టీ కాంగ్రెస్ లో ఓ రేంజ్ ఇంటిపోరు

-ఆగని  రాజీనామాల పర్వం

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. కానీ ఎప్పుడు ఎలక్షన్స్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. మునుగోడు మంట తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇంకా తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. ఆయన ఆగస్టు ఆరో తేదీన అపాయింట్‌మెంటు కోరితే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి 8వ తేదీన అపాయింట్‌మెంటు ఇచ్చారు. సో, ఆయన రాజీనామా వాయిదా పడింది. ఈలోగా ఢిల్లీ వెళ్ళి బీజేపీ లో నెంబర్ టూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలిసారాయన. ఆగస్టు 21వ తేదీన అమిత్ షా తెలంగాణకు వస్తారని, ఆరోజునే తనతోపాటు మరికొందరు బీజేపీలో చేరతామని రాజగోపాల్  వెల్లడించారు. హైదరాబాద్  రాగానే అసెంబ్లీకి వెళతానని, స్పీకర్ వుంటే ఆయనకు, లేకపోతే అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖ ఇస్తానని కూడా ఆయన చెప్పేశారు. మరోవైపు రాజగోపాల్ కామెంట్లకు జవాబిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజగోపాల్ సోదరుడు వెంకట్ రెడ్డి లో ఆగ్రహ జ్వాలలు రగిలేలా చేశాయి. రాజగోపాల్ వెళ్ళిపోయినా తాను పార్టీలో వుంటానంటుంటే.. తనను, తన సోదరుడు రాజగోపాల్‌ని ఒకగాటన కట్టి ‘‘మీరు’’ అంటూ సంబోధించి బ్రాండింగ్ చేయడంపై వెంకట్ రెడ్డి.. రేవంత్‌ని క్షమాపణ కోరారు.

 

 

 

ఆ తర్వాత ఆయనే ఓ మెట్టుదిగి.. క్షమాపణ చెప్పే విషయాన్ని రేవంత్ విచక్షణకు వదిలేస్తున్నానని అన్నారు. ఇంత జరుగుతున్నా వెంకట్ రెడ్డికి క్లారిఫికేషన్ ఇచ్చేందుకు రేవంత్ కనీసం ప్రయత్నం చేయకపోవడంతో వెంకట్ రెడ్డిని వదిలేసుకునేందుకే ఆయన రెడీ అవుతున్న సంకేతాలు వెలువడ్డాయి. మరోవైపు తమ్ముని బాటలోనే వెంకట్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళతారన్న ప్రచారం జోరందుకుంది. దీనిని వెంకట్ రెడ్డి డైరెక్టుగా ఖండించకపోవడంతో ఆ ప్రచారమే నిజమవుతుందా అనిపిస్తోందిపుడు. ఇదిలా వుండగా.. కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా వున్న డా. దాసోజు శ్రవణ్ సడన్‌గా పార్టీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్  అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రవణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా టీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన విజయారెడ్డి (దివంగత నేత పీజేఆర్ కూతురు)కి ఖైరతాబాద్ టిక్కెట్ ఇవ్వడం కన్‌ఫర్మ్ కావడంతో శ్రవణ్ పార్టీ వీడేందుకు రెడీ అయ్యారు.అధికార టీఆర్‌ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచేందుకు కాంగ్రెస్‌, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అసంతృప్తి నేతలు కమలం పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌కు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పటంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

 

 

 

భువనగిరి ఎంపీగా ఉన్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌ని వీడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతకు ముందు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి దాదాపు రాజీనామా చేశారు. ఐతే, సీనియర్ల బుజ్జగింపుతో ప్రస్తుతం ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇలా ఒకరి తరువాత ఒకరు పార్టీ వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజానికి తెలంగాణాలో కాంగ్రెస్‌ సంస్థాగతంగా బలమైన పార్టీ. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఇప్పటికీ ఆ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉంది. ఇప్పటికీ అధికారంలో రాగల సత్తా ఉన్న కాంగ్రెస్‌ను ఎందుకు వీడుతున్నారనేది ప్రశ్న. పోనీ, కాంగ్రెస్‌ను వీడి అధికార టీఆర్‌ఎస్‌ లోకి వెళితే స్వప్రయోజనాల కోసం అనుకోవచ్చు. కానీ క్షేత్ర స్థాయిలో నామ మాత్రంగా ఉన్న బీజేపీలోకి ఎందుకు ఎంచుకుంటున్నారు? అంటూ పార్టీ బలంతో కాకుండా తమ స్వంత బలంతో గెలుస్తామనే ధీమా కావచ్చు. అలా ఎంతమంది సొంత బలంతో ఎమ్మెల్యేలుగా గెలుస్తారో తెలియదు. తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్‌ జనంలోకి ఎలా దూసుకు వెళ్లిందో… తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను అంతే బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. దీనికి తోడు గత ఎన్నికల్లో చేసిన వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీ విజయావకాశాలను ఘోరంగా దెబ్బతీశాయి.

 

 

 

 

గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో ఫిరాయింపులు పోగా మిగిలింది ఆరుగురు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటే ఇటు అసెంబ్లీలో.. అటు రాష్ట్రంలో ఆ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అవుతుందని బహుశా కేసీఆర్‌ అనుకుని ఉంటారు. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిన బీజేపీ తనకు ప్రధాన ప్రత్యర్థిగా అవతరిస్తుందని ఆయన ఊహించి ఉండరు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోతే తనకు ఇక ఎదురు ఉండదనే అనే అంచనాలు పూర్తిగా తప్పాయి. ఊహించని విధంగా బీజేపీ ఎదుగుతోంది.ఇక మళ్లీ కాంగ్రెస్‌ విషయానికొస్తే.. మొదటి నుంచి ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలు..అసమ్మతి..అంతర్యుద్ధానికి పెట్టింది పేరు. సీనియర్లను కాదని టీడీపీ నుంచి వచ్చిన జూనియర్‌ రేవంత్‌ రెడ్డికి పీసీసీ పదవి కట్టబెట్టినప్పటి నుంచి ఇంటిపోరు ఓ రేంజ్‌లో సాగుతోంది. సీనియర్లు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం కూడా మునపటిలా బలంగా లేకపోవటంతో ఒకరు చెబితే వినే పరిస్థితిలో ప్రస్తుతం ఆ పార్టీ నేతలు లేరు. దాంతో నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే పరిస్థితిలో ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీకి డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దుస్థితికి దిగజారటానికి ఇంటిపోరే ప్రధాన కారణం.ఇక ప్రస్తుతం కోమటిరెడ్డి ఎపిసోడ్‌తోనే తలలు పట్టుకున్న కాంగ్రెస్‌ నేతలకు ఊహించని విధంగా దాసోజు శ్రవణ్‌ రాజీనామా విస్మయానికి గురి చేసింది. రేవంత్‌ రెడ్డి విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఓపెన్‌గానే తమ అసంతృప్తి వెలిబుచ్చారు. కలిసివస్తే మద్దతిస్తామని..

 

 

 

ఒంటెద్దు పోకడలుపోతే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని చెప్పారు. కానీ, దాసోజు ఎప్పుడూ ఏ విషయంలోనూ రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగానీ.. పార్టీ పట్ల తన అసంతృప్తిని గానీ వ్యక్తం చేయలేదు. అయితే ఇటీవల దివంగత కాంగ్రెస్‌ నేత పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరటం పట్ల అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.అయితే ఈ రాజీనామా పర్వాలు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ నుంచి వరుసగా వలసలు వెళ్తుంటే.. ఏం చేయాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు సైతం పాలుపోవడం లేదు. ఇదిలానే కొనసాగితే.. తెలంగాణలో త్రిముఖపోరు కాస్త.. ద్విముఖ పోరుగా మారే అవకాశం ఉంది. గతంలో.. కాంగ్రెస్‌ నుంచి 12 మంది ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లోకి చేరిన నేతలు సైతం.. ఇప్పడు టీఆర్‌ఎస్‌ ని వీడుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ.. చివరికి అందరూ బీజేపీలోకి చేరితే 2024 ఎన్నికల్లో ప్రధాన పోరు టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్యేననేది స్పష్టమవుతోంది.

 

Tags: A range of house war in Tea Congress

Leave A Reply

Your email address will not be published.