40 మందికి 69 పనిచేస్తున్నారు..?
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని హెడ్ నర్సుల పనితీరుతో వైద్యాధికారులకు తలపోటు తప్పడం లేదా..? ఎంజీఎం ఆస్పత్రిని గాడిన పెట్టేందుకు స్వయంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు చొరవ చూపుతూ నిధులు, ఉద్యోగుల భర్తీ చేపడుతున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదా..? వైద్య సేవలు మెరుగుపడకపోవడానికి ప్రధాన కారణాల్లో హెడ్ నర్సుల సేవలు అధ్వానంగా ఉండటమేనని వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక అందిందా..? అంటే వైద్య వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అంతేకాదు ప్రధానంగా ఎంజీఎంలో హెడ్ నర్సులుగా పనిచేస్తున్న కొంతమంది పూర్తిగా విధులను గాలికి వదిలేయడమే కాదు.. పైరవీ కారులుగా, యూనియన్ లీడర్లుగా చెలామణి అవుతూ వైద్యాధికారులను బెదిరింపులకు గురిచేసే స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న వెయ్యి పడకల వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 40 మంది హెడ్ నర్సులు పనిచేయాల్సి ఉండగా లెక్కకు మించి విచిత్రంగా ఇక్కడ 69 మంది పనిచేస్తున్నారు. అయితే హెడ్ నర్సుల సంఖ్య గణనీయంగా ఉన్నా.. వైద్య సేవలను అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాల్సిన హెడ్ నర్సులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో హెడ్ నర్సుల పనితీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు ఓ నివేదిక అందినట్లుగా దిశకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.1000 పడకల ఎంజీఎం ఆస్పత్రిలో 40 మంది హెడ్ నర్సులు పనిచేయాల్సి ఉండగా.. విచిత్రంగా ఇక్కడ 69 మంది వరకు పనిచేస్తుండటం విశేషం. 69 మంది హెడ్ నర్సుల్లో ఎక్కువ మంది విధులను గాలికి వదిలేసిన వారే ఉన్నట్లుగా వైద్యుల ద్వారా తెలుస్తోంది. ఆస్పత్రిలో నిర్వహించే విధులను టైంపాస్ జాబ్‌గా పరిగణనిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. వార్డుల్లోకి వెళ్లకుండా కేవలం క్యాబిన్లలోనే కూర్చుంటూ పొద్దుపుచ్చే ముచ్చట్లతో కాలం వెళ్లదీసి ఇంటిదారి పడుతున్నట్లుగా విమర్శలున్నాయి. కొంతమందయితే కనీసం సంబంధిత వార్డుకు డాక్టర్ వచ్చినప్పుడు కూడా అందుబాటులో ఉండరన్న విమర్శలు ఉన్నాయి.

ఉన్నా తనకేం సంబంధం లేదన్నట్లుగా పేషంట్ గురించి వివరాలేమీ వారు డాక్టర్‌కు వివరించే పరిస్థితిలో ఉండకపోవడం విశేషం. ఇంత అధ్వానమైన పనితీరుతో మమ్మల్నే బెదిరింపులకు గురిచేయడం తప్పా.. వారు చేస్తున్నది శూన్యమని ఎంజీఎంలో ఓ సీనియర్ వైద్యుడు పేర్కొనడం గమనార్హం.విధుల విషయంలో అనేక కొర్రీలు పెడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. నైట్‌షిప్ట్ డ్యూటీలను వద్దని, గ్రౌండ్ ఫ్లోర్‌లోనే తమకు డ్యూటీలు వేయాలని పట్టుబడుతున్న వారు ఉండటం గమనార్హం. వాస్తవానికి మొత్తం మూడు షిఫ్ట్‌ల్లో ఒక్కో ఇన్‌వార్డుకు ఒక్కో హెడ్ నర్సు స్టాఫ్ నర్సులను కో ఆర్డినేషన్ చేసుకుంటూ రోగులకు వైద్య సేవలు అందేలా చూడాల్సి ఉంటుంది. డాక్టర్లు రౌండింగ్ వచ్చినప్పుడు పేషంట్ ఇబ్బందులను దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.డాక్టర్లు రాసిన ప్రిస్క్రిష్షన్‌ను కూడా ఫాలో చేసేలా స్టాఫ్ నర్సులకు సూచనలు చేయాలి. ఫాలోఅప్‌ను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. పేషంట్‌తో మృదుస్వభావంతో మాట్లాడుతూ వారిలో మనోధైర్యం కల్పించాలి. అయితే కొంతమంది హెడ్ నర్సులు ఇవేమీ తమ పని కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
వార్డుల పక్కన కేటాయించిన క్యాబిన్ల నుంచి కూడా కొంతమంది రావడం లేదన్న ఆరోపణలున్నాయి. స్టాఫ్ నర్సులకే విధుల బాధ్యతలను అప్పగించేస్తూ.. పర్యవేక్షణను గాలికి వదిలేస్తారన్న విమర్శలున్నాయి.ఎంజీఎంలో హెడ్ నర్సుల్లో కొంతమంది మాత్రం చాలా నిబద్ధతతో పనిచేస్తున్నా, మరికొంతమంది విధులపై అత్యంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఇన్‌వార్డులోని పేషంట్లను ఎంతోఅప్యాయంగా పలుకరిస్తూ వారిలో మనోధైర్యం కలిగేలా మంచి మాటలు చెబుతూ ట్రీట్‌మెంట్ చేయాల్సిన హెడ్ నర్సులు రోగులపై దురుసుగా మాట్లాడటం, బాధకలిగించేలా, కించ పరిచేలా భాషను వాడుతున్నట్లుగా ఆస్పత్రి అధికారులకు నిత్యం ఫిర్యాదులు వెళ్తున్నాయి.వైద్యాధికారులు ఇదే విషయంపై సున్నితంగా మందలించినా.. చర్యలకు ఉపక్రమించినా కుల సంఘాలు, యూనియన్ నేతలతో, రాజకీయ పార్టీల నాయకులతో ఫోన్లు చేయించి మరీ వైద్యాధికారులనే బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. సేవకు చిరునామా.. మానవత్వానికి ప్రతీకలా నిలిచే నర్సింగ్ వృత్తిని ఎంచుకున్న వారు ఎంతో నిబద్ధతతో పనిచేయాల్సింది పోయి ఇలా వ్యవహరిస్తుండటం బాధాకరమని ఎంజీఎం వైద్యులు, అధికార వర్గాల నుంచే విమర్శలు వ్యక్తమవుతుండటం గమనార్హం
Tags: 69 working for 40 people ..?
