ఇంటి నుంచే 80 ప్లస్ వారు ఓటు వేసే అవకాశం
న్యూఢిల్లీ, ముచ్చట్లు:
భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వినూత్న విధానాలు అమలు చేయనుంది. ఇంటి నుంచి ఓటు వేసే విధానాన్ని తొలిసారి ప్రవేశపెట్టనుంది. 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారికి, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ కల్పించనుంది. ఈ ఏడాది మేలోగా కర్ణాటక ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలను ప్రకటించారు.80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారి వద్దకు ఎన్నికల సిబ్బంది ఫామ్-12డీతో వెళతారని, దాని ద్వారా ఆ ఓటరు ఓటు వేయవచ్చని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు

ఈ ప్రక్రియ మొత్తాన్ని సిబ్బంది వీడియో తీస్తారని తెలిపారు. ఓటరు ఎవరికి ఓటు వేశారన్న విషయం రహస్యంగానే ఉంటుందని స్పష్టం చేశారు. 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారిని కూడా పోలింగ్ స్టేషన్లకే వచ్చేందుకు పోత్సహిస్తామని, అయితే రాలేని వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి దీన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది ఎన్నికల సంఘం.వోట్ ఫర్ హోమ్ గురించిన వివరాలను అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేస్తామని సీఈసీ అన్నారు.పోలింగ్ స్టేషన్ వరకు వచ్చి ఓటు వేయలేని దివ్యాంగుల కోసం సాక్ష్యం యాప్‍ను తీసుకొస్తున్నట్టు సీఈసీ వెల్లడించారు. ఈ యాప్‍లో లాగిన్ అయి.. ఇంటి నుంచి ఓటు వేసే ఆప్షన్‍ను దివ్యాంగులు ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం సువిధ పోర్టల్ ను తీసుకొచ్చినట్టు సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు
. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు ఆన్‍లైన్‍లోనే నామినేషన్లు, అఫిడవిట్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. సభలు, సమావేశాలకు అనుమతి తీసుకునేందుకు కూడా సువిధ పోర్టల్‍ను అభ్యర్థులు వినియోగించుకోవచ్చని తెలిపారు.నో యువర్ క్యాండిడేట్ అనే కార్యక్రమాన్ని కూడా ఈసీఐ తీసుకొచ్చింది. నేరచరిత్ర ఉన్న అభ్యర్థులను పోటీకి ఎందుకు ఎంపిక చేశారో, ఎందుకు టికెట్ ఇచ్చారో రాజకీయ పార్టీలు.. ఓటర్లకు పోర్టల్‍లో, సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ద్వారా సమాచారం ఇవ్వాలని వెల్లడించింది.కర్ణాటకలోని 224 స్థానాలకు ఈ ఏడాది మేలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తంగా 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓట్ ఫ్రం హోమ్ విధానాన్ని ఎన్నికల సంఘం అమలు చేయనుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
Tags;80 plus people can vote from home
