Natyam ad

మునుగోడులో చతుర్ముఖ పోటీ ?

నల్గొండ  ముచ్చట్లు:

రాజీనామా చేసి మునుగోడు అసెంబ్లీ సెగ్మెంటును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిఖాళీ చేశారో లేదో ఇటు ప్రధాన పార్టీలన్నీ ఆ సెగ్మెంటును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు మొదలు పెట్టాయి. నాలుగైదు రోజుల వ్యవధిలోనే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులపై ఓ క్లారిటీ కనిపిస్తోంది. చివరి నిమిషంలో అనుకోని మార్పులు జరక్కపోతే మాత్రం ఇపుడు వినిపిస్తున్న అభ్యర్థులే ఖరారయ్యే సంకేతాలున్నాయి. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారు కాగా.. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున చల్లమల్ల కృష్ణారెడ్డిలకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి మునుగోడు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పార్టీ శ్రేణులకు ఏ మాత్రం అందుబాటులో వుండని వ్యక్తికి అవకాశం ఇవ్వొద్దని వారంతా మంత్రి జగదీశ్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. కానీ ఆర్థికంగా బలంగా వున్న ప్రభాకర్ రెడ్డి అయితేనే రాజగోపాల్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొంటారని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నెప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నేతలు కూడా చివరి నిమిషంలో ఏదైనా అద్బుతం జరిగి తమకు అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నట్లు సమాచారం.

 

 

 

Post Midle

ఇక కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌ను ఆశిస్తున్న వారిలో పాల్వాయి స్రవంతి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా.. రియల్టర్ చిల్లమల్ల కృష్ణారెడ్డి వైపే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన చెరుకు సుధాకర్ అభ్యర్థిత్వాన్ని సామాజిక వర్గాల కోణంలో పరిశీలిస్తున్నా.. చివరికి కృష్ణారెడ్డికే అవకాశం దక్క వచ్చని అంటున్నారు. ఈ లెక్కన మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు.. రెడ్డి సామాజిక వర్గానికే ఆర్థిక బలం ప్రాతిపదికన అవకాశం ఇచ్చే సంకేతాలే ఎక్కువ. నియోజకవర్గంలో 67 శాతం బీసీలు వుండగా ప్రధాన సామాజిక వర్గం గౌడ్స్ అన్న అంశం గణాంకాల ఆధారంగా తేలుతోంది. అయితే, ఆర్థికంగా ధీటైన వ్యక్తులకే అవకాశం ఇచ్చేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక గతంలో 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన సీపీఐ పార్టీ కూడా ఈసారి తమ చిరకాల మిత్ర పక్షం సీపీఏం(తో కలిసి పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. సీపీఐ తరపున ఎవరు బరిలోకి దిగుతారన్నదింకా తేలకపోయినా.. రెండు వామపక్షాలు సమన్వయంతో పని చేయనున్నట్లు సంకేతాలిస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకుతోడు సీపీఐ( కూడా బరిలో నిల్వనుండడంతో చతుర్ముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ మరో ట్విస్టు కూడా వినిపిస్తోంది. బీజేపీ విజయాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ మద్దతివ్వాలని సీపీఐ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. కానీ బరిలో దిగుదామని సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  తమ సహచర వామపక్ష పార్టీ సీపీఐకి సూచిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సీపీఐ కీలక భేటీ జరగనున్నది. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సీపీఐ బరి నుంచి తప్పుకుంటే సీపీఎం పార్టీ బరిలోకి దిగే సంకేతాలున్నాయి.

