68,466 Srivari Arjitha Seva tickets released online:

ఆన్‌లైన్‌లో 68,466 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :

-‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Date:06/09/2019

తిరుమల ముచ్చట్లు:

శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి డిసెంబరు నెల కోటాలో మొత్తం 68,466 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 6,516 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 3,856, తోమాల 60, అర్చన 60, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2,300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరిలో 61,950 సేవాటికెట్లు ఉన్నాయి. వీటిలో విశేషపూజ 2,500, కల్యాణం 13,775, ఊంజల్‌సేవ 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,975, వసంతోత్సవం 15,950, సహస్రదీపాలంకారసేవ 17,400 టికెట్లు ఉన్నాయని వివరించారు.

 

 

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. విజయలక్ష్మీ – విశాఖపట్నం.

ప్రశ్న: 60 సంవత్సరాలు దాటిన వారికి ప్రత్యేక దర్శనం ఉందా ?

ఈవో : 65 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధులు, దివ్యాంగుల క్యూలైన్లో ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నాం.

2. ప్రభాకర్ రెడ్డి – ఓ భక్తుడు

ప్రశ్న: టోకెన్లు లేకపోయినా కొంతమందికి అంగప్రదక్షిణకు అనుమతిస్తున్నారు ?

ఈవో : అలా జరిగే అవకాశం లేదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

3. లత – విశాఖపట్నం

ప్రశ్న: బ్రేక్ దర్శనం టికెట్ల ధరలు పెంచి సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచండి ?

ఈవో : భక్తుల సూచనలు పరిగణలోకి తీసుకుని రానున్న బోర్డు సమావేశంలో చర్చిస్తాం.

4. కామేశ్వరి – విశాఖపట్నం.

ప్రశ్న: తిరుమలకు నేరుగా వస్తే వసతి లభిస్తుందా ?

ఈవో : తిరుమలలో రోజువారిగా దాదాపు 3,200 గదులు కరెంట్ బుకింగ్ లో అందుబాటులో ఉంటాయి. సీఆర్వోలో నమోదు చేసుకుని గదులు పొందవచ్చు.

5. శ్రీనివాస్ కుమార్ – విజయవాడ

ప్రశ్న: తోమాల, సుప్రభాత సేవలు పొందడం ఎలా ?

ఈవో : ప్రతినెలా మొదటి శుక్రవారం ఆర్జిత సేవలను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నాం. నాలుగు నెలల ముందు నుండే సేవలను బుక్ చేసుకోవచ్చు.

6. వినయ్ – నెల్లూరు

ప్రశ్న: టిటిడి స్థానికాలయాలను దర్శించుకునేందుకు తిరుపతిలోని శ్రీనివాసంలో ఉన్న ప్యాకేజీ టూర్ బస్సుల సంఖ్యను పెంచండి?

ఈవో : పర్యాటక శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

7. చంద్రశేఖర్ – గుడివాడ

ప్రశ్న: అలిపిరి చెక్ పాయింట్ వద్ద వృద్ధులు, పిల్లలకు ఇబ్బంది లేకుండా వాహనం మొత్తం స్కానింగ్ చేసేలా చర్యలు తీసుకోగలరు?

ఈవో : ఇప్పటికే ఈ అంశంపై చాలా సార్లు చర్చించాం. సరైన టెక్నాలజీ కోసం అన్వేషిస్తున్నాం.

8. ప్రకాశ్ – కర్నాటక

ప్రశ్న: అలిపిరి నడకదారిలో 7వ మైలు ఆంజనేయ విగ్రహం, మోకాలిమిట్ట వద్ద తాగునీరు సరిగా లేదు ?

ఈవో : ఇకపై అలా జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటాం.

9.బుచ్చిరెడ్డి – హైదరాబాద్

ప్రశ్న: భక్తులు పదే పదే దర్శనానికి రాకుండా చర్యలు తీసుకోగలరు?

ఈవో : కొందరు భక్తులు రూ.300 ప్రత్యేక దర్శనంతోపాటు సర్వదర్శనం స్లాట్, దివ్యదర్శనం స్లాట్ టోకెన్లు పొందుతుండడం వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారు. ఇలా జరుగకుండా చూడాల్సిన అవసరం ఉంది.

10. ఇమామ్ హుస్సేన్ – డోన్

ప్రశ్న: నేను ముస్లిం భక్తుడిని సామాన్యులకు త్వరగా దర్శనం కల్పించండి?

ఈవో : నేరుగా వచ్చే సామాన్య భక్తులు దివ్యదర్శనం, సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు పొంది నిర్దేశిత సమయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు.

11. సూర్య – హైదరాబాద్.

