సౌత్ లో సవారీకి ద్విముఖ వ్యూహం

Date:18/10/2019

చెన్నై ముచ్చట్లు:

దక్షిణాదిన పార్టీలను భారతీయ జనతా పార్టీ భయపెడుతోంది. ఏదో రూపంలో ఇక్కడ పాగా వేసేందుకు కమలం పార్టీ వ్యూహాత్మకంగానే కదులుతోంది. ఇప్పటికే కర్ణాటకను సొంతం చేసుకుంది. తెలంగాణలో సైతం సొంతబలంతో ఎదగాలని చూస్తోంది. కేరళలో పగ్గాలు చేపట్టడమనేది చివరి మజిలీ. మధ్యలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల సంగతి కూడా చూడాలనేది ఎత్తుగడ. ఇందుకుగాను ద్విముఖ వ్యూహం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ సొంతంగా బరిలో నిలిచినా గెలిచే అవకాశాలు అంతంతమాత్రమే. తమిళనాడులో ఏఐఏడీఎంకేతో పొత్తు పెద్దగా ఓట్లు కురిపించే సూచనలు కనిపించడం లేదు. రజనీకాంత్ ను బరిలోకి లాగడం ద్వారా లబ్ది పొందాలని యోచిస్తోంది. అదేవిధంగా తెలుగుదేశాన్ని పావుగా చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిర్దేశించాలని చూస్తోంది. కేరళలో తనకు అనుకూలంగా చిన్నచితక పార్టీలను జతకూర్చి బలం పుంజుకోవాలనుకుంటోంది. ఈ స్ట్రాటజీలను గమనించిన వారు టార్గెట్ సౌత్ ఇండియా 2020 నుంచి బీజేపీ అజెండాలో ప్రధానాంశం కాబోతోందని అంచనా వేస్తున్నారు.జయలలిత మరణం తర్వాత తమిళనాట డీఎంకే బలమైన శక్తిగా ఆవిర్భవించింది. ఏఐఏడీఎంకే క్రమేపీ ప్రజల్లో బలాన్ని కోల్పోతోంది.

 

 

 

 

ఆపార్టీకి కేంద్రంలోని బీజేపీ గాడ్ ఫాదర్ గా వ్యవహరిస్తోంది. అధికారంలో కొనసాగించడం మొదలు రాజకీయంగా అన్నిరకాలుగా అండదండలిస్తోంది. ప్రభుత్వం కూలిపోకుండా ,ఫిరాయింపులు సాగకుండా రక్షణ బాధ్యతలను తానే తీసుకొంటోంది. ఎంతగా అండదండలిస్తున్నప్పటికీ అత్తెసరు పాలనతోనే నెట్టుకొస్తోంది ఏఐఏడీఎంకే. మరో ఏడాదిన్నరలో అక్కడ ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీ తనంతతానుగా పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఏదో ఒక ప్రధాన పార్టీతో జట్టు కట్టాల్సిందే. రజనీ కాంత్ వంటి సూపర్ స్టార్ రంగంలోకి వస్తే అతని అండతో తమిళనాట పాదుకోవాలనేది బీజేపీ దీర్ఘకాలిక వ్యూహం. కానీ తమిళ తలైవా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికైనా పార్టీకి సంబంధించి నిర్ణయం తీసుకుని అతను ముందుకొస్తే పూర్తి స్థాయి అండదండలిచ్చేందుకు బీజేపీ సిద్ధంగానే ఉంది. అయితే ఏఐఏడీఎంకే ను వదులుకోక తప్పదు. ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ సందర్భంగా తమిళ సెంటిమెంటును సంతృప్తిపరిచే విధంగా ప్రవర్తించారు ప్రధాని . తమిళ సంస్కృతి సంప్రదాయాలకు పట్టం గట్టడమే కాకుండా తాను ధరించే దుస్తుల్లో సైతం వారినే సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు.

 

 

 

 

సమావేశ వేదిక ఎంపిక లోనే భవిష్యత్ రాజకీయ లక్ష్యం దాగి ఉందని చెప్పవచ్చు.మరోవైపు ఆంధ్రాలో పరిస్థితులు ఆశించిన దానికంటే వేగంగానే బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయి. చంద్రబాబు నాయుడు పూర్తిగా చేతులెత్తేసినట్లే. బీజేపీతో విభేదించడం వల్ల టీడీపీ నష్టపోయిందని కార్యకర్తలకు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రానికీ లాభం జరగలేదనడం ద్వారా కేంద్రంతో సయోధ్య పెంచుకుని ముందుకు వెళ్లాలనే ఉద్దేశాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద లాబీయింగ్ టీమ్ టీడీపీ, బీజేపీ పొత్తుకు పెద్ద ఎత్తున కృషి కొనసాగిస్తోంది. పరస్పరం గెలిచినట్లు కనిపించే ప్రాతిపదికన పొత్తు కుదిరితే మంచిదన్న భావన టీడీపీ వర్గాల్లో ఉంది. బీజేపీలో భిన్నాభిప్రాయాలున్నాయి. టీడీపీ పొడగిట్టని నాయకులు చాలామంది ఉన్నారు. అయితే వారంతా పాత తరం బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చినవారు. టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగితే కమలం పార్టీ వైఖరి తటస్థంగా మారేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి నియోజకవర్గాల స్థాయిలో కూడా నాయకులు వచ్చి చేరుతున్నారు.

 

 

 

వీరిలో అధికులు టీడీపీ నుంచే వస్తున్నారు. అందువల్ల అభిప్రాయసేకరణ జరిపితే టీడీపీ, బీజేపీ పొత్తుకు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవచ్చంటున్నారాజకీయ పార్టీల్లో పోరాట పటిమ పూర్తిగా సన్నగిల్లిపోతోంది. గతంలో ప్రజాసమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు చేయడం ద్వారా ప్రభుత్వాలకు చెక్ చెప్పేవారు. తమ పార్టీలకు ఆదరణ తెచ్చుకునేవారు. ప్రభుత్వం సైతం ప్రజాసంక్షేమం, అభివృద్దిపై ఎక్కువగా దృష్టి పెడుతుండేది. ప్రజాక్షేత్రంలో పోరాటాల స్థానంలో కేసులు,న్యాయస్థానాల్లో పోరాటం ప్రధాన రాజకీయ సమరంగా మారిపోయింది. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తల్ని కేసుల పేరిట ఇబ్బందుల పాలు చేస్తోంది. ప్రతిపక్షాలు రకరకాల ఫిర్యాదులతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాయి.

 

 

 

 

 

 

ఒకరకంగా చెప్పాలంటే ప్రజలపై విశ్వాసాన్ని ఏ పార్టీ కూడా వ్యక్తం చేయడం లేదనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రాంతీయ పార్టీల అగ్రనాయకులను సైతం నియంత్రణలోకి తెస్తోందనే భావన వ్యక్తమవుతోంది. మొత్తమ్మీద భారత రాజకీయాల్లో కొత్త శకం ప్రవేశించింది. కాంగ్రెసు కూడా గతంలో ప్రత్యర్థులను బెదిరించడానికి దర్యాప్తు సంస్థలను అస్త్రంగా ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి. కానీ భారతీయ జనతాపార్టీ దానికంటే రెండాకులు ఎక్కువే చదివింది. అష్టదిగ్బంధనం చేస్తోంది. ఫలితంగా ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు పూర్తిగా నిర్వీర్యమైపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

తెలుగు రాష్ట్రాల్లో ద్రవిడ రాజకీయాలు

Tags: A two-pronged strategy for riding in the South

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *