అమరావతికి 500 కోట్లే

Date:12/07/2019

విజయవాడ ముచ్చట్లు:

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాలతో పాటూ రైతులు, మహిళలు రాష్ట్రంలో ప్రాజెక్టులుకు భారీగా నిధులు కేటాయించారు. అయితే ఈ బడ్జెట్‌లో రాజధాని అమరావతికి మాత్రం నామమాత్రపు కేటాయింపులు జరిగాయి. బడ్జెట్‌లో కంటి తుడుపుగా కేవలం రూ.500కోట్లు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వం రాజధానికి బడ్జెట్‌లో పెద్దపీట వేస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం మొండిచేయి చూపించింది. రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం, హైకోర్టుతో పాటూ మరికొన్ని భవనాలను నిర్మించింది. అలాగే శాశ్వత హైకోర్టు భవనం, సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇక ఎమ్మెల్యేలు, ఉద్యోగులకు భవనాల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించగానే.. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను కూడా నిలిపివేశారు. ప్రధానంగా టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకంగా టెండర్లు కేటాయిస్తామంటున్నారు. పోలవరం విషయంలోనూ అదే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే అమరావతికి నిధులు తగ్గించారనే చర్చ మొదలయ్యింది. భవనాల నిర్మాణంపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో.. బడ్జెట్‌లో కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో కూడా ఏపీకి పెద్దగా కేటాయింపులు జరగలేదు. గతంలో రూ.1500 కోట్లు కేటాయించినా.. ఇప్పుడు రాజధాని, పోలవరం ప్రాజెక్టులకు పెద్దగా నిధులు కేటాయించలేదు. కేంద్ర బడ్జెట్‌లో నిధులు లేకపోవడం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో.. నిధులు కేటాయింపు నామమాత్రంగా ఉందనే మరో వాదన జరుగుతోంది. రాజధాని విషయంలో పూర్తి భారం కేంద్రంపై వేశారా అని ప్రశ్నలు మొదలయ్యాయి.దీనిపై ప్రతిపక్షం టీడీపీ ఎలా స్పందిస్తుంది.. వైసీపీ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

మళ్లీ నష్టాల్లో మార్కెట్లు

Tags: 500 crores to Amravati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *