తొమ్మిది వేల పోస్టులకు 5.50 లక్షల మంది

ఉదయం, సాయంత్రం పరీక్షలు
Date:09/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 10న నిర్వహించనున్న రాతపరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూ హైదరాబాద్ చేపట్టింది. అయితే పరీక్ష రాసిన తర్వాత అభ్యర్థులు తమ ప్రశ్నపత్రాలను వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది.
పరీక్ష రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్‌తోపాటు ప్రశ్నపత్రాన్ని కూడా ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే ఆ అభ్యర్థిపై క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తం 9,355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు 5,69,447 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ అక్టోబరు 10న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు ఉంటాయి.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
* పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా.. లోపలికి అనుమతించరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు 2 గంటల ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
* పరీక్షా కేంద్రానికి వచ్చేటపుడు హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలి. పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదో ఒకటి తీసుకురావచ్చు.
* పరీక్షా కేంద్రాల్లోకి వాచీలు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మరే ఇతర వస్తువులను అనుమతించరు. ఎలాంటి ఆభరణాలు కూడా ధరించకూడదు.
రాత ప‌రీక్ష ఎలా ఉంటుంది..?
మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు పేపర్-1, 100 మార్కులకు పేపర్-2 ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. ఒక్కో పేపరుకు 2 గంటల సమయం కేటాయించారు.
* పేపర్-1లో జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ స్టడీస్ & మెంటల్‌ ఎబిలిటీ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళికం, ఆర్థికం, సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
* పేపరు-2లో తెలంగాణ పంచాయతీరాజ్‌ నూతన చట్టానికి, పంచాయతీరాజ్‌ సంస్థలకు, స్థానిక ప్రభుత్వాలు, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
Tags:5.50 lakhs to nine thousand posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *