Date:14/11/2019
తిరుమల ముచ్చట్లు:
జనవరి 6, 7వ తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని శ్రీవారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు రానున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని టిటిడి అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం మధ్యాహ్నం వివిద విభాగాధిపతులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింతగా భక్తులకు దర్శనం, అన్నప్రసాదాలు, బస తదితర వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలో ఉన్న గదులు, వసతి గృహాలలో భక్తుల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, వసతి విభాగం అధికారులను ఆదేశించారు. తిరుమలలో ముఖ్యమైన ప్రాంతాలైన నారాయణగిరి ఉద్యానవనాలు, రింగ్‌రోడ్డు, మెదరమిట్ట, కల్యాణ వేదిక, బాట గంగమ్మగుడి, తదితర ప్రాంతాలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫర ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల దర్శన సమయం, కంపార్టుమెంట్లు వదులు సమయం, తదితర సమాచారాన్ని రేడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా నిరంతరాయంగా తెలియజేయాలన్నారు. ఈ పర్వదినాలలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముండడంతో భద్రతాపరంగా అవసరమైన పోలీస్ బందోబస్తును నియమించుకోవాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని టిటిడి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో రెండు ఘాట్‌రోడ్లు 24 గంటల పాటు తెరచి ఉంచాలన్నారు.
అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం తిరుపతి, తిరుమలలో మధ్య లగేజి తీసుకువెళ్లె వాహనాలను ఎక్కువసార్లు తిరిగేల చర్యలు తీసుకోవాలన్నారు. ఎపిఎస్ ఆర్టిసి ద్వారా రద్దీకి తగ్గట్టుగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టిసి ఆధికారలును కోరారు. తిరుమలకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ప్రథమ చికిత్స కేంద్రాలు, అదనపు వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, అవసరమైన మందులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు అవసరమైన మరుగుదొడ్లు, సంచార మరుగుదొడ్లు,అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. తిరుమలలోని అన్ని ప్రాంతాలలో దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు, టీ, కాఫీ విరివిగా అందించాలని సూచించారు. నారాయణగిరి ఉద్యానవనాలు, ఇతర ప్రాంతాలలో భక్తులకు మరింత భక్తిభావాన్ని పెంపొందించేలా హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్, విఎస్వో మనోహర్, తిరుమల అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఆర్టిసి ఆర్ఎమ్ చెంగల్‌రెడ్డి, ఎస్ఇలు వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.
శ్రీ కోదండరామాలయానికి బంగారు ఆభరణం విరాళం
Tags:A recent review of the Vaikuntha Ekadasi and Dvadasi arrangements