ఆగ‌స్టు 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగ‌స్టు 7న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఆగ‌స్టు 8న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 9న పవిత్ర సమర్పణ, ఆగస్టు 10న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు

ప‌విత్రోత్స‌వాల్లో ఆగ‌స్టు 7న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి ర‌ద్ధు చేసింది. అదేవిధంగా, ఆగ‌స్టు 9న అష్ట‌ద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న‌తోపాటు ఆగ‌స్టు 8 నుండి 10వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్ద‌య్యాయి.

 

Tags: 8th to 10th August Consecration at Srivari Temple

Leave A Reply

Your email address will not be published.