Natyam ad

43 ఎకరాలు సర్కారుదా? ప్రైవేటుదా?

మెదక్ ముచ్చట్లు:


అది పట్టా భూమా? సర్కారు జాగానా..? అన్న క్లారిటీ లేదు. కోర్టులో కేసు నడుస్తున్నదనీ తెలుసు. రీజినల్ రింగ్ రోడ్డు కింద కొంత భూమి పోతున్న విషయమూ ఎరుకే.. అయినా ఆ స్థలంలో మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇండ్లు కట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భూమిని చదును చేసి రోడ్లేసి, డ్రైనేజీ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు ఈ పనులు జరుగుతుండగానే.. ఇంకో వైపు ఇందులో 43 ఎకరాలు సర్కారుదా? ప్రైవేటుదా? అని లెక్క తేల్చే వరకు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించొద్దని పేర్కొంటూ హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసింది. ఇంతకూ ఆర్అండ్ఆర్ కాలనీ పూర్తవుతుందా..? నిర్వాసితులకు ఇళ్లు అందుతాయా..? అనేది అనుమానాస్పందగానే మారింది.సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతున్నది. ప్యాకేజీ కింద ప్లాట్లు, ఇండ్లు ఇచ్చే అంశాన్ని ఎప్పటికి తేలుస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం ముట్రాజ్ పల్లి సర్వే నం.326, 331లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చేపట్టడం అన్యాయమంటూ గజ్వేల్ కు చెందిన బాలాజీ స్పిన్నర్స్ కంపెనీ యాజమాన్యం కోర్టుకెక్కింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, సిద్ధిపేట జిల్లా కలెక్టర్, గజ్వేల్ ఆర్డీవో, గజ్వేల్ తాసీల్దార్లను పార్టీగా చేరుస్తూ హైకోర్టులో కేసు వేశారు. ఖాస్రా పహాణీ నుంచి అవి పట్టా భూములుగానే ఉన్నాయన్నారు. సర్వే నం.326 లోని భూమి ఇప్పటికే 50 సబ్ డివిజన్లుగా మారింది. ఇందులోనే 201.35 ఎకరాల భూమి పొరంబోకుగా రాశారు.

 

 

 

సర్వే నం.331లో సేత్వార్ ప్రకారం 41.08 ఎకరాలు మాత్రమే పొరంబోకుగా ఉన్నది. కొన్నింటిని ఇల్లీగల్‌గా క్లాసిఫికేషన్ మార్చారని యాజమాన్యం హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. పట్టా భూములుగా తాము కొనుగోలు చేసిన 46.29 ఎకరాల భూమి క్లాసిఫికేషన్ మార్చొద్దని, తమకే చెందుతుందని వాదించింది. ఈ కేసులో హైకోర్టు సదరు 46.29 ఎకరాలపై స్టేటస్ కో జారీ చేసింది. ఆగస్టు 11వ తేదీకి వాదనలను వాయిదా వేసింది.గ్రీన్ ఫీల్డ్ హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఎక్స్ ప్రెస్ వే (నార్త్ సైడ్) భూ సేకరణ లిస్టులో ముట్రాజ్ పల్లిలోని సర్వే నం.326 ఉంది. అలైన్మెంట్ మార్చలేమని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ మే ఐదో తేదీన (లేఖ నం.11023/ఆర్ఆర్ఆర్/ఎన్ హెచ్– 161ఎఎ/జిసి/2021/388) సిద్దిపేట కలెక్టర్‌కు లేఖ రాశారు. ‘2021 అక్టోబరు, నవంబరులో పరిశీలించినప్పుడు ఎలాంటి యాక్టివిటీ అక్కడ జరగలేదు. అందుకే అలైన్మెంట్ ప్రతిపాదించాం. భూ సేకరణ కమిటీ కూడా ఫైనల్ చేసింది. డీపీఆర్ కన్సల్టెంట్ టెక్నికల్ క్వాలిఫైడ్ వ్యక్తులు ఈ మేరకు నిర్ణయించారు. అలైన్మెంట్‌లో ఏ చిన్న మార్పు చేసినా మొత్తం ప్రాజెక్టుపై ప్రభావం చూపుతుంది. ఈ దశలో ఎలాంటి మార్పులను ఆమోదించలేం. ప్రస్తుతం సర్వే నం.326లో 3.80 హెక్టార్టు సేకరిస్తున్నాం.’ అని లేఖలో పేర్కొన్నారు. అయితే భూ సేకరణ ద్వారా ఆర్అండ్ఆర్ కాలనీ లోని 130 ప్లాట్లపై ప్రభావం పడనుంది.సీఎం కేసీఆర్ కలలను సాకారం చేసేందుకు రైతులు వారి భూములను ప్రభుత్వానికి ఇచ్చారు.

 

 

 

Post Midle

మంజూరు చేసిన నామమాత్రపు నష్టపరిహారాన్ని కూడా తీసుకున్నారు. ఇప్పుడేమో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద కాలనీ నిర్మించడంలో అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. క్లియర్ టైటిల్ ఉన్న ప్రాంతంలో ప్లాట్లు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడి ప్రతి అంగుళం భూమి గురించి అధికారులకు తెలుసు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం మార్కింగ్ చేశారని తెలిసినా రూ.కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైనేజీ పనులు వేయించారు. ఇప్పుడా పనులన్నీ బూడిదలో పోసినట్లే. అలాగే ఏయే భూములపై ఎలాంటి కేసులు, వివాదాలు ఉన్నాయో .. అన్ని ఫైళ్లు వారి టేబుళ్ల మీదనే ఉన్నాయి. ఇప్పుడీ ప్యాకేజీ కింద చేపట్టిన భూములపై వరుస పేచీలు అడుగు పడనీయడం లేదు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం భూములు ధారదత్తం చేసిన రైతుల పట్ల అధికారులు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం ప్లాట్ల పంపిణీలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. ప్రస్తుతం కేసులు తేలే వరకు అడుగు ముందుకు పడే పరిస్థితులు లేవు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూ సేకరణ మొదలుకొని ఇంటి స్థలాల వరకు అధికారులు హడావిడి నిర్ణయాలే తీసుకున్నారు. రైతుల ఒప్పించి, మెప్పించడంలో విఫలమయ్యారు. దాంతో ప్రభుత్వంపై వ్యతిరేక భావం ఏర్పడింది. ఇప్పుడీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ విషయంలోనూ ఆలస్యం చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

 

Tags: 43 acres government? Is it private?

Post Midle