వాయు కాలుష్యం కల్గిస్తే కోటి జరిమానా

Date:29/10/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశ రాజధాని ఢిల్లీని పట్టిపీడిస్తోన్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. కాలుష్యానికి కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలపడంతో బుధవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం వాయు కాలుష్య కారకులకు గరిష్ఠంగా ఐదేళ్ళ జైలు, రూ.1 కోటి వరకు జరిమానా విధించేందుకు అవకాశం ఉంటుంది.ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా.. తర్వలోనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని నిషేధం విధించాలని ఈ వ్యాజ్యం కోరింది.కేంద్రం జారీ చేసిన తాజా ఆర్డినెన్స్ ప్రకారం, ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోసం ఓ శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని కింద పర్యవేక్షణ-గుర్తింపు, రక్షణ-అమలు, పరిశోధన-అభివృద్ధి అనే మరో మూడు సబ్-కమిటీలు ఉంటాయి. ఇవి ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని రాష్ట్రాలకు ప్రతినిధులుగా వ్యవహరిస్తాయి. ఆర్డినెన్స్ నిబంధనలు, కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించినవారికి గరిష్ఠంగా ఐదేళ్ల జైలు లేదా రూ.1 కోటి వరకు జరిమానా లేదా ఈ రెండూ విధించవచ్చు.ఈ కమిటీకి అధ్యక్షుడిని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక కమిటీలో కేంద్ర, ఆయా రాష్ట్రాల రవాణా, వాణిజ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులు, కేబినెట్ సెక్రటరీ మొత్తం 20 మంది సభ్యులుగా వ్యవహరిస్తారు. గాలి కలుషితమవడానికి దోహదపడుతున్న అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. పంట వ్యర్థాల కాల్చివేత, వాహన కాలుష్యం, ధూళి కాలుష్యం, గాలి నాణ్యతను క్షీణింపజేసే ఇతర అంశాలను పరిశీలించి, వార్షిక నివేదికలను పార్లమెంటుకు సమర్పిస్తుంది. కమిషన్ ఆదేశాలపై సివిల్ కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదు, కేవలం జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ)లోనే సవాలు చేయవచ్చు.

ధరణి దేశానికి ట్రెండ్ సెట్టర్  -కేసీఆర్

Tags: A fine of Rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *