సోలార్ మీటరింగ్ పై గృహాలకు 40 శాతం సబ్సిడీ

వరంగల్ ముచ్చట్లు:

తెలంగాణ‌లో సోలార్ విద్యుత్ వినియోగం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ రెడ్కో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఇంధ‌న పొదుపు వారోత్సవాలు నిర్వహించింది. సోలార్ వినియోగం వ‌ల్ల క‌లిగే లాభాలు, ప్రభుత్వం అందిస్తున్న స‌బ్సిడీపై ప్రచారం చేప‌ట్టింది. అస‌లు సోలార్ విద్యుత్ వినియోగం పెంచేందుకు గృహాల‌కు అందిస్తున్న స‌బ్సిడీ ఎంత‌? మ‌హిళా సంఘాల‌కు ఏ విధ‌మైన స‌బ్సిడీ అంద‌చేస్తున్నారో తెలుసుకుందాం.సోలార్ రూఫ్ టాప్ నెట్ మీటరింగ్ పవర్ సిస్టమ్ ఏర్పాటుకు రెడ్కో వ్యక్తి గత గృహాలకు 40% సబ్సిడీ అంద‌జేస్తుంది. దీని ద్వారా అధిక కరెంటు బిల్లుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే సోలార్ పవర్ సిస్టం ఏర్పాటు చేయాలంటే క‌నీసంగా 100 చద‌ర‌పు అడుగుల రూఫ్ ఉండాలి. సోలార్ ఏర్పాటు చేస్తే నిర్వహ‌ణ ఇబ్బంది అవుతుంద‌నే ప్రచారం ఉంది. కానీ రెడ్‌కో ద్వారా అందించే సోలార్ ప్యానల్స్ కు 25 సంవత్సరాలు, ఇన్వర్టర్ ఇత‌ర వాటికి ఐదు సంవ‌త్సరాల గ్యారెంటీ ఉంటుంది. దీనివ‌ల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. ఒక‌వేళ ఇబ్బందులు త‌లెత్తిన రెడ్‌కో సంస్థ ప్రతినిధులు వ‌చ్చి ప‌రిష్కరిస్తారు. పెరుగుతున్న విద్యుత్ ధ‌ర‌ల‌తో ప్రజ‌లు సోలార్ వ్యవ‌స్థపై దృష్టి సారిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 801 కిలోవాట్ విద్యుత్ కు సంబంధించి 236 సోలార్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 378 కిలోవాట్లకు 99 యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి.
భవనాల కప్పులు, భవనాలు చుట్టూ నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలో సోలార్ రూఫ్ ఫోటో వోల్టాయిక్ విద్యుత్ ఉపకరణాలు ఏర్పాటు చేయొచ్చు. దీని ద్వారా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. ప్రతి వ్యక్తిగత గృహం, పారిశ్రామిక భవనం, వాణిజ్య భవనాలు లేదా ఇతర ఏ రకమైన భవనం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను అదే భవనం అవసరాల కోసం వాడుకోవ‌చ్చు. లేదా ఒకవేళ మిగులు విద్యుత్ ఉన్నట్లైతే గ్రిడ్‌కు పంపవచ్చు. ఈ రకమైన ఉపకరణాలు ఏర్పాటు చేయ‌డం ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు గ్రిడ్ కు అనుసంధానించడానికి అలాగే నెట్ మీట‌రింగ్‌ సౌకర్యానికి అనుమతినిస్తున్నాయి. గ్రిడ్ ఇంటరాక్టివ్ పై కప్పు లేదా చిన్న సోలార్ పవర్ ప్లాంట్ లో, సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి అయిన డీసీ శక్తి పవర్ కండిషనింగ్ యూనిట్ ద్వారా ఏసీ శక్తిగా మార్చి గ్రిడ్ కు అనుసంధానిస్తారు. ఉత్పత్తి అయిన విద్యుత్ ను పూర్తిగా ఉపయోగించుకుంటూ అధికంగా ఉన్న విద్యుత్ గ్రిడ్ లభ్యతను బట్టి గ్రిడ్‌కు అనుసంధానించవచ్చు. వాతావరణం మేఘవృత్తం అయినప్పుడు లేదా రాత్రి సమయాలలో సౌరశక్తి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ సరిపోక‌పోతే ఈ గ్రిడ్ విద్యుత్ వాడుకోవ‌చ్చు. గ్రిడ్ రూఫ్ టాఫ్ సోలార్ సిస్టమ్ నెట్ మీటరింగ్ విధానంలో పనిచేస్తుంది.

రెడ్‌కో అందిస్తున్న స‌బ్సిడీ ఎంత‌?
1 కిలోవాట్ విద్యుత్‌కు ప్రాజెక్టు ధ‌ర రూ.83,700 కాగా రూ.14,588 స‌బ్సిడీ అంద‌చేస్తోంది. అయితే ద‌ర‌ఖాస్తుకు జీఎస్టీ రూ.1180, నెట్ మీట‌రింగ్‌కు రూ.2950 వినియోగ‌దారుడు చెల్లించాల్సి ఉంటుంది.
2 కిలోవాట్‌కు రూ.1,44,000 అయితే రూ.29,176 స‌బ్సిడీ ల‌భించ‌నుంది. అప్లికేష‌న్ జీఎస్టీ ధ‌ర కిలోవాట్‌ను బ‌ట్టి పెరుగుతుంది. నెట్‌మీట‌రింగ్ ఛార్జీలు మాత్రం 2,950 మాత్రమే ఉంటాయి.
3 కిలోవాట్‌కు రూ.2,06,400 కాగా.. స‌బ్సిడీ రూ.43,764 అంద‌జేస్తున్నారు.
డ్వాక్రా గ్రూపు స‌భ్యుల‌కు ఈఎంఐలో చెల్లించుకునే వెసులుబాటు క‌ల్పించారు. కేవ‌లం రూ.20,134 చెల్లిస్తే నెల‌వారీ వాయిదాలో మిగిలిన రుసం చెల్లించుకోవ‌చ్చు. టీఎస్ రెడ్కో ద్వారా డ్వాక్రా గ్రూప్ సభ్యులకు 40% సబ్సిడీపై సోలార్ రూఫ్ టాప్ నెట్ మీటరింగ్ పవర్ సిస్టంలను ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి గల స్వయం సహాయక సభ్యులు టీఎస్ రెడ్కో కార్యాలయాన్ని లేదా డీఆర్‌డీఎ అధికారులని లేదా స్త్రీ నిధి అధికారులని సంప్రదించి దరఖాస్తు చేయొచ్చు. మ‌హిళా సంఘాల‌కు 2 కిలోవాట్‌, 3 కిలోవాట్ వ‌ర‌కు సోలార్ విద్యుతు క‌నెక్షన్లు అంద‌జేస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు 2 కిలోవాట్ సోలార్ సిస్టం అమ‌ర్చేందుకు రూ.29,176 స‌బ్సిడీ పోగా.. ద‌ర‌ఖాస్తు రుసుం, నెట్ మీట‌ర్ ఛార్జీలు అన్ని కలిపి రూ. 1,20,134 అవుతుంది. అయితే ఇందులో ల‌క్ష రూపాయలు స్త్రీ నిధి లేదా బ్యాంకు ద్వారా లింకేజ్ చేస్తారు. స‌భ్యురాలు త‌న వాటాగా కేవ‌లం రూ.20,134 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రుసుం మూడేండ్లలో నెల‌కు రూ.2,243 ఈఎంఐలో చెల్లించుకోవ‌చ్చు.
తక్కువ ధ‌ర‌కే ఫ్యాన్లు, ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు
ఇంధన పొదుపులో భాగంగా మార్కెట్ రేటు కంటే తక్కువకే టీఎస్ రెడ్కో ద్వారా నాణ్యమైన, వారంటీతో ఫ్యాన్లు, ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, ఎల్ఈడీ బల్బులు అందిస్తున్నారు. వీటి ద్వారా తక్కువ విద్యుత్ వినియోగమై అధిక కరెంటు బిల్లుల నుంచి ఉపసమనం పొందవచ్చు. 28 వాట్ల బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్ మార్కెట్ రేటు రూ.4040 కాగా.. రెడ్కో ఆధ్వర్యంలో రూ.2,540 కే విక్రయిస్తున్నారు.

Tags:40 percent subsidy for households on solar metering

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *