పాలేరులో చతుర్మఖ పోటీ తప్పదా
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మీద ప్రధాన పార్టీల ముఖ్య నేతల కన్ను పడింది. మేమంటే మేమంటూ ఈసారి పలువురు నాయకులు ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, తమ్మినేని సీతారామ్, వైఎస్ షర్మిల లాంటి నాయకులంతా పాలేరు పోరుకు సిద్ధమవుతున్నారట. మొదటి నుంచి కాంగ్రెస్‌కు పట్టు ఉన్న నియోజకవర్గంగా పాలేరుకు పేరుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు ఇక్కడి నుంచి ఆ పార్టీనే గెలిచింది. వివిధ కోణాల్లో చూస్తే… ఇక్కడ సమీకరణలు విచిత్రంగా ఉంటాయి. అందుకే నాయకులంతా ఎవరికి వారు పోటీకి ఉవ్విళ్ళూరుతున్నారు.సామాజిక సమీకరణల పరంగా చూస్తే…. పాలేరులో కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. కానీ… రాజకీయంగా రెడ్ల ఆధిపత్యం ఉంటుంది. కమ్యూనిస్ట్‌లకు కూడా పట్టున్న ప్రాంతం ఇది. భౌగోళికంగా తెలంగాణలో ఉన్నా… ఆంధ్ర ప్రాంత ప్రభావం ఉంటుంది. ఇలా… భిన్న కోణాల్లో ఈ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు కందాల ఉపేందర్‌రెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోసారి ఇదే సీటును అధికార పార్టీ తరపున ఆశిస్తున్నారు ఆయన.
స్వతహాగా కాంట్రాక్టర్ అయిన ఉపేందర్‌రెడ్డికి స్థానికంగా బంధువర్గం కూడా ఎక్కువగానే ఉంది. అదే సమయంలో ఇక్కడి నుంచి పోటీచేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన ప్రయత్నాల్లో ఉన్నారు. బిఆర్ఎస్ నుంచి తనకే సీటు వస్తుందని నమ్మకంతో ఉన్నారట తుమ్మల. సీఎం కేసీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యం ఉపయోగపడుతుందని, ఈసారి పాలేరు సీటు నాదేనని చెబుతున్నారట ఆయన. గతంలో ఉప ఎన్నికలో గెలిచినప్పుడు తాను చేసిన అభివృద్ధిని కూడా గుర్తు చేస్తున్నారట తుమ్మల. సిట్టింగ్‌గా కందాల ఉపేందర్‌రెడ్డి కూడా అధికార పార్టీ రేసులో నేనే ఉన్నానని చెబుతున్నారట. గతంలో తుమ్మల అనుచరులుగా ఉన్న వారంతా ఇప్పుడు కందాల వద్దకు వచ్చి చేరిపోయారు. దీంతో తుమ్మల, కందాల వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడిందట.అధికార పార్టీలోనే ఇంత పోటీ ఉంటే… కలిసి పోటీ చేయాలనుకుంటున్న సీపీఎం కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇక్కడి నుంచి బరిలో దిగాలనుకుంటున్నారట. నియోజకవర్గంలోని కల్దార్‌పల్లి ఆయన సొంత గ్రామం. అందుకే పొత్తులో భాగంగా ఈ సీటును తమకే అడగాలని అనుకుంటున్నారట వీరభద్రం.

మరోవైపు…పాలేరులో పాగా వేయాలని వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఈ మట్టి సాక్షిగా తాను పాలేరు బిడ్డనని చెబుతూ పోటీ చేసి గెలుస్తానన్న ధీమాతో ఉన్నారట ఆమె. బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం, ఆంధ్రా ప్రభావం తనకు ప్లస్ అవుతాయని అనుకుంటున్నారట ఆమె.ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు బలమైన నాయకులు లేకుండాపోయారు. ఆ పార్టీ నుంచి గ్రానైట్ వ్యాపారి రాయల నాగేశ్వరరావు రంగంలోకి దిగే అవకాశం ఉంది. రాయల నాగేశ్వరరావు మొన్నటి స్థానిక ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన రేణుకాచౌదరిని నమ్ముకొని పాలేరు నుంచి ఎంఎల్ఎగా పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే కీలకమైన రాజకీయం మొత్తం తుమ్మల, కందాల, తమ్మినేని, షర్మిల చుట్టూనే తిరుగుతోంది.
Tags; A four-sided competition is inevitable in Paleru
