పుంగనూరులో ఎంపీ మిధున్‌రెడ్డికి ఘన స్వాగతం
పుంగనూరు ముచ్చట్లు:
లోక్‌సభ ప్యానల్ స్పీకర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి కి సోమవారం పట్టణంలో ఘన స్వాగతం లభించింది. మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 1,2, 31 వార్డులలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయా వార్డులలో బాణాసంచాలు పేల్చి, హారతులు ఇచ్చి ఎంపీకి స్వాగతం పలికారు. ఎంపీ ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని పీఏల ద్వారా నమోదు చేయించుకుని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తయిండ్లు సచివాలయాన్ని తనిఖీ చేసి, కార్యదర్శులతో చర్చించారు. అలాగే పట్టణంలోని హిదయత్నగర్లో రోడ్డు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. మంగళం కాలనీలలో బోరునీటిని ప్రారంభించారు. అక్కడే జగనన్న సంపూర్ణపోషణ పథకం క్రింద గర్భవతులకు పోషక పదార్థాలు పంపిణీ చేశారు. చింతపండు కార్మికురాలతో చర్చించారు. ఆటోమెకానిక్ల సంఘ ప్రతినిధులు రాజారెడ్డి, మస్తాన్ ల ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులకు అందరికి ఇండ్ల స్థలాలు తక్షణమే కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హిదయత్నగర్లో మసీదు పెద్దలతో సమావేశమై మసీదుకు రూ.5 లక్షలు మంజూరు చేశారు. అలాగే కొత్తయిండ్లు హైస్కూల్లో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఎంపీ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తమ కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించి , చైతన్యపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, జెడ్పిటిసి జ్ఞానప్రసన్నతో పాటు కౌన్సిలర్లు, ప్రజాప్రతిన్యిధులు పాల్గొన్నారు.

Tags: A warm welcome to MP Midhun Reddy in Punganur
