ఈటల రాజేందర్ కు భారీ షాక్

మెదక్ ముచ్చట్లు:


ఈటల రాజేందర్ కు భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన జమునా హేచరీస్ కు చెందిన భూమిని అసైన్డ్ భూములంటూ 56 మంది రైతులకు ప్రభుత్వం పంచేసింది. కాగా రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా గుర్తింపు పొందిన ఈటల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులకు పంపిణీ చేయడం సంచలనంగా మారింది. ఇటీవల పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన ఈటల బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసి వచ్చారు. రాజకీయ కారణాల కంటే ఈటల తన భూముల విషయంలో బీజేపీ అగ్రనేతల అండ కోసమే హస్తిన వెళ్లారని ఆప్పట్లోనే వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు ఈటల భూములను రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేసినవే అని నిర్ధారించి ఆఘమేఘాల మీద రైతులకు పంపిణీ చేయడంతో బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఈటలకు ఎటువంటి అండా లభించలేదా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. ఇటీవల కొంత కాలంగా ఈటల మౌనం, బీజేపీతో అంటీముట్టనట్లు ఉన్న తీరుతో ఆయన బీజేపీలో ఇమడ లేకపోతున్నారని పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు. అయితే అమిత్ షా రాష్ట్ర పర్యటనలో ఈటలతో మాట్లాడటం, ఆయన ప్రాధాన్యత ఉన్న నేతేనని చెప్పడంతో ఆల్ ఈజ్ వెల్ అన్న భావన కలిగింది. అయితే ఈటల భూములను ప్రభుత్వం పేదలకుపంచేయడంతో ఆయనకు బీజేపీ నుంచి ఎటువంటి సహకారం అందలేదని తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.దాదాపు రెండు నెలల నుంచీ   కమలం పార్టీలో ఈటలను ఏకాకిని చేశారన్న ప్రచారం జరుగుతోంది.

 

 

గుర్తింపు లేని చోట ఈటల మౌనంగా సర్దుపోవడానికి కారణం తనపై ఉన్న భూ కబ్జా ఆరోపణలేననీ, బీజేపీ అండతో వాటి నుంచి బయటపడాలని ఈటల భావించడమేనని కూడా  అప్పట్లో పలువురు ఈటల సన్నిహితులు పేర్కొన్నారు. ఎంతగా సర్దుకు పోయినా ఈటలకు బీజేపీ అండగా నిలవలేదని ఇప్పుడు టీఆర్ఎస్ ఆయన అధీనంలోని భూములను రైతులకు పంపిణీ చేయడమేనని అంటున్నారు. ఇక భూముల పంపిణీ విషయానికి వస్తే  ఈటలకు చెందిన జమునా హేచరీస్ అధీనంలో ఉన్న    85 ఎకరాల 19 గుంటల గురువారం ప్రభుత్వం పేదలకు పంచేసింది.   బీజేపీ అభ్యర్ధిగా    హుజూరాబాద్  ఉప ఎన్నికలో ఈటల గెలిచినప్పటికీ.. ఆ గెలుపులో భీజేపీకి ఏమాత్రం భాగస్వామ్యం లేదనీ, అది పూర్తిగా ఈటల విజయమని అప్పట్లోనే విశ్లేషణలు వెల్లువెత్తాయి.  దీంతో ఆయన రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఎదుగుతారన్న భయంతో పార్టీలో ఆయన ఎదుగుదలను రాష్ట్ర బీజేపీ నాయకత్వం అడ్డుకుందన్న ప్రచారం కూడా జోరుగా సాగింది.  ఆ కారణంతోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అగ్ర నాయకత్వం వద్ద చక్రం తిప్పి ఈటల భూ కబ్జా ఆరోపణల విషయంలో పార్టీ నుంచి అండ అందకుండా చేసిందన్న అభిప్రాయం   రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా ఈటల అధీనంలోని జమునా హేచరీస్ భూమిని ప్రభుత్వం రైతులకు పంపిణీ చేయడంతో ఈటల బీజేపీలో సౌఖ్యంగా, సౌకర్యంగా లేదనీ పార్టీతో ఆయన సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్న వాదనకు బలం చేకూరినట్లైంది.

 

Tags: A huge shock for Etala Rajender

Leave A Reply

Your email address will not be published.