 

 

 

మరోవైపు తెలంగాణ బీఎస్పీకి సారథ్యం వహిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తమ పార్టీ కూడా మునుగోడు బరిలో నిలుస్తుందని ప్రకటించారు. అయితే, ఆ పార్టీ ప్రభావం ఏ మేరకు  వుంటుందనేది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.2014లో మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అయితే, నాలుగున్నరేళ్ళ పదవీకాలంలో ఆయన పార్టీ శ్రేణులను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నది పలువురు టీఆర్ఎస్ శ్రేణుల ఆరోపణ. ఈ ఆరోపణలతోనే పలువురు మంత్రి జగదీశ్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ ఏర్పాటు చేయాలని వారంతా ముక్తకంఠంతో మంత్రిని కోరారు. వారిని కలిసేందుకు కేసీఆర్ కూడా సుముఖంగా వున్నట్లు ఆగస్టు 10న ప్రచారం జరిగింది. చివరికి కేసీఆర్ సమయం కేటాయించకపోవడంతో మునుగోడు టీఆర్ఎస్ శ్రేణులు జగదీశ్ రెడ్డికి తమ గోడును వివరించారు. ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా వున్నప్పుడు పార్టీ శ్రేణులపైనే కేసులు పెట్టించారని, తన మాట వినని వారిని వేధించారని వారు వాపోయినట్లు సమాచారం. అయితే, ప్రత్యేక సందర్భంలో జరగనున్న ఉప ఎన్నిక కాబట్టి ఏ మాత్రం ఛాన్స్ తీసుకునే వీలు లేదని, అందుకే కేసీఆర్ ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే ఆయన విజయం కోసం పార్టీ శ్రేణులంతా పని చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు శ్రేణులకు సూచించినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం మునుగోడులో రిపీట్ కాకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు టీఆర్ఎస్ అధిష్టానం సిద్దమవుతోంది. అయితే, రాజీనామా చేసే ముందు రాజగోపాల్ చేసిన ఓ ప్రకటన అధికార టీఆర్ఎస్ పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామా చేయగానే కేసీఆర్ ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గానికి లెక్కలేనన్ని వరాలు ప్రకటించింది. దళిత బంధు లాంటి కాస్ట్లీ ఉచిత పథకాన్ని హుజురాబాద్ నుంచే ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

 

 

 

అదే పరిస్థితి మునుగోడులో తలెత్తుతుందని పలువురు అంచనా వేసారు. అయితే, ఉప ఎన్నిక వస్తే నియోజకవర్గానికి చాలా మేళ్ళు జరుగుతాయని రాజగోపాల్ తాను రాజీనామా చేసే ముందు కామెంట్ చేశారు. ఇపుడు మునుగోడుకు వరాలు ప్రకటిస్తే వాటిని తన ఖాతాలో వేసుకునేందుకు రాజగోపాల్ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తారని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మునుగోడు విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తారని తెలుస్తోంది.తన రాజీనామా ద్వారా మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చేందుకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాగైనా మళ్ళీ విజయం సాధించి తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజేపీ అధినాయకత్వం మార్గదర్శకత్వంలో పలువురు రాష్ట్ర నాయకులు మునుగోడుపై దృష్టి సారించారు. ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, వివేక వెంకటస్వామి తదితరులు మునుగోడు వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. రాజగోపాల్ నియోజకవర్గంలోని మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో భేటీ నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో కొంత మంది రాజగోపాల్‌తోపాటు బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపుతుండగా మరికొందరు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వ్యక్తిగతంగా రాజగోపాల్ విజయానికి పని చేస్తామని హామీలిచ్చి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా.. గతంలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం (2009-2014 మధ్య కాలంలో) వహించిన రాజగోపాల్‌కు మునుగోడుతోపాటు భువనగిరి లోక్‌సభ సీటు పరిధిలో వున్న మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోను పట్టుంది. దాంతో ఆ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నాయకులతో రాజగోపాల్ రెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు, వారితో ఓ సోషల్ మీడియా గ్రూపు ఏర్పాటు చేసి సమన్వయం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరంతా పార్టీ మారినా, మారకపోయినా రాజగోపాల్ రెడ్డి విజయానికి పని చేసేలా వ్యూహాత్మకంగా సమన్వయం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ తరపున బాధ్యులుగా వ్యవహరిస్తున్న వారిలో ఈటల రాజేందర్ ఇప్పటికే కార్యక్షేత్రంలోకి దిగారు.

