఎలాంటి కేబుళ్లకు అవసరం ఉండదు. అడవులు, మారుమూల ప్రాంతాలు, ఎటువంటి సదుపాయాలు లేని చోట్ల కూడా నేరుగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. భూమిపై తక్కువ ఎత్తులోని కక్ష్యలో అమెజాన్ ఉపగ్రహాలు తిరుగుతూ ఇంటర్నెట్ సేవలు అందిస్తాయి. ఈ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అమెజాన్ ఇప్పటికే ఏరియాన్ స్పేస్, బ్లూ ఆరిజిన్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వంటి స్పేస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
Tags: 3,236 satellites at a cost of 80 thousand crores