ప్రశ్న: అలిపిరి నడకదారిలో అన్నప్రసాద వితరణ త్వరగా ముగుస్తోంది. దర్శనం తర్వాత కొన్ని సమయాలలో చిన్న లడ్డూలను మాత్రమే ఇస్తున్నారు. పుష్కరిణి నుండి దివ్యదర్శనం కాంప్లెక్స్ కు వెళ్లడానికి దూరం ఎక్కువగా ఉంది?

ఈవో : అలిపిరి మార్గంలో ఎలాంటి కొరత లేకుండా అన్నప్రసాద వితరణ చేస్తాం. ఆలయంలో దర్శన సమయాన్ని బట్టి ఆయా వేళల్లో వేరువేరు ప్రసాదాలు అందిస్తారు. దివ్యదర్శనం భక్తులు తక్కువ దూరం నుండి క్యూలైన్లోకి ప్రవేశించే అంశాన్ని పరిశీలిస్తాం.

12. రామేశ్వర్ – నాసిక్

ప్రశ్న: నిర్దేశిత సమయానికి హాజరు కాలేక పోయినందున ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్లోకి అనుమతించలేదు?

ఈవో : సాంకేతిక కారణాల మూలంగా అనుమతించడం సాధ్యం కాదు.

13. రెడ్డెయ్య – రాయచోటి

ప్రశ్న: భారతం, భాగతవతం, రామాయణం తెలిసిన వారితో నిరంతరం ధర్మప్రచారం చేయించండి?

ఈవో : హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాలలో ఆలయాల నిర్మాణం, అర్చక శిక్షణ, మనగుడి, శుభప్రదం తదితర ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీరు చెప్పిన విషయాన్ని పరిశీలిస్తాం.

14. సుబ్రమణ్యం – చెన్నై

ప్రశ్న: నాదనీరాజనం వేదికపై భారీ ఎత్తున అన్నమయ్య సంకీర్తనల కచేరి నిర్వహించండి. వృద్ధులకు సాయంత్రం మరో స్లాట్ లో దర్శన అవకాశం కల్పించండి?

ఈవో : అన్నమయ్య సంకీర్తనల కచేరి అంశాన్ని పరిశీలిస్తాం. వృద్ధులు, దివ్యాంగులకు నెలకు అదనంగా 4వేల టోకెన్లను జారీ చేస్తున్నాం. వాటిని సద్వినియోగం చేసుకోండి.

15. వేంకటేశ్ – విశాఖపట్నం
ప్రశ్న: ఒక నెల ముందు మాధవ నిలయంకు వచ్చాం, పరిశుభ్రత సరిగాలేదు, నీటి లీకేజీ ఎక్కువగా ఉంది ?

ఈవో : దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం.

16. వరంగల్ – భిక్షపతి

ప్రశ్న: నాదనీరాజనంలో శాస్త్రీయ సంగీతంతో పాటు హరికథలు, బుర్రకథలు, ధార్మిక ఉపన్యాసాలు అందించగలరు?

ఈవో : మీ సలహాలను పరిగణలోకి తీసుకుంటాం.

17. నాగేంద్రప్రసాద్ – బెంగుళూరు

ప్రశ్న: లక్కీడిప్ ద్వారా అష్టదళపాదపద్మరాధన సేవకు వచ్చాం. నచ్చినవారిని ముందు వరుసలో కూర్చోబెడుతున్నారు, ప్రసాదాలు భక్తులకు అందడం లేదు?.

ఈవో : పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

18. సత్యలక్ష్మీ – కాకినాడ

ప్రశ్న: టిటిడిలో మీ పాలన చాలా బావుంది.

ఈవో : అధికారుల సమిష్టి కృషితో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం.

19. జయేంద్ర – కర్నూలు

ప్రశ్న: అన్ని రాష్ట్రాల భక్తులకు అర్థమయ్యేలా సూచిక బోర్డులు పెట్టండి?

ఈవో : తెలుగు, తమిళం, ఆంగ్లంలలో సూచిక బోర్డులు ఉన్నాయి. ఈ మూడు బాషలతోపాటు హిందీలోనూ ప్రకటనలు చేస్తున్నాం.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిటి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి   ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో   పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో   గోపినాథ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో   శివ‌కుమార్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్   రామ‌చంద్రారెడ్డి, ఎస్ఇ ఎల‌క్ట్రిక‌ల్స్   వేంక‌టేశ్వ‌ర్లు, విఎస్వోలు   మ‌నోహ‌ర్‌,   ప్ర‌భాక‌ర్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టో అమలు చేస్తున్న జగనన్నకు వందనం

Tags: 68,466 Srivari Arjitha Seva tickets released online:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *