ఇస్రో శాస్త్రవేత్తలకు 50 లక్షల నష్టపరిహారం

Date:14/09/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు :
దేశ రక్షణ రహస్యాలను మాల్దీవుల గూఢచారులు మరియం రషీదా, ఫౌజియా హుస్సేన్ అనే మహిళ అధికారులకు కొంత మంది అమ్ముకున్నట్టు 1994లో ఓ కేసు నమోదైంది. ఫ్లైట్ టెస్ట్ డేటా, రాకెట్, ఉపగ్రహ ప్రయోగాల వివరాలను కూడా అమ్ముకున్నారని ఆరోపిస్తూ నాటి ఇస్రో శాస్త్రవేత్తలు నంబి నారాయణన్, శశికుమరన్‌‌లపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో మరియం రషీదా, ఫౌజియా హుస్సేన్‌‌లతోపాటు వారిని కూడా అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. అయితే, శాస్త్రవేత్తలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను కేరళ పోలీసులు సేకరించలేకపోయారు. నిరూపించలేకపోవడంతో వారిని నిర్దోషులుగా న్యాయస్థానం విడుదల చేసింది. అయితే, దీనిపై నంబి నారాయణన్ సుదీర్థ న్యాయపోరాటం చేశారు. దాదాపు 24 ఏళ్ల అనంతరం ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పును వెలువరించింది.
శాస్త్రవేత్త నంబి నారాయణన్కు రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గత 25 ఏళ్లుగా ఆయన ఎంతో మానసిక వేదన అనుభవించారని వ్యాఖ్యానించిన సర్వోన్నత న్యాయస్థానం, కేరళ పోలీస్ అధికారుల పాత్రపై విచారణకు రిటైర్డ్ జడ్జితో ఓ కమిటీని నియమించింది. నంబి నారాయణ అరెస్ట్ అప్రజాస్వామ్యకమని కోర్టు అభిప్రాయపడింది. జూన్‌లోనే విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం, తీర్పును రిజర్వులో ఉంచింది.
శాస్త్రవేత్త నంబి నారాయణకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ విచారణలో తేల్చడంతో, తనను అన్యాయంగా కేసులో ఇరికించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. నాటి కేరళ ఏడీజీపీ సిబే మాథ్యూస్, కేకే జోష్వా, ఎస్ విజయన్‌లను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని 1998లో ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది.
అయితే, దీనిని హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టవేయడంతో ఆయన సుప్రీం తలుపుతట్టారు. జూన్ 2015లో దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేసు విచారణలో పాల్గొన్న అధికారుల ఆస్తుల నుంచి సొమ్ము సేకరించి బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొంది. ఇక, 2001లో జాతీయ మానవహక్కుల కమిషన్ సైతం శాస్త్రవేత్త నంబినారాయణన్‌కు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Tags:50 lakh compensation for ISRO scientists

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *