కాసులు కురిపిస్తున్న డ్రాగన్ ఫ్రూట్

అనంతపురం ముచ్చట్లు:


ఆరోగ్యదాయినిగా పేరుగాంచిన డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతులకు కాసుల పంట పండిస్తోంది. ఉద్యాన పంటలకు నెలవైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు లాభదాయకంగా సాగు చేస్తున్న పండ్ల రకాల జాబితాలో తాజాగా డ్రాగన్‌ ఫ్రూట్‌ చేరింది. సేంద్రియ పద్ధతుల్లో డ్రాగన్‌ సాగు చేస్తూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు మంచి లాభాలు కళ్లజూస్తున్నారు.ఈ కోవకు చెందిన వారే కేవీ రమణారెడ్డి. అనంతపురం శివారు సిండికేట్‌నగర్‌కు చెందిన రమణారెడ్డి గార్లదిన్నె మండలం మర్తాడులో 3 ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌తో పాటు మరో 6 ఎకరాల్లో ఖర్జూరం సాగు చేస్తున్నారు. పదో తరగతి వరకు చదువుకున్న రమణారెడ్డి రెండేళ్ల క్రితం డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు శ్రీకారం చుట్టి, రెండో ఏడాదే మంచి దిగుబడులు సాధించారు.  రెండేళ్ల క్రితం డ్రాగన్‌ ఫ్రూట్‌ రెడ్‌ రకం 6 వేల మొక్కలను తెప్పించిన రమణారెడ్డి మూడు ఎకరాల్లో నాటారు. చెట్ల మధ్య 8 అడుగులు, సాళ్ల మధ్య 10 అడుగులు దూరంలో సిమెంటు స్థంభాలు నాటి… స్థంభానికి నాలుగు మొక్కలు నాటారు. గుంత తీసి అందులో వేపపిండి, వర్మీకంపోస్టు, పశువుల ఎరువు వేసి.. ఎకరాకు 500 సిమెంటు స్థంభాల చుట్టూ 2 వేల మొక్కలు నాటారు. స్తంభం పైభాగంలోకి మొక్కలకు ఆలంబనగా పాత టైరును అమర్చారు. మొత్తమ్మీద పంటకు తొలి ఏడాది మొక్కల ఖర్చు,

 

 

 

సిమెంటు పోలు, రింగు తదితర వాటిని పరిగణలోకి తీసుకుంటే ఎకరాకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. తర్వాత నుంచి ప్రతి ఏటా రూ.50 వేలకు కాస్త అటుఇటుగా ఖర్చవుతుంది. నీళ్లు పెద్దగా అవసరం లేదు. డ్రిప్‌ ద్వారా 15 రోజులకో తడి ఇస్తున్నాను. వర్షాకాలంలో అవసరం లేదు.ఎకరాకు ఏటా 10 నుంచి 12 టన్నుల వరకు డ్రాగన్‌ పండ్ల దిగుబడి వస్తుందని అంటున్నారు రమణారెడ్డి. వేపనూనె పిచికారీ చేస్తే ఎర్రచీమల సమస్య అదుపులోకి వచ్చిందని రమణారెడ్డి వివరించారు. ఏడాదికి రెండు సార్లు ఐదు ట్రాక్టర్లు పశువులు ఎరువు వేశారు. కొంత కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వాడాను. పండ్ల కోతకు కూలీల అవసరం తక్కువే. తాను, తన భార్య లక్ష్మీదేవితో పాటు ఇద్దరు ముగ్గురు కూలీలతో సరిపోతోందన్నారు.  అంట్లు కట్టి, మొక్కల అమ్మకం మొదలు పెట్టారు. ఒక కటింగ్‌ను రూ.70కి, రెండు నెలలు పెంచిన మొక్కను రూ.100కి అమ్ముతున్నానని రమణారెడ్డి చెబుతున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో డ్రాగన్‌ మించిన ఆదాయాన్నిచ్చే పంట మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.   డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు అనంతపురం జిల్లా నేలలు, వాతావరణం అనుకూలమే. ఇప్పటికి 20 మందికి పైగా రైతులు 70–80 ఎకరాల్లో డ్రాగన్‌ సాగు చేపట్టారు. మొదటి ఏడాది పెట్టుబడి ఎక్కువ అయినా మున్ముందు లాభదాయకంగా ఉంటుంది.

 

Tags: A dragon fruit that pours money

Leave A Reply

Your email address will not be published.