Natyam ad

రేవంత్ చుట్టూ  సీనియర్ల ఉచ్చు

హైదరాబాద్ ముచ్చట్లు:


రాజకీయాల్లో దూకుడూ చూపించే టీపీసీసీ రేవంత్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కారు. డైనమిజంతో అధికార పార్టీపై ఒంటికాలిపై లేచే రేవంత్.. ఇప్పుడు సొంత పార్టీ నేతల వ్యతిరేక వ్యూహాల నుంచి బయటపడలేకపోతున్నారు. ఒక దశలో తన వల్ల కాదంటూ కంటనీరు పెట్టుకునే పరిస్థితిని కల్పించారు. ఇదే సమయంలో రేవంత్రెడ్డి ముందు మునుగోడు ఉప ఎన్నిక అగ్ని పరీక్ష పెడుతోంది. పార్టీ నేతలు కలిసిరాకపోవడంతో ఓవైపు ఉంటే.. ఇప్పటికే కేడర్ మొత్తం కకావికలమైంది. కాంగ్రెస్ నేతలే కిందిస్థాయి నేతలను ఇతర పార్టీలోకి పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంతర్గత విభేదాలతో ఆ అవకాశాన్ని చేజార్చుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మునుగోడులో ముందుగానే చేతులెత్తేస్తున్నట్లుగా మారాయి.

 

 

 

సొంత పార్టీ నేతలే తనను ముంచేందుకు కంకణం కట్టుకున్నారని కంటనీరు పెట్టుకున్నారు. రేవంత్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో మరింత సంచలనంగా మారింది. అయితే, ఈ ఆడియో 2018 ఎన్నికల నాటిది అంటూ పార్టీ నేతలు వివరణ ఇస్తున్నారు. 2018 ఎన్నికల నాటిదే ఆడియో అని చెప్తుంటే.. అప్పటికీ రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాదు అని, ఆ ఆడియో ప్రస్తుతానిదేనని రేవంత్ వర్గం ఎదురు సమాధానమిస్తోంది.మునుగోడు అభ్యర్థి విషయంలోనే రేవంత్, నల్గొండ సీనియర్లు వేర్వేరు వర్గంగా మారిపోయింది. రేవంత్ టీం కృష్ణారెడ్డికి మద్దతు ఇస్తే.. ఉమ్మడి జిల్లా నేతలంతా స్రవంతి వైపు నిలిచారు. ఎట్టకేలకు స్రవంతి ఖరారు అయ్యారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. స్రవంతికి పట్టుబట్టీ టికెట్ ఇప్పించిన వారిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ ఉత్తమ్, రాంరెడ్డి దామోదర్ రెడ్డి వంటి నేతలంతా స్రవంతి కోసం ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు ఫలించినా.. కీలకమైన ప్రచార సమయంలో ఎంపీ వెంకట్ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ కు జరుగుతున్న ఉప ఎన్నిక అయినా ఒక్కరికి కూడా ఆయన కాంగ్రెస్ కు ఓటేయాలని ఇప్పటికీ చెప్పలేదు.

 

 

 

Post Midle

అంతేకాకుండా ఆయన సోదరుడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి అండగా ఉంటున్నారనే అనుమానాలున్నాయి. అయితే, స్రవంతికి టికెట్ రావడంతో రేవంత్ రెడ్డి కూడా ముందుగా కొంత ఊపిరి తీసుకున్నారు. తాను టికెట్ వద్దన్నవారికే ఇవ్వడంతో గెలుపోటములతో తమకేం సంబంధం లేదన్నట్టే ఉండేలా తొలుత వ్యవహరించారు. కానీ, ఏఐసీసీ దీనిపై సీరియస్ ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన ప్రచార రంగంలోకి దిగారు. ఇదే సమయంలో నల్గొండ ఉమ్మడి జిల్లా సీనియర్లు సైలెంట్ అయ్యారు. ప్రచారపర్వానికి అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. జానారెడ్డి ఇప్పటికే గెస్ట్ రోల్ ప్లే చేస్తూనే ఉన్నారు. ఎంపీ ఉత్తమ్ అప్పుడప్పుడూ కనిపిస్తున్నా.. జోడో యాత్ర బిజీలో ఉంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు.మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ కే కీలకం. ఇక్కడ విజయం సాధిస్తే పార్టీలో అంతర్గత విభేదాలకూ చెక్ పడిందనే సంకేతాలు పార్టీ కేడర్ కు ఇవ్వవచ్చు. టీపీసీసీ చీఫ్ రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతమైందన్న వాదనకూ బలం చేకూరుతుంది. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన నాటి నుంచీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వ్యవహారాలతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు.

 

 

 

ఆయన బీజేపీకి దగ్గరౌతున్నారన్న సంకేతాలూ ఉన్నాయి. అయినా కూడా కాంగ్రెస్ ఆయనపై చర్య తీసుకునే సాహసం చేయలేదు. పైపెచ్చు చివరి నిముషం వరకూ బుజ్జగింపుల పర్వం కొనసాగించి.. అనవసరమైన ప్రాధాన్యత పెంచింది. దానిని అలుసుగా తీసుకునే ఆయన.. రేవంత్ పై విమర్శలతో చెలరేగిపోయారు. రాజగోపాలరెడ్డి, వెంకటరెడ్డి ద్వయం విమర్శలను దీటుగా ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ సీనియర్లు ఏ మాత్రం చొరవ తీసుకోలేదు. అదేదో పార్టీకి సంబంధించి విషయం కాదన్నట్లుగా, రేవంత్ రెడ్డి వ్యక్తిగత వ్యవహారమన్నట్లుగా మౌనం వహించారు.టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక దారుణ ఫలితాన్ని చూపించింది. అంతకు ముందు 62 వేల ఓట్లు సాధించుకున్న కాంగ్రెస్.. ఉప ఎన్నికలో మాత్రం 3 వేలకు పడిపోయింది. డిపాజిట్ కూడా రాలేదు. ఇక్కడ అభ్యర్థి విషయంలోనే రేవంత్ తప్పు చేశారని పార్టీ మొత్తం వేలెత్తి చూపించింది. అంతేకాకుండా ఇన్ డైరెక్ట్ గా ఈటల రాజేందర్ కు మద్దతు ఇచ్చారనే అపవాదు కూడా మీద పడింది. మునుగోడు ఉప ఎన్నిక వేళ హుజురాబాద్ మళ్లీ చర్చకు వస్తోంది. ఇదే సమయంలోనూ రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎవరూ సహకరించడం లేదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ఇక్కడ ఫెయిల్యూర్ ను చూపించి, పీసీసీ పదవి నుంచి తొలిగించే కుట్రలు జరుగుతున్నాయని,

 

 

 

దీనికి పార్టీలోని కొంతమంది సహాకరిస్తున్నారని, బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు.ఇదే సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో కలకలం సృష్టిస్తోంది. రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలంటూ మునుగోడుకు చెందిన కాంగ్రెస్ నేతతో ఆయన ఫోన్ లో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఈ ఆడియోలో చాలా అంశాలు బయటకు వచ్చాయి.ఏ పార్టీలో ఉన్నా.. రాజగోపాల్ రెడ్డి ఆపద సమయంలో ఆదుకుంటాడని, ఆయనకే ఓటేయాలంటూ వెంకట్ రెడ్డి మునుగోడు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత జబ్బార్ కు ఫోన్ లో చెప్పిన విషయం బయటకు వచ్చింది. ఇది వివాదంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత జబ్బార్ నుంచి మరో ఆడియోను విడుదల చేశారు. ఇది 2018 ఎన్నికల సందర్భంగా మాట్లాడారని, అప్పుడు రాజగోపాల్ రెడ్డి కోసం వెంకట్ రెడ్డి మాట్లాడారని, దాన్ని ఇప్పుడు కొత్తగా సృష్టించి వెంకట్ రెడ్డి మీద బురద జల్లేందుకు ఫేక్ ఆడియో పెట్టారని, ఇది అవాస్తమంటూ విడుదల చేశారుహస్తం పార్టీలో ఈ ఆడియో ప్రకంపనలు సృష్టించడంతో.. పార్టీ నేతలు దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది 2018 ఎన్నికల నాటి ఆడియో అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ, కొన్ని అంశాలపై వెంకట్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నాయి. ఈ ఫలితాన్ని సాకుగా చూపించి, తానే పీసీసీ చీఫ్ అవుతానని, రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తానని, అధికారంలోకి వస్తామంటూ వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. వాస్తవంగా 2018 ఎన్నికల నాటి ఆడియో అయితే.. అప్పటికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాదు. అప్పటికి పాదయాత్ర చేసే అవకాశం కూడా లేదు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక సాకుగా రేవంత్ రెడ్డిని తొలిగిస్తే పీసీసీ చీఫ్ పదవి తనకు వస్తుందంటూ ఎంపీ వెంకట్ రెడ్డి మాట్లాడిన సారాంశం.

 

 

 

 

అంతేకాకుండా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు. అప్పుడు వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు. అంతేకానీ, వేరే పార్టీలో లేరు. కానీ, వెంకట్ రెడ్డి మాట్లాడినప్పుడు మాత్రం ఏ పార్టీలో ఉన్నా రాజగోపాల్ రెడ్డి మనోడే అన్నట్టుగా మాట్లాడారు. ఈ ఆడియో ఏఐసీసీ దాకా చేరడంతో దాన్ని కవర్ చేసేందుకు పార్టీ శ్రేణులను రంగంలోకి దింపినట్లు విమర్శలున్నాయి.మునుగోడు ఉప ఎన్నికతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంలో అనుకున్నదే జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీని కాదని పార్టీని వీడిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలని వెంకట్ రెడ్డి ఓటర్లను అభ్యర్థిస్తున్న ఓ ఆడియో క్లిప్ తాజాగా దుమారం రేపుతున్నది. ఈ ఆడియో టేపు ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి ఫిర్యాదు అందడం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని అతడిపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేశారు. వెంకట్ రెడ్డి మాట్లాడినట్లు చెప్పబడుతున్న ఆడియో క్లిప్ ను సైతం వారికి పంపించారు. దీంతో వెంకట్ రెడ్డిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది చర్చగా మారింది.

 

Tags: A trap of seniors around Revanth

Post Midle