ఆప్ వర్సెస్ బీజేపీ…
న్యూఢిల్లీ ముచ్చట్లు:
మద్యం విధానంలో అవకతవకల ఆరోపణలు ఢిల్లీలో బీజీపీ-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజకీయ రచ్చ రాజేస్తున్నాయి. రాజకీయ కుట్రలో భాగంగానే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను పై అక్రమ కేసులు బనాయించారని ఆప్ ఆరోపిస్తుంటే.. మద్యం విధానంలో అవకతవకలపై నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పోటా పోటీ ఆరోపణల నేపథ్యంలో మనీష్ సిసోడియా తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తాను బీజేపీలో చేరితే సీబీఐ, ఈడీ కేసులు మాఫీ చేస్తామంటూ ఆఫర్ బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. .ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తే.. తనపై ఉన్న అన్ని కేసులు కొట్టేస్తామంటూ హామీ ఇచ్చారన్నారు. ఈవిషయాన్ని మనీష్ సిసోడియా నేరుగా ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు బీజేపీ నుంచి ఓ సందేశం వచ్చిందని, సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్ని క్లోజ్ చేసేందుకు బీజేపీలో చేరాలని ఆ సందేశంలో కోరినట్లు తెలిపారు. అయితే ఆ సందేశం ఎవరి నుంచి వచ్చిందనేది పేరును వెల్లడించలేదు. తాను రాజ్ పుత్ నని, మహా రాణా ప్రతాప్ వారసుడినని, తలనైనా నరుక్కుంటాను కానిచ అవినీతి, కుట్రదారుల ముందు తలవంచబోనని ట్వీట్టర్ లో స్పష్టంచేశారు. నాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే, మీరు ఏంచేయాలనుకుంటే అది చేసుకోండి.. నాకొచ్చిన సందేశానికి ఇదే నా సమాధానం అంటూ మనీష్ సిసోడియా ఘాటుగా స్పందించారు.
ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరబ్ భరద్వాజ్ స్పందిస్తూ.. మనీష్ సిసోడియాకు బీజేపీ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయని.. వాటిని ఆయన లెక్క చేయలేదన్నారు. బీజేపీ బెదిరింపులకు ఆమ్ ఆద్మీ భయపడబోదన్నారు. ఇదిలా ఉండగా.. గత ఏడాది నవంబర్ లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం విధానంలో అనేక అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘనతో పాటు.. విధానపరమైన లోపాలున్నాయని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఢిల్లీ లెప్టింనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేశారు. దీంతో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు మాజీ అధికారుల ఇళ్లు, ప్రాంగణాలపై సీబీఐ అధికారులు సోదాలు చేశారు. అలాగే మనీష్ సిసోడియాతో పాటు మద్యం విధానంలో అవకతకవల ఆరోపణలెదుర్కొంటున్న కేసులో 8మందిపై లుకౌట్ నోటీసులు సీబీఐ జారీ చేసింది.మద్యం విధానంలో అవకతవకలపై నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షులు ఆదేశ్ గుప్తా నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. ఢిల్లీ సివిల్ లైన్స్ లోని అరవింద్ కేజ్రీవాల్ ఇంటి బయట పెద్ద ఎత్తున్న బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ పోటాపోటీ విమర్శలు, ఆరోపణలతో హస్తినలో రాజకీయం వాతావరణం వేడెక్కుతోంది.

మనీష్… భారత రత్నకు అర్హుడు
మరో వైపు దేశంలో 70 ఏళ్లలో ఏ పార్టీ చేయని విధంగా ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించి.. విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులకు డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు భారతరత్న ఇచ్చి.. దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పలు తీసుకొచ్చే బాధ్యత ఆయనకు అప్పగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈఏడాది చివరిలో గుజరాత్ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మనీష్ సిసోడియాతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా మీడియాతో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన వ్యక్తికి దేశ విద్యావ్యవస్థ బాధ్యతలను అప్పగించాల్సింది పోయి అక్రమ కేసులు బనాయించి సీబీఐ దాడులతో వేధిస్తున్నారని కేంద్రప్రభుత్వ వైఖరిపై అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. మనీష్ సిసోడియా వంటి వ్యక్తులను భారత రత్నతో గౌరవించుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో నూతన మద్యం విధానాల అవకతవకల ఆరోపణల కేసులో సీబీఐ దర్యాప్తు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనర్హం. నెలలోపు ఐదోసారి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఈసారి మనీష్ సిసోడియాతో కలిసి ఆయన పర్యటించడం విశేషం. ఈసందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై అరవింద్ కేజ్రీవాల్ గుజరాతీ ప్రజలకు మరిన్ని హామీలు గుప్పించారు.
గుజరాతీలకు నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందించే బాధ్యతను ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంటుందని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తామన్నారు. అవసరమైతే మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు నూతన ఆసుపత్రులను నిర్మిస్తామన్నారు.ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీకి సీఎం అభ్యర్థిలేరని తాను ఆమ్ ఆద్మీని వదిలివస్తే ముఖ్యమంత్రిని చేస్తారని.. దీనిలో భాగంగానే బీజేపీలో చేరితే తనపై కేసులు మూసివేస్తామనే సందేశాన్ని పంపారని ఆరోపించారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ లో సువేందు అధికారి, అస్సాంలో హిమంత బిస్వా శర్మను బీజేపీలో చేర్చుకుని.. తగిన ప్రాధాన్యత కల్పించామన్న విషయన్ని గుర్తించుకోవాలని తనకు సందేశం పంపిన వ్యక్తి చెప్పారని అహ్మదాబాద్ లో మరోసారి మనీష్ సిసోడియా ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు. తాను సీఎం కావాలని కలలు కనడం లేదని, ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలని మాత్రమే కలలు కంటున్నాను.. అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే ఈవాగ్దానాన్ని నెలవేర్చగలరని సిసోడియా పేర్కొన్నారు.
Tags: AAP Vs BJP…
