దేశభక్తిని చాటిన “మహాసంగ్రామర్ మహానాయక్ ” నాటక ప్రదర్శన

కళా పోషణకు భాషతో పనిలేదని నిరూపించిన బెజవాడ వాసులు
జాతిని జాగృతం చేసేలా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రచన
తమ దైన శైలిలో హావభావాలను పలికించిన ఓడిస్సా కళాకారులు

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

భాషను మించి భావం అందించే మధురానుభూతిని విజయవాడ నగర ప్రజలు అస్వాదించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వ భూషణ్ హరిచందన్ విరచిత మహా సంగ్రామర్ మహా నాయక్ ఒడియా నాటక ప్రదర్శనకు బెజవాడ ప్రజలు బ్రహ్మరధం పట్టారు. కళాపోషణకు భాషతో పనిలేదని నిరూపించారు. రాష్ట్ర పర్యాటక భాషా సాంస్కృతిక శాఖ , విజయవాడ నగర పాలక సంస్ధ, అభినయ ధియేటర్ ట్రస్ట్ సంయిక్త ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో సాగిన ఓడియా నాటక ప్రదర్శన అలనాటి స్వాతంత్ర్య సంగ్రామ ఘట్టాలను మరోసారి ఆవిష్కరించింది. బ్రిటీషర్లు భారతీయులపై సాగించిన దమనకాండకు వ్యతిరేకంగా ఓడిస్సాకు చెందిన స్వాతంత్ర్య సంగ్రామ వీరుడు శ్రీ బక్సీ జగబంధు బిద్యధర్ మోహపాత్ర భ్రమరాబర్ రే సాగించిన పోరాటాన్ని గౌరవ బిశ్వభూషన్ హరిచందన్ తన రచనా పాటవంతో కళ్లకు కట్టినట్టు చూపించారు.
ప్రతి కళాకారుడు తమదైన శైలిలో హావభావాలను పలికిస్తూ ప్రేక్షకులు నాటక వీక్షణలో తన్మయత్వం చెందేలా రక్తి కట్టించారు. ఓడిస్సాకే చెందిన ధీర మాలిక్ దర్శకత్వం వహించగా , దాదాపు 35 మంది కళాకారులు భువనేశ్వర్ నుండి వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నారు.

 

 

 

నాటకం యావత్తు ప్రతి అంకంలోనూ దర్శక ప్రతిభ తొణికిసలాడింది. నాటక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ నాటకాలతో జాతీయోద్యమ చరిత్రకు జీవం పోయవచ్చాన్నారు. నేటి తరానికి నాటి చరిత్రను తెలియ చెప్పటంలో నాటకాలు సోపనాలుగా నిలుస్తాయన్నారు. జాతిని జాగృతం చేసేలా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ రచించిన మహాసంగ్రామర్ మహానాయక్ నాటి చరిత్రకు నిలువెత్తు నిదర్శనమన్నారు. మంచి నాటకాన్ని విజయవాడ ప్రజలకు పరిచయం చేయటంతో కీలక పాత్రను పోషించిన అభినయ ధియేటర్ ట్రస్ట్ నిర్వాహకుడు శ్రీనివాస్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
కార్యక్రమానికి స్ధానిక శాసన సభ్యుడు మల్లాది విష్ణు అధ్యక్షత వహించగా, గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ జయప్రకాష్ నారాయణ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్మన్ హరిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత విజయ భాస్కర్, రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, వైద్య నిపుణులు బూసి నరేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన అనంతరం సాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లిఖార్జున రావు కళాకారులను మెడల్, ధృవీకరణ ప్రతాలతో సత్కరించారు.

 

Tags: A patriotic play “Mahasangramar Mahanayak”.

Leave A Reply

Your email address will not be published.