శ్రద్ధా వాకర్ మర్డర్ 6629 పేజీల ఛార్జ్‌షీట్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులు ఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అఫ్తాబ్ పూనావాలా దారుణాన్ని అక్షరబద్ధం చేస్తూ ఏకంగా 6629 పేజీల ఛార్జ్‌షీట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరిపారు. నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలు సేకరించారు.భౌతిక సాక్ష్యాలతో పాటు ఫొరెన్సిక్, ఎలక్ట్రానిక్ ఆధారాలను కూడా సేకరించిన పోలీసులు – ఆ వివరాలన్నీ ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. ప్రతీ సాక్ష్యాధారాన్ని ప్రస్తావిస్తూ ఏకంగా 6629 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ఇందులో 100 మంది సాక్షుల నుంచి సేకరించిన వాంగ్మూలం కూడా ఉంది. అఫ్తాబ్‌కు నిర్వహించిన నార్కో పరీక్ష నివేదికతో పాటు నేరాన్ని అంగీకరిస్తూ అతనిచ్చిన ఒప్పుకోలు కూడా ఈ ఛార్జ్‌షీట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.28 ఏళ్ల అఫ్తాబ్ పూనావాలా తనతో సహజీవనం చేస్తున్న ముంబయికి చెందిన యువతి శ్రద్ధా వాకర్‌ను గతేడాది మే 18న అత్యంత దారుణంగా నరికి చంపాడు. సహజీవనం చేస్తున్న శ్రద్ధా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో అతను అత్యంత దారుణంగా వ్యవహరించాడు.
శ్రద్ధాను చంపి ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి ఆ శరీర భాగాలను 300 లీటర్ల ఫ్రిజ్‌లో స్టోర్ చేశాడు. రోజుకు కొన్ని భాగాలను ఢిల్లీలోని మెహ్రోలి అటవీ ప్రాంతంలో కొన్ని రోజుల పాటు విసిరేశాడు. కూతురు కనిపించడం లేదని శ్రద్ధా తండ్రి గతేడాది నవంబర్ 10న ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. క్రైమ్ షోలను చూసి ఇన్స్పైర్ శరీరాన్ని ముక్కలుగా నరికానని అఫ్తాబ్ పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలుస్తోంది.ఢిల్లీ శివారులోని అడవుల్లో పారేసిన శరీర భాగాల నుంచి సేకరించిన ఎముకలకు DNA పరీక్ష నిర్వహించి అవి శ్రద్ధా వాకర్‌కు చెందినవేనని పోలీసులు నిర్థారించారు. ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్న అఫ్తాబ్ పూనావాలాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు అతని కస్టడీని ఫిబ్రవరి 7 వరకు పొడిగించింది. ప్రేమించిన అమ్మాయిని దారుణంగా నరికి చంపిన అఫ్తాబ్ తీరుపై దేశం యావత్ కదిలిపోయింది. ఇప్పుడు ఈ నిందితుడి కోర్టు ఏం శిక్ష విధిస్తుందో చూడాలి.

Tags; 6629 page charge sheet of Shraddha Walker murder