 

 

 

ఈటల రాజేందర్ సతీమణి సొంతూరు మునుగోడు నియోజకవర్గంలో వుంది. మునుగోడు మండలం పలివెల ఈటల రాజేందర్ అత్తగారి ఊరు. దాంతో ఆయన పలివెల గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసుకుంటున్నారు. పలివెల కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈటల సిద్దమవుతున్నారు. ఇక వివేక్ వెంకటస్వామిని నియోజకవర్గం ఇంఛార్జిగా నియమించాలని రాజగోపాల్ రెడ్డి బీజేపీ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. దాంతో ఆయన కూడా మునుగోడు ఉప ఎన్నికలో కీలకంగా వ్యవహరించే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల మేనేజ్‌మెంటులో స్పెషలిస్టు అని పేరున్న మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డిని పార్టీ మునుగోడుకు డిప్యూట్ చేయనున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదిలా వుండగా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఇంకా చేరలేదు. ఆగస్టు 21న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో రాజగోపాల్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ సభను ముందుగా చౌటుప్పల్‌లో నిర్వహించాలని బీజేపీ భావించింది. కానీ తాజాగా మునుగోడు అనే పేరే ప్రధానంగా ప్రచారంలో వున్నందున మునుగోడు కేంద్రంగానే సభ నిర్వహించేందుకు తాజాగా పార్టీ సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసే బాధ్యతను గూడురు నారాయణ రెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా మునుగోడులో పాదయాత్ర చేయాలని రాజగోపాల్ రెడ్డి టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ని కోరగా.. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగిసిన తర్వాత వినాయక చవితి, దసరా మధ్య కాలంలో మునుగోడులో పాదయాత్ర చేద్దామని ఆయన బదులిచ్చినట్లు తెలుస్తోంది.

 

 

 

ఇక కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నిక చిచ్చు రేపుతున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా వుండడంతో వారిని బుజ్జగించడం టీపీసీసీకి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగోర్‌కు శక్తికి మించిన పనిగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న వారిలో పాల్వాయి స్రవంతి రెడ్డి, చెరుకు సుధాకర్ గౌడ్, పున్న కైలాశ్ నేత, పల్లె రవికుమార్ గౌడ్ తదితరులుండగా.. వారందరినీ కాదని చల్లమల్ల కృష్ణా రెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో మిగిలిన వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నట్లు గాంధీభవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పార్టీలో ఎలాంటి అసమ్మతిని ఎదగనీయకుండా చేసేందుకు సమన్వయంతో పని చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. మండలాల వారీగా సమన్వయ కమిటీలను నియమిస్తోంది. అధిష్టానం అభ్యర్థి పేరును ప్రకటించే వరకు ఎవరు తమని తాము అభ్యర్థిగా ప్రచారం చేసుకోవద్దని ఆశావహులను మాణిక్కం ఠాగోర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 16వ తేదీ నుంచి మండలాల వారీగా పార్టీ శ్రేణులతో భేటీలు నిర్వహించి, అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థిని ఎంపిక చేయాలని తలపెట్టారు కాంగ్రెస్ నేతలు. ఓవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇంకోవైపు పార్టీ తెలంగాణ వ్యవహరాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగోర్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు కలిసి పార్టీ శ్రేణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సర్వేలు, మండలాల వారీగా అభిప్రాయ సేకరణ పూర్తయ్యాకనే అభ్యర్థి ఎంపిక జరుగుతుందని బోసు రాజు ప్రకటించారు. మొత్తమ్మీద మూడు ప్రధాన పార్టీలకుతోడు వామపక్షాలు కూడా మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో ఉప ఎన్నికల పర్వం ఆసక్తికరంగా మారుతోంది.

 

Tags: A four-way competition in the past?

Post Midle