పుర యాప్ తో అందుబాటులోకి 91 సేవలు

91 Services available with Poor App

91 Services available with Poor App

 Date:15/08/2018
విజయవాడ ముచ్చట్లు:
మున్సిపాలిటీలో వీధి దీపాలు వెలగకున్నా.. కుళాయిల నుంచి నీటి విడుదల సక్రమం లేకున్నా.. కాల్వల్లో పూడికలు తొలగించకున్నా.. అనుమతి లేకుండా అడ్డదిడ్డంగా భవన నిర్మాణం జరుగుతున్నా.. తదితర సమస్యల పై గతంలో ఫిర్యాదులు అందించాలంటే ప్రజలు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి అధికారులకు విన్నవించినా పరిష్కారం కాని పరిస్థితి ఉండేది. చేసిన ఫిర్యాదులకు లెక్కాపత్రం కూడా ఉండేది కాదు. దీనితో అధికారుల్లో జవాబు దారీ తనం కొరవడేది.
ఇటువంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ప్రతి చిన్న పనికి మున్సిపల్ కార్యాలయానికి వచ్చే పనిలేకుండా ప్రభుత్వం పురపరిపాలన పారదర్శకం చేస్తూ సాంకేతిక బాట పట్టించింది. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమూలేదు… ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపింది. ప్రజలకు “పురాసేవ” యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
పట్టణ ప్రాంతాల్లో పౌర సమస్యలను నిర్ధిష్ట గడువులోగా పరిష్కరించేలా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.నగరాలు, పట్టణాల్లో పురపాలక సంఘాల నుంచి ప్రజలు సత్వర సేవలు పొందేందుకు పురసేవ యాప్ ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా 91 రకాల సేవలను ఆన్లైన్ విధానంలో పొందవచ్చు. యాప్ ను గూగూల్ ప్లేస్టోర్ లోకి వెళ్లి ఈగవ్ డాట్ ఏపీ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పబ్లిక్ హెల్త్, శానిటేషన్, పరిపాలన, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన సేవలను పొందవచ్చు. ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి చార్జీలు, బిల్డింగ్ ప్లాన్ అనుమతి, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ విభాగాలు ఈ యాప్ లో ఉంటాయి. ప్రజలు తమకు అవసరమైన విభాగాలు క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఆయా విభాగాలకు సంబంధించిన సమస్యలను, ఫిర్యాదులను మున్సిపాల్టీకి ఈ యాప్ ద్వారా పంపించవచ్చు.ముందుగా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్రీవియన్స్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ ద్వారా ఫిర్యాదులు మున్సిపాల్టీ ఆన్లైన్లో నమోదవుతాయి. సమస్యలు ఫొటోలు తీసి పంపవచ్చు. ఈ యాప్ ద్వారా పంపిన ఫిర్యాదులు ఏపీ మున్సిపల్ ఎంప్లాయియాప్ కు చేరుతాయి.
వీటిని సంబంధిత విభాగాల ఉద్యోగులు పరిశీలించి సమస్య పరిష్కారానికి నిర్ధిష్ట గడువులోపు పరిష్కరించాలి. లేక పోతే ఫిర్యాదు కమిషనర్ కు వెళుతుంది. అక్కడ కూడా మోక్షం లభించకపోతే ఉన్నత స్థాయి అధికారులకు వెళుతుంది. సరైన కారణం లేకుండా సమస్యను పరిష్కరించకపోయినా, ఫిర్యాదు స్వీకరించకపోయినా సంబంధిత ఉద్యోగుల పై చర్యలు తీసుకుంటారు.ఈ విధంగానే ఉన్నతాధికారులు, సీఎం కార్యాలయం డాష్ బోర్డ్ కు వస్తుంది. ఈ డాష్ బోర్డ్ ను ఉన్నతాధికారులు ప్రతి రోజు పర్యవేక్షిస్తుండటంతో క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలిసిపోతుంది. పౌర సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై తగు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది. తాగునీటి పైపు లైన్లు లీకేజ్, కలుషిత జలాలు సరఫరా, సక్రమంగా తాగు నీరు సరఫరా కాకపోవడం, రహదారుల మీద గోతులు, నాశిరకం పనులు, మురుగునీటి కాలువలు శుభ్రం చేయకపోవడం, చెత్తను తొలగించక పోవడం, అక్రమ కట్టడాలు, ప్రభుత్వ స్థలాలు, ఫుట్ ఫాత్ ల అక్రమణ, నిబంధనలకు విరుద్ధంగా ప్రకటన బోర్డులు, వీధి లైట్లు వెలగకపోవడం, కుక్కల బెడద, పార్కులు, క్రీడా మైదానాలు నిర్వాహణ తదితర సమస్యలను ఈ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థల పరిధిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘పుర సేవ’ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఈ యాప్ లోని గ్రీవెన్స్ విభాగంలోకి వెళ్లి సమస్యలను నేరుగా టైప్ చేసి పంపించవచ్చు. లేదా సమస్య ఫోటో తీసి, ఆ ప్రాంతం వివరాలు రాసి పంపిస్తే సంబంధిత ఉద్యోగి మొబైల్ కి చేరుతుంది. ఫిర్యాదుపై సంబంధిత ఉద్యోగి తీసుకున్న చర్యలను తిరిగి మళ్లీ ఫోటో ద్వారా తెలియజేయడం ఈ యాప్ ప్రత్యేకత.  ముందుగా జిల్లాను ఎంపిక చేసుకోవాలి. * మొబైల్ నెంబర్ నమోదు చేయాలి * పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకుని నమోదు చేయాలి * అనంతరం సమస్యల నమోదుకు సంబంధించి పలు విభాగాలు కనిపిస్తాయి. * వీటిలో పరిపాలన * ఇంజినీరింగ్‌ * పబ్లిక్‌హెల్త్‌ * రెవెన్యూ విభాగాలు ఉంటాయి.ఫిర్యాదులు * ఆస్తిపన్ను * ఖాళీస్థలంపన్ను * నీటి ఛార్జిలు * భవన నిర్మాణ అనుమతులు * భవన క్రమబద్దీకరణ * పౌరసేవాకేంద్రం * అత్యవసర సేవలు కనిపిస్తాయి.
వీటిలో అవసరమైన విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి.. ఫిర్యాదుదారుడు క్షేత్రస్థాయిలో జీపీఎస్‌ ఆధారంగా ఈ విధానం పనిచేస్తుంది. ఈ నూతన విధానంలో మొబైల్ జీపీఎస్‌ విధానంలో ఫోటో అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం మెసేజ్ బాక్స్ లో , మీ ఫిర్యాదు టైపు చెయ్యాలి. ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా పురపాలక అధికారులకు 46,157 ఫిర్యాదులు అందగా, 94.44 శాతం తో, 43,592 సంసీలు పరిష్కారమయ్యాయి. మిగిలిన 2,565 సమస్యలు పెండింగ్లో ఉన్నాయి.
Tags:91 Services available with Poor App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *