సగానికి సగమే హాస్టళ్లలో విద్యార్ధులు

Date:15/09/2018
ఏలూరు ముచ్చట్లు:
సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల వసతిగృహాల్లో ఇన్నాళ్లూ లేని పిల్లలను చూపించి వారి పేరుతో రూ.కోట్లు పక్కదోవ పట్టించారనే అంచనాల్లో జిల్లా అధికారులు ఉన్నారు.జిల్లాలో 80 సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో 8400 మంది విద్యార్థులు ఉండేందుకు సామర్ధ్యం ఉంది.
ఈ వసతిగృహాల్లో 6597 మంది విద్యార్థులు రిజిస్ట్రేషను చేయించుకున్నారు. తీరా బయోమెట్రిక్‌ హాజరు విధానం ప్రవేశపెట్టడంతో 4000మంది మాత్రమే ఉన్నట్లు తేలింది. అలాగే 61 బీసీ వసతిగృహాల్లో 5096 మంది వసతి పొందడానికి అవకాశం ఉండగా వీటిల్లో 3373 మంది నమోదు అయి ఉన్నారు. బయోమెట్రిక్‌ హాజరు 2901 మంది మాత్రమే వేస్తున్నారు.
నమోదుకు.. హాజరుకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఎస్సీ, బీసీ వసతిగృహాల్లో కలిపి 3069 మంది హాజరు కావడం లేదని గుర్తించారు. నమోదై ఉండి బయోమెట్రిక్‌ హాజరు వేయకపోతున్నారంటే ఈ పిల్లలపేరుతో వచ్చే సొమ్ము సంక్షేమ శాఖాధికారులు పక్కదోవ పట్టించేస్తున్నారని జిల్లా కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 30వతేదీన సంక్షేమ అధికారుల సమీక్షా సమావేశంలో ఈ విషయమై జిల్లా కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సాంఘిక సంక్షేమ సంఘ ఉపసంచాలకులకు ఆదేశించారు. నాలుగేళ్లగా వసతిగృహాల్లో హాజరు, వాస్తవంగా ఎంతమంది విద్యార్థులు వసతిగృహాల్లో ఉండేవారనే విషయమై విచారణ నిర్వహిస్తున్నారు.
ఈ విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వడానికి మరో పదిరోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వసతిగృహ సిబ్బంది నమోదు చేసి జిల్లా అధికారులకు పంపించిన వివరాలే శిలాశాసనంగా భావించి బిల్లులు తీసుకునేవారు. వాటిపై పర్యవేక్షణ ఉండేది కాదు.
దాంతో వసతిగృహాల్లో అక్రమాలు యథేచ్ఛగా నడిచాయి. లేని విద్యార్థుల పేర్లతో బిల్లులు పొంది కిందనుంచి పైవరకు అధికారులు పంచుకునేవారు. ప్రస్తుతం బయోమెట్రిక్‌ హాజరు విధానం ప్రవేశపెట్టడంతో వసతిగృహాల్లో జరిగే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
రూ.కోట్లలోనే అక్రమాలు.. హాజరు పేరుతో రూ.కోట్లలో అక్రమాలు జరిగి ఉంటాయని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. భోజనాలు, కాస్మొటిక్‌ ఛార్జిలు, దుప్పట్లు, కంచాలు, గ్లాసులు, ఏకరూప దుస్తులు ఇవన్నీ పక్కదోవ పట్టాయని అధికారులు అంచనావేస్తున్నారు.
వీటన్నింటికీ ఒక నెలలో ఒక విద్యార్థికి సుమారుగా రూ.వెయ్యి వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. నమోదుకు, హాజరుకు మధ్య వ్యత్యాసం 3069 మంది. ప్రతి విద్యార్థికి వెయ్యి చొప్పున అంచనా వేస్తే ఒక నెలలో రూ.30.69లక్షలు.
అంటే ఏడాదికి రూ.3.68కోట్లు పక్కదోవ పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ దోపిడీ గత కొన్నేళ్లుగా జరుగుతోందని దీనిపై పూర్తి విచారణ చేయాల్సి ఉంది.వసతిగృహాల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యకూ బయోమెట్రిక్‌ హాజరు సంఖ్యకూ మధ్య చాలా వ్యత్యాసం కనిపించడంతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనే అంచనాకు అధికారులు వచ్చారు.
ఈ వ్యత్యాసం సొమ్ము రూ.కోట్లలో ఉంటుందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై విచారణ జరిపించి తిన్నదంతా కక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Tags: About half of the students are hostels

